ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(జులై 15, శుక్రవారం) మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సీఎం జగన్.. అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
గురువారం చేపట్టిన ఇరిగేషన్ రివ్యూ సందర్భంగా.. ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. అదే సమయంలో గోదావరి వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారుల నుంచి సీఎం జగన్.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాబోయే 48 గంటల్లో వరదనీరు ఇంకా పోటెత్తే అవకాశం ఉందని సమీక్షా సమావేశంలో అధికారులు, సీఎం జగన్‌కు తెలిపారు.
ఎగువన తెలంగాణలో గోదావరి నదిపై ఉన్న శ్రీరాంసాగర్‌సహా బేసిన్‌లో ఉన్న అన్ని రిజర్వాయర్ల నుంచి కూడా భారీ వరదనీరు విడుదలవుతోంది. దాదాపు 24 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని సీఎం జగన్‌కు అధికారులు వెల్లడించారు. దీంతో పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనిస్తూ.. దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేయాలని సీఎం జగన్ సూచించారు. వరదల కారణంగా ఉత్పన్నమవుతున్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించిన సీఎం జగన్.. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి తగిన సౌకర్యాలను కల్పిస్తూ సహాయశిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment