సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతులకు సంబంధించి వికలాంగ (దివ్యాంగ) రిజర్వేషన్ల అమలులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత అంగవైకల్యం ఉన్న వారికి మాత్రమే దివ్యాంగ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఇదివరకు తాత్కాలిక వైకల్య ధ్రువీకరణ(టెంపరరీ డిజేబుల్డ్ సర్టిఫికెట్)తో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో, పదోన్నతుల్లో అవకాశం కల్పించగా... ఇప్పుడు ఆ ప్రయోజనాలను నిలిపివేసింది.
తాత్కాలిక వైకల్యంతో ఉన్న వ్యక్తికి కొంత కాలం తర్వాత వైకల్య స్థితిలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పు తాలుకు ఫలితం వైకల్యం నయమవ్వడం లేదా శాశ్వత వికలాంగుడిగా మారడంలాంటి సంఘటనలు అనేకం ఉంటాయి. ఈ క్రమంలో వికలత్వ నిర్ధారణ విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
శాశ్వత నిర్ధారణ సర్టిఫికెట్లే పరిగణించాలని..
► శాశ్వత వికలత్వ నిర్ధారణ సర్టిఫికెట్లను మాత్రమే పరిగణించాలని, ఇతరత్రా సర్టిఫికెట్లను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు వికలాంగుల సాధికారత, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ అందుకు అనుగుణంగా జీఓ 41 జారీ చేసింది.
40శాతం దాటితేనే...
వికలాంగ రిజర్వేషన్ల అమలులో వికలత్వ శాతమే కీలకం. కనీసం 40శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తేనే రిజర్వేషన్ల వర్తింపును ప్రభుత్వం అనుమతిస్తుంది. ప్రతి వికలాంగుడు తప్పకుండా వైకల్య ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. అందులో శాశ్వత ప్రాతిపదిక వైకల్యం ఉన్నట్లయితేనే రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈమేరకు జీఓ 41లో స్పష్టత ఇచ్చింది. తాత్కాలిక వైకల్యం(టెంపరరీ డిజబులిటీ) ధ్రువీకరణ పత్రాన్ని ఇదివరకు అంధ విభాగంలోనే జారీ చేస్తుండగా... ప్రస్తుతం అన్ని కేటగిరీల్లోనూ ఈ ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జారీ చేస్తోంది.
మొదటిసారి ధ్రువీకరణ పత్రం కోసం సంప్రదించే ప్రతి వికలాంగుడికి టెంపరరీ సర్టిఫికెట్ ఇస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ నియామకాలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి అర్హత పరీక్షలు సైతం నిర్వహిస్తున్నాయి. అతి త్వరలో పరీక్షల నిర్వహణ ప్రక్రియ వేగం పుంజుకోగా... వెనువెంటనే ఫలితాలను ప్రకటించి నియామకాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించాయి.
ఈ సమయంలో వికలాంగ రిజర్వేషన్ల అమలులో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. వికలాంగ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన జీఓ 41 ప్రతులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక సంస్థలకు ప్రత్యేకంగా పంపింది. జీఓ 41లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇది వికలాంగులపై కక్షసాధింపు చర్యః ముత్తినేని వీరయ్య
తాత్కాలిక ధ్రువీకరణను రిజర్వేషన్ల అమలులో పరిగణించమంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర అన్యాయం. ప్రస్తుతం సదరమ్ ద్వారా జారీ చేస్తున్న సర్టిఫికెట్లన్నీ టెంపరరీ సర్టిఫికెట్లే. కొందరికి రెండు, మూడేళ్లుగా ఇవే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాల సమయంలో ఈ అంశాన్ని తీసుకురావడంతో అసలైన లబ్ధిదారులు నష్టపోయే అవకాశాలున్నాయి. జీఓ 41 జారీ ప్రక్రియ వికలాంగులపై కక్షసాధింపు చర్యగా భావిస్తున్నాం. ఈ ఉత్తర్వులను రద్దు చేసేందుకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.
శాశ్వత అంగవైకల్యం ఉంటేనే రిజర్వేషన్లు
Published Fri, May 5 2023 1:07 AM | Last Updated on Fri, May 5 2023 11:31 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment