సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ సీట్లలో దివ్యాంగ కోటాకు కేటాయించిన 121 ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విభాగంలో మొత్తం 182 సీట్లు ఉండగా 61 మంది మాత్రమే అర్హులైన విద్యార్థులున్నారు. వీరందరికీ ఆదివారం హెల్త్ వర్సిటీ సీట్లు కేటాయించింది. విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఎంబీబీఎస్ తరగతులు ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతాయి. మిగిలిపోయిన 121 సీట్లను ఆర్‌ఓఆర్ ఆధారంగా సాధారణ విద్యార్థులకు కేటాయిస్తారు.
ఆలస్య రుసుము లేకుండానే..
2024–25 విద్యా సంవత్సరానికి మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా సోమవారం రాత్రి 9 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. శుక్రవారంతో దరఖాస్తుల గడువు ముగియగా, శని, ఆది, సోమవారాల్లో ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తొలుత అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుము కన్నా ఆలస్య రుసుముతో విధించిన పెనాల్టీ అధికంగా ఉందని అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆలస్య రుసుమును మినహాయించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ 8,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఎన్‌ఎంసీ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. గతంలో లాగానే కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు సీట్ మ్యాట్రిక్స్ ను ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment