ఉద్యోగాల్లో స్థానికులకే అగ్రపీఠం | Andhra Pradesh becoming a hub for investment and industry Jobs | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల్లో స్థానికులకే అగ్రపీఠం

Published Wed, Apr 20 2022 3:23 AM | Last Updated on Wed, Apr 20 2022 3:23 AM

Andhra Pradesh becoming a hub for investment and industry Jobs - Sakshi

బలభద్రపురంలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న బిర్లా కాస్టిక్‌ సోడా యూనిట్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసే కంపెనీలు, పరిశ్రమల్లో స్థానికులకే అగ్రస్థానం దక్కాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలు, కంపెనీల్లో 75% ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చారు. ఈ లక్ష్య సాధనకు యువతకు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తున్నారు. దీని ద్వారా పరిశ్రమలు, సంస్థలకు మానవ వనరుల కొరత లేకుండా చూస్తున్నారు. దీంతో కొన్ని పరిశ్రమల్లో 75 శాతానికి మించి కూడా ఉద్యోగాలను స్థానికులు అందుకుంటున్నారు.

నైపుణ్యం కలిగిన సిబ్బంది లభిస్తుండటంతో ప్రభుత్వ  నిబంధనకు లోబడి రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీంతో రాష్ట్రం పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. తాజాగా బిర్లా గ్రూప్‌ తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ ఏర్పాటు చేసింది. ఇందులో స్థానికులకు 75% ఉద్యోగాలిచ్చేందుకు అంగీకారం తెలిపింది. సీఎం జగన్‌ ఈ పరిశ్రమను గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభిస్తారు. ఆదిత్య బిర్లా గ్రూపు చైర్మన్‌ కుమార మంగళం బిర్లా కూడా ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. 

రూ.2,700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 1300 మందికి, పరోక్షంగా 1,150 మందికి.. మొత్తం 2,450 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రపంచంలోనే 500 పెద్ద కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఆదిత్య బిర్లా గ్రూప్‌..  విస్కస్‌ స్టెపుల్‌ ఫైబర్‌ (వీఎస్‌ఎఫ్‌), క్లోర్, ఆల్కలీ తయారీ, సిమెంట్‌ ఉత్పత్తి, ఆర్థిక సేవలు వంటి పలు రంగాల్లో ఉంది. ఈ దిగ్గజ గ్రూప్‌లో ఒకటైన గ్రాసిమ్‌.. సీఎం చొరవతో రాష్ట్రంలో భారీ పెట్టుబడితో ఈ యూనిట్‌ నెలకొల్పింది. ఈ యూనిట్‌ ప్రారంభోత్సవం అనంతరం కుమార మంగళం బిర్లా ముఖ్యమంత్రితో కలిసి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకుంటారు. అక్కడ లంచ్‌ చేసిన అనంతరం తిరిగి వెళ్తారు.

అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ 
స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను అంగీకరిస్తున్న సంస్థలకు సిబ్బంది విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకుండా నిపుణులైన యువతను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. నైపుణ్యాల లేమితో యువత ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి రాకూండా ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇందుకోసం రాష్ట్రంలో రెండు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలతో పాటు జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 26 నైపుణ్య శిక్షణ కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. ఏటా సమగ్ర పారిశ్రామక సర్వే ద్వారా అంచనాలు రూపొందిస్తోంది. దీనిప్రకారం రాష్ట్రంలో 66 పరిశ్రమలకు తక్షణం 11,981 మంది నిపుణుల అవసరం ఉందని గుర్తించిన అధికారులు 23 రంగాలకు చెందిన 48 కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  

జీవో పటిష్టంగా అమలుకు జిల్లాకో కమిటీ 
రాష్ట్రంలో పరిశ్రలు, సంస్థల్లో ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయా లేదా అని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. 

కాలుష్యానికి ఆస్కారం లేకుండా..
పరిశ్రమ నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకుంటున్నారు.  భూగర్భ జలాలు కలుషితం కాకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇది కాలుష్య నియంత్రణ మండలి పర్యవేక్షణలో ఉంటుంది. పరిశ్రమలోని వ్యర్థ జలాలను శుద్ధి చేసే క్రమంలో ఎలాంటి లీకేజీలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శుద్ధి చేసిన జలాలను అందులోనే పునర్వినియోగిస్తారు.   దీనివల్ల రీసైకిల్‌ ప్లాంట్‌ నుంచి ఎలాంటి ద్రవం బయటకు వెళ్లదు. భూగర్భ జలాలు కలుషితం కావు.

రాష్ట్రంలోనే అతి పెద్దది..
బిక్కవోలు సమీపంలోని బలభద్రాపురంలో గురువారం సీఎం జగన్‌ ప్రారంభించే గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా యూనిట్‌ రాష్ట్రంలోనే అతి పెద్దది. బిర్లా గ్రూప్‌ ఈ పరిశ్రమ కోసం దాదాపు రూ.2,700 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ యూనిట్‌ నుంచి ఎలాంటి కాలుష్యం వెలువడకుండా చర్యలు తీసుకుంటున్నాం. గుజరాత్, ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఇప్పటికే గ్రాసిమ్‌ పరిశ్రమకు చెందిన యూనిట్లు ఉన్నాయి.  – పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement