ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జల అవార్డులను దక్కించుకుంది. దేశంలో జలసంరక్షణ, యాజమాన్య పద్ధతుల ద్వారా తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించడం తదితర విధానాలను ప్రోత్సహించడానికి 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది. తాజాగా 11 విభాగాల్లో 41 అవార్డులను ప్రకటించగా.. ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డులను దక్కించుకుంది.
నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో ఏపీ తృతీయ స్థానంలో నిలవగా.. ఉత్తమ స్కూల్ విభాగంలో నంద్యాల జిల్లాలోని చాగలమర్రి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల(కేజీబీవీ) ద్వితీయ స్థానం, పరిశ్రమల విభాగంలో తిరుపతిలోని కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ తృతీయ స్థానం దక్కించుకున్నాయి. స్వచ్ఛంద సంస్థల విభాగంలో అనంతపురం జిల్లాకు చెందిన యాక్షన్ ఫ్రెటెర్నాకు ప్రత్యేక ప్రోత్సాహక అవార్డు లభించింది.
శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నుంచి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ జాతీయ జల అవార్డును అందుకున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నుంచి చాగలమర్రి కేజీబీవీ ప్రిన్సిపాల్, సీసీఎల్ ప్రతినిధులు, యాక్షన్ ఫ్రెటెర్నా డైరెక్టర్ మల్లారెడ్డి అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ.. నీటిని సంరక్షించుకోవడం ద్వారానే భవిష్యత్ తరాలను కాపాడుకోగలమన్నారు. జల సంరక్షణను రోజువారీ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు.
ఇదీ చదవండి:గ్రీన్ మొబిలిటీలో ఆంధ్రప్రదేశ్ మున్ముందుకే
Comments
Please login to add a commentAdd a comment