డీజీపీని కోరిన ఏపీ హోటల్స్ అసోసియేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచేందుకు సహకరించాలని కోరుతూ ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం అందజేసింది. ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామి, కార్యదర్శి ఎం.నాగరాజు, కోశాధికారి ఇ.వి.పూర్ణచంద్, విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ, కార్యదర్శి రాఘవ డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. 2018 అక్టోబరు 15వ తేదీన విడుదల చేసిన జీవో 25 ప్రతిని డీజీపీకి అందజేశారు.
దీనికి కొనసాగింపుగా 2022 జూన్ 13వ తేదీన ఇచ్చిన మెమో ఉత్తర్వుల కాపీని కూడా జోడించారు. పొరుగున ఉన్న తెలంగాణలో అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని వివరించారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment