శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, అమరావతి / వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): అర్హురాలైన ప్రతి తల్లికీ అమ్మ ఒడి పథకం అమలు చేస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. కులం, మతం, పార్టీ అనేది చూడకుండా, కేవలం అర్హతే ప్రామాణికంగా ఈ పథకాన్ని వర్తింపచేయాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. పిల్లలను బడికి పంపించే అర్హులైన తల్లులందరికీ ఈ పథకం అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారన్నారు. ఈ నెల 11న నెల్లూరులో రెండో విడత అమ్మ ఒడి పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదని, సీఎం అమ్మ ఒడి కార్యక్రమాన్ని తెచ్చారన్నారు.
వేర్వేరు సమస్యల వల్ల అర్హులు కాని వారి విషయంలో మరింత పకడ్బందీగా పరిశీలించాలని సీఎం సూచించారన్నారు. ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికీ లబ్ధి చేకూరుస్తామని, గత ఏడాది కన్నా ఈసారి ఎక్కువ మంది లబ్ధిదారులుంటారని భావిస్తున్నామని చెప్పారు. ఈ పథకం దేశం మొత్తానికి ఆదర్శంగా మారిందని, నూతన జాతీయ విద్యా విధానంలోనూ ఇదే అంశాన్ని కేంద్రం ప్రస్తావించిందన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కడుపు మంటతో చేస్తున్నవేనని కొట్టిపారేశారు. నాడు–నేడు కింద పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం తర్వాత వాటి నిర్వహణ కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఇందుకోసం శాశ్వత ప్రాతిపదికన ఒక నిధి ఏర్పాటుకు సీఎం యోచన చేశారని చెప్పారు. తల్లులకు అమ్మ ఒడి కింద ఇచ్చే రూ.15 వేలల్లో టాయిలెట్ల నిర్వహణ నిధి కోసం రూ.1000 మినహాయించి తక్కిన మొత్తాన్ని వారి అకౌంట్లలో జమ చేస్తామని మంత్రి వివరించారు.
సాంకేతికతతో అసమానతల తొలగింపు
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సమాజంలో అసమానతలను తొలగించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఏపీ సమగ్ర శిక్ష, పాఠశాల విద్య సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు మూడు రోజులపాటు జరిగే ‘దీక్ష – కీ రిసోర్స్ పర్సన్’ శిక్షణ శిబిరాన్ని బుధవారం స్థానిక కేబీఎన్ కళాశాల ఆవరణలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆన్‌లైన్ విద్య ద్వారా సామాజిక అసమానతలను తొలగించగలుగుతామన్నారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే అత్యుత్తమ విద్యా ప్రమాణాలు సాధించగలమన్నారు. నైపుణ్యాల విషయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందంజలో ఉన్నారని చెప్పారు. జిల్లా విద్యా శిక్షణా సంస్థల ద్వారా నిరంతరం శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment