handicapped reservations
-
దివ్యాంగ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ సీట్లలో దివ్యాంగ కోటాకు కేటాయించిన 121 ఎంబీబీఎస్ సీట్లు మిగిలిపోయాయి. ఈ విభాగంలో మొత్తం 182 సీట్లు ఉండగా 61 మంది మాత్రమే అర్హులైన విద్యార్థులున్నారు. వీరందరికీ ఆదివారం హెల్త్ వర్సిటీ సీట్లు కేటాయించింది. విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల్లోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి. ఎంబీబీఎస్ తరగతులు ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతాయి. మిగిలిపోయిన 121 సీట్లను ఆర్ఓఆర్ ఆధారంగా సాధారణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఆలస్య రుసుము లేకుండానే.. 2024–25 విద్యా సంవత్సరానికి మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆలస్య రుసుము లేకుండా సోమవారం రాత్రి 9 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. శుక్రవారంతో దరఖాస్తుల గడువు ముగియగా, శని, ఆది, సోమవారాల్లో ఆలస్య రుసుముతో దరఖాస్తుకు తొలుత అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుము కన్నా ఆలస్య రుసుముతో విధించిన పెనాల్టీ అధికంగా ఉందని అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆలస్య రుసుమును మినహాయించారు. ఆదివారం మధ్యాహ్నం వరకూ 8,645 మంది దరఖాస్తు చేసుకున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ఎన్ఎంసీ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. గతంలో లాగానే కౌన్సిలింగ్ ప్రారంభానికి ముందు సీట్ మ్యాట్రిక్స్ ను ప్రకటిస్తామన్నారు. -
శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వికలాంగ (దివ్యాంగ) రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు తాత్కాలిక వైకల్య ధ్రువీకరణ(టెంపరరీ డిజేబుల్డ్ సర్టిఫికెట్)తో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో అవకాశం కల్పించగా... ఇప్పుడు ఆ ప్రయోజనాలను నిలిపివేసింది. తాత్కాలిక వైకల్యంతో ఉన్న వ్యక్తికి కొంత కాలం తర్వాత వైకల్య స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పు తాలుకు ఫలితం వైకల్యం నయమవ్వడం లేదా శాశ్వత వికలాంగుడిగా మారడంలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలో వికలత్వ నిర్ధారణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. శాశ్వత నిర్ధారణ సర్టిఫికెట్లే పరిగణించాలని.. ► శాశ్వత వికలత్వ నిర్ధారణ సర్టిఫికెట్లను మాత్రమే పరిగణించాలని, ఇతరత్రా సర్టిఫికెట్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వికలాంగుల సాధికారత, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ అందుకు అనుగుణంగా జీఓ 41 జారీ చేసింది. 40శాతం దాటితేనే... వికలాంగ రిజర్వేషన్ల అమలులో వికలత్వ శాతమే కీలకం. కనీసం 40శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తేనే రిజర్వేషన్ల వర్తింపును ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రతి వికలాంగుడు తప్పకుండా వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. అందులో శాశ్వత ప్రాతిపదిక వైకల్యం ఉన్నట్లయితేనే రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈమేరకు జీఓ 41లో స్పష్టత ఇచ్చింది. తాత్కాలిక వైకల్యం(టెంపరరీ డిజబులిటీ) ధ్రువీకరణ పత్రాన్ని ఇదివరకు అంధ విభాగంలోనే జారీ చేస్తుండగా... ప్రస్తుతం అన్ని కేటగిరీల్లోనూ ఈ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది. మొదటిసారి ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించే ప్రతి వికలాంగుడికి టెంపరరీ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. అతి త్వరలో పరీక్షల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకోగా... వెనువెంటనే ఫలితాలను ప్రకటించి నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాయి. ఈ సమయంలో వికలాంగ రిజర్వేషన్ల అమలులో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వికలాంగ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీఓ 41 ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక సంస్థలకు ప్రత్యేకంగా పంపింది. జీఓ 41లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇది వికలాంగులపై కక్షసాధింపు చర్యః ముత్తినేని వీరయ్య తాత్కాలిక ధ్రువీకరణను రిజర్వేషన్ల అమలులో పరిగణించమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయం. ప్రస్తుతం సదరమ్ ద్వారా జారీ చేస్తున్న సర్టిఫికెట్లన్నీ టెంపరరీ సర్టిఫికెట్లే. కొందరికి రెండు, మూడేళ్లుగా ఇవే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల సమయంలో ఈ అంశాన్ని తీసుకురావడంతో అసలైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశాలున్నాయి. జీఓ 41 జారీ ప్రక్రియ వికలాంగులపై కక్షసాధింపు చర్యగా భావిస్తున్నాం. ఈ ఉత్తర్వులను రద్దు చేసేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. -
22న దివ్యాంగుల కోటా కౌన్సెలింగ్
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సుల్లో, వ్యవసాయ, వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో దివ్యాంగుల రిజర్వేషన్ కోటాలోని సీట్ల భర్తీ కోసం గురువారం (22న)కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్ తెలిపారు. వివిధ విభాగాల డాక్టర్ల బృందం, డీన్స్ కమిటీ అభ్యర్థులు విద్యార్థుల అర్హతలను, సామర్థ్యాలను పరిశీలిస్తారని చెప్పారు. వివిధ డిప్లొమా కోర్సులకు, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు (బైపీసీ స్ట్రీమ్) ఆన్లైన్లో పీహెచ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారే హాజరుకావాలని వెల్లడించారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఫీజుతో రావాలని, వివరాలకు (www.pjtsau.edu.in) చూడవచ్చన్నారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన సీట్ల భర్తీ.. వ్యవసాయ వర్సిటీ వివిధ డిప్లొమా కోర్సుల్లో (వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన) సీట్ల భర్తీకి ఈ నెల 22న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సుధీర్ కుమార్ తెలిపారు. ఎన్సీసీ డైరెక్టరేట్ ఆఫీసర్స్ సమక్షంలో కౌన్సెలింగ్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు నిర్ణీత ఫీజు డిప్లొమా కోర్సులకు రూ.12,200 (యూనివర్సిటీ పాలిటెక్నిక్స్), రూ.16,600 (ప్రైవేటు పాలిటెక్నిక్స్), డిగ్రీ కోర్సులకు రూ.36,450తో హాజరుకావాలని తెలిపారు. ఎన్సీసీ ఆఫీసర్ ప్రాధాన్యతలను సూచిస్తారని పేర్కొన్నారు. తర్వాత సీట్లను ప్రాధాన్యతల ఆధారంగా, టీఎంసెట్– 2019 ర్యాంకుల ప్రకారం భర్తీ చేస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్సైట్లో చూడవచ్చని చెప్పారు. -
దివ్యాంగుల రిజర్వేషన్లు 5% పెంచాలి
దివ్యాంగుల బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: దివ్యాంగుల రిజర్వేషన్లను ఐదు శాతానికి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజ్యసభలో దివ్యాంగుల హక్కుల బిల్లు–2014పై జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ వైఎస్సార్సీపీ తరఫున బిల్లుకు మద్దతు తెలిపారు. వాస్తవానికి 2014లో ప్రవేశపెట్టిన అసలు బిల్లులో దివ్యాంగులకు ఐదుశాతం రిజర్వేషన్ల నిబంధన ఉందని, అయితే సవరించిన బిల్లులో రిజర్వేషన్లను 4 శాతానికి తగ్గించారన్నారు. దివ్యాంగుల కేటగిరీలను 7 నుంచి 21కి పెంచారని, అందువల్ల రిజర్వేషన్లను 5 శాతానికి పెంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.