పేనీలను డాల్డాలో వేయిస్తున్న మహిళలు
ఆహార ప్రియులు ఇష్టపడే సరికొత్త రుచి ఇది. ఈ పేరు చెబితే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, గోవా, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారితో పాటు ఉత్తర భారతీయుల నోరూరుతుంది. మైదా, నెయ్యి లేదా డాల్డాతో తయారు చేసే ఈ పదార్థాన్ని పాలలో ముంచి తింటే ఆహా! ఆ రుచే వేరు. సామాన్యుడికి సైతం అందుబాటు ధరతో లభించే ఈ స్వీట్ తయారీకి గుంతకల్లు కేంద్రంగా మారింది. దేశవ్యాప్తంగా పేరు గాంచిన ప్రముఖ స్వీట్స్ విక్రయదారులు సైతం వీటిని తమ దుకాణాల్లో ఆకర్షణీయంగా ప్రదర్శించి విక్రయాలు సాగిస్తుండడం గమనార్హం. ఇంతకూ ఆ స్వీట్ ఏమిటో తెలుసుకోవాలని ఆత్రుత ఉంది కదూ? అయితే వెంటనే గుంతకల్లుకు వెళదాం రండి...
గుంతకల్లు టౌన్(అనంతపురం జిల్లా): గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్న మోదీనాబాద్ హంపయ్య కాలనీకి చేరుకోగానే పాలపేనీ తయారీలో నిమగ్నమైన కుటుంబాలు కనిపిస్తాయి. కాలనీలోని పలు కుటుంబాల వారు కుటీర పరిశ్రమను తలపించేలా పాలపేనీని తయారు చేస్తుంటారు. ఈ తయారీపై ఆధారపడి ప్రత్యక్షంగా సుమారు 150 కుటుంబాలు.. పరోక్షంగా వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక్కో తయారీ కేంద్రంలో రోజూ 10 మందికి తగ్గకుండా ఉపాధి పొందుతుంటారు. పేనీల తయారీలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చినా... గుంతకల్లు వాసులు చేతితో తయారు చేసిన పేనీల రుచి అమోఘమని ఆహారప్రియులు కొనియాడుతుంటారు.
చేతితో పేనీలు చేస్తున్న గౌసియా
నైపుణ్యం తప్పనిసరి..
సన్నటి దారపు పోగులను తలపించేలా కనిపించే పాల పేనీ తయారీ ఎంతో కళాత్మకంగా ఉంటుంది. ఇందుకు ఎంతో నైపుణ్యం అవసరం. ఉదయాన్నే స్వచ్ఛమైన మైదా పిండిని నీళ్లలో కొన్ని గంటల పాటు నానబెట్టి తర్వాత చేతితోనే గట్టిగా పిసికి ముద్దలుగా చేసుకుంటారు. వీటికి నెయ్యి లేదా డాల్డా పట్టిస్తూ రోల్ చేస్తూ నాలుగైదు పొరలుగా చేస్తారు. తర్వాత చేతి వేళ్లతో ఆడించి దారం మందంలో సేమియా (పేనీ) చుట్టలుగా మారుస్తారు. ఇలా మార్చిన పేనీలను నెయ్యి లేదా డాల్డాలో దోరగా వేయించి వెలికి తీస్తారు.
గుంతకల్లు కేంద్రంగా రోజూ 2వేల కిలోల పాలపేనీ తయారవుతూ ఉంటుంది. చాలా మంది జిల్లాతో పాటు పొరుగునే ఉన్న కర్నూలు జిల్లా వీధి వ్యాపారులు, స్వీట్ స్టాల్ నిర్వాహకులు వీటిని కిలో రూ.120 చొప్పున (డాల్డాతో చేసినవి) కొనుగోలు చేసి, వారివారి ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. చాలా మంది గంపల్లో తీసుకెళ్లి రైళ్లలో ప్రయాణికులకు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. పేనీలకు పాలు, చక్కెర కలిపి ఆరగిస్తే ఆ రుచిని ఎన్నటికీ మరువలేమని ఆహార ప్రియులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment