సాక్షి, అమరావతి: సత్యనారాయణ తరహాలోనే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు దురదృష్టవశాత్తూ ఏదైనా అనారోగ్యం బారినపడితే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి కొండంత అండగా నిలుస్తోంది. రోగులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా శస్త్రచికిత్సలను, వైద్య సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వ్యక్తులు చికిత్సలు చేయించుకుని మంచానికి పరిమితమైనప్పుడు వారిని విశ్రాంతి సమయానికి ఆర్థికంగా ఆదుకుంటోంది.
విశ్రాంతి సమయంలో వారి పోషణ కష్టం కాకుండా ఉండటానికి ఆపత్కాలంలో ఆర్థిక భరోసాను అందిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2019 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టినప్పటి నుంచి గతేడాది నవంబర్ నెలాఖరు వరకు రోగులకు ప్రభుత్వం రూ.1,309.92 కోట్ల మేర ఆర్థిక సాయం అందించింది.
ఈ చిత్రంలోని వ్యక్తి.. టి.సత్యనారాయణ (60). ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం చొప్పరామన్నగూడెంలో ఉంటారు. ఇటీవల గ్రామంలో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా ఆయాసం, ఇతర సమస్యలతో బాధపడుతుండటంతో సత్యనారాయణ శిబిరానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నట్టు అనుమానించి పెద్దాస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు సత్యనారాయణను రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఆయన గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాలు పూడుకుని పోయినట్టు గుర్తించారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా రెండు స్టెంట్‌లు వేశారు.
సత్యనారాయణ రూపాయి కూడా ఖర్చుపెట్టాల్సిన పనిలేకుండా ఉచితంగా చికిత్సలు పూర్తి చేశారు. అంతేకాకుండా వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.4వేలకు పైగా భృతిని ప్రభుత్వం ఆయన బ్యాంక్ ఖాతాలో జమ చేసింది. ‘వయోభారంతో ఇంటిపట్టునే ఖాళీగా ఉంటున్నా. నా కుమారుడి సంపాదనతో కుటుంబం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు గుండె సమస్య అని తెలిసి చికిత్సకు ఎంత ఖర్చవుతుందోనని చాలా ఆందోళనకు గురయ్యాను. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకుంది. అంతేకాకుండా విశ్రాంత సమయానికి ఆర్థిక సాయం చేయడంతో అదనపు ఖర్చుల భారం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వం చేసిన ఈ మేలును ఎన్నటికీ మరువలేం’ అని సత్యనారాయణ చెమర్చిన కళ్లతో చెబుతున్నారు.
21.92 లక్షల మందికి ఆర్థిక చేయూత
ఆరోగ్యశ్రీ పథకం కింద 1,519 ప్రొసీజర్‌లలో చికిత్సలు పొందినవారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే సమయంలో వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు ప్రభుత్వం అందిస్తోంది. రోగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రోజే ఈ మొత్తాన్ని ప్రభుత్వం రోగులు/వారి కుటుంబీకుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే గర్భిణులకు ప్రసవానంతరం రూ.5 వేలు చొప్పున సాయం అందజేస్తోంది.
ఇలా గత ఏడాది నవంబర్ చివరినాటికి రాష్ట్రవ్యాప్తంగా 21,92,467 మందికి రూ.1,309.92 కోట్ల మేర సాయం అందించింది. ప్రభుత్వం అందజేస్తున్న ఈ సాయం రోగులు పూర్తిగా కోలుకునేందుకు దోహదం చేస్తోంది. కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక సంస్కరణలను తీసుకువచ్చింది. 2019కు ముందు 1,059 ప్రొసీజర్‌లు ఉండగా, వీటిని ఏకంగా 3,257కు ప్రభుత్వం పెంచింది. అంతేకాకుండా పథకం కింద వైద్య పరిమితిని కూడా ఇటీవలే ప్రభుత్వం ఏకంగా రూ.25 లక్షలకు చేర్చింది.
ఆర్థికంగానూ ఆదుకున్నారు..
నాకు గుండెలో రంధ్రం ఉండటంతో మూడు నెలల క్రితం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్‌కు నా చేతి నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆపరేషన్ తర్వాత వైద్యులు సుమారు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. విశ్రాంత సమయానికి భృతి కింద డిశ్చార్జి చేసిన రోజే నా బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం రూ.9,500 జమ చేసింది. ఉచితంగా ఆపరేషన్ చేయించడమే కాకుండా కోలుకునే సమయంలోనూ ఆర్థికంగా ఆదుకుంది. ఈ సాయం పౌష్టికాహారం తీసుకోవడానికి, ఇతర నా అవసరాలకు ఎంతో ఉపయోగపడింది. – ఎస్.లలిత, కణేకల్ మండలం, అనంతపురం జిల్లా
కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా..
వైద్యం పొందిన లేదా ఆపరేషన్ చేయించుకున్న రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి భృతి ఇస్తున్నాం. రోగులు/వారి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్నాం. చికిత్స అనంతరం రోగుల కుటుంబాలు కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనేది సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం. ఇందుకే ప్రభుత్వం జీవన భృతిని అందిస్తోంది. దీన్ని పొందడంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 104 కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. వీటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. – బాలాజీ, సీఈవో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ
Comments
Please login to add a commentAdd a comment