మాటలు ఘనం... కేటాయింపులు అంతంతమాత్రం
ఇక టోల్ బాదుడే
బడ్జెట్ కేటాయింపు ముసుగులో కనికట్టు
ఇదీ కూటమి ప్రభుత్వ రోడ్ల నిర్మాణ ప్రణాళిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వ విధానం మేడిపండును గుర్తుకు తెస్తోంది. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.9,554 కోట్లు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కానీ కేటాయింపులను పరిశీలిస్తే టీడీపీ కూటమి ప్రభుత్వ కనికట్టు బట్టబయలైంది. వాహనదారులపై ‘టోల్ ఫీజుల’ భారీ బాదుడే తమ విధానమని చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ సాక్షిగా తేల్చిచెప్పింది. పోనీ రోడ్ల నిర్మాణం కోసం నిధుల కేటాయింపు అయినా సక్రమంగా చేశారంటే అదీ లేదు.
పీపీపీ విధానంలోనే..
అత్యంత ముఖ్యమైన రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులన్నీ కూడా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలోనే నిర్మిస్తామని బడ్జెట్‌లో ప్రభుత్వం స్పష్టం చేయడం గమనార్హం. అంటే ఇక రోడ్డు ఎక్కితే వాహనదారులపై టోల్ ఫీజుల బాదుడు తప్పదన్నది సుస్పష్టం. ఇప్పటి వరకు జాతీయ రహదారులను మాత్రమే పీపీపీ విధానంలో నిర్మిస్తున్నారు. టోల్‌వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర రహదారులను పీపీపీ విధానంలో నిర్మించ లేదు. ఇక మీదట జిల్లా ప్రధాన కేంద్రాలు, మండల ప్రధాన కేంద్రాలను అనుసంధానించే రాష్ట్ర రహదారులపై ప్రయాణించినా టోల్ ఫీజు బాదుడు భరించాల్సిందేనని ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంటే తక్కువ కేటాయింపులే
గుంతలు లేని రోడ్లు అంటూ ప్రచారార్భాటం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి మాత్రం అరకొర కేటాయింపులతోనే సరిపుచ్చింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023–24లో కేటాయింపుల కంటే టీడీపీ కూటమి ప్రభుత్వం 2024–25లో తక్కువ నిధులు కేటాయించడం గమనార్హం.
⇒ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్ అండ్ బీ శాఖకు అన్ని పద్దుల కింద 2023–24లో రూ.8,766.89 కోట్లు కేటాయించింది. కానీ ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం రూ.8,322 కోట్లు మాత్రమే కేటాయించింది.
⇒ రైల్వే పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, వంతెనల నిర్మాణం, జిల్లా ప్రధాన, ఇతర రహదారులు, రహదారి భద్రత పనులు, తుంగభద్ర పుష్కర పనులు, రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారుల ఉన్నతీకరణ పనులకు కలిపి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023–24లో రూ.725.92 కోట్లు కేటాయించింది. 2024–25కుగాను టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.468.88కోట్లే కేటాయించడం గమనార్హం.
⇒ ఆర్‌ఐఏడీ కింద మారుమూల ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి నిధులు, ఎన్‌డీబీ బ్యాంకు రుణ సహాయం, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, గ్రామీణ రోడ్లు, ఎన్‌ఆర్‌ఈజీపీ నిధులతో రోడ్ల నిర్మాణం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023–24లో రూ.1,481.59 కోట్లు కేటాయించింది. కాగా చంద్రబాబు ప్రభుత్వం అవే పనులకు 2024–25లో రూ.721.78కోట్లే కేటాయించి చేతులు దులిపేసుకుంది.
⇒ ఏలూరు–గుండిగొలను–కొవ్వూరు రహదారి నిర్మాణంలో భాగంగా గోదావరి నదిపై వంతెన నిర్మాణం, కడప యాన్యూటీ పనులు, రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణం పనులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023–24లో రూ.1,472.51కోట్లు కేటాయించింది. కాగా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం 2024–25 బడ్జెట్‌లో రూ.1,115.68 కోట్లే కేటాయించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment