Andhra Pradesh Govt 4th Place In Implementing E-Governance For 2021-22 - Sakshi
Sakshi News home page

AP: ఈ–గవర్నెన్స్‌లోనూ అదుర్స్‌

Published Mon, Oct 10 2022 7:22 AM | Last Updated on Mon, Oct 10 2022 1:37 PM

Andhra Pradesh Got 4th Place In E Governance - Sakshi

సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2021–22)లో దేశవ్యాప్తంగా ఈ–గవర్నెన్స్‌ అమలులో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. టాప్‌–10 రాష్ట్రాలకు తొలి మూడు స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వరుసగా నిలిచాయి. పశ్చిమ బెంగాల్‌ అత్యధికంగా 136.07 కోట్ల ఎలక్ట్రానిక్‌ లావాదేవీలతో తొలి స్థానంలో నిలవగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌ 109.27 కోట్లతో రెండో స్థానంలోనూ.. 84.23 కోట్లతో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్లు నివేదిక వెల్లడించింది. అదే ఏపీలో 52.90కోట్ల ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర గణాంకాలు, కార్యకమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 

ఆరు కేటగిరీలుగా ఎలక్ట్రానిక్‌ సేవలు
ఇక ఎలక్ట్రానిక్‌ సేవల లావాదేవీలను ఆరు కేటగిరీలుగా నివేదిక వర్గీకరించింది. చట్టబద్ధమైన, చట్టబద్ధతలేని సేవలు, బిజినెస్‌ సిటిజన్‌ సేవలు, సమాచార సేవలు, మొబైల్‌ గవర్నెన్స్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు, సామాజిక ప్రయోజనాలుగా వర్గీకరించింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌ 52.90 కోట్ల ఎలక్ట్రానిక్‌ సేవల లావాదేవీలను నిర్వహించినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులో చట్టబద్ధత, చట్టబద్ధతలేని సేవల లావాదేవీలు 4.16 కోట్లని నివేదిక పేర్కొంది. ఇక యుటిలిటీ బిల్లుల చెల్లింపుల లావాదేవీలు 10.76 కోట్లు.. సమాచార సేవల లావాదేవీలు 4.13 కోట్లు.. సామాజిక ప్రయోజనాల లావాదేవీలు 33.83 కోట్లు.. బిజినెస్‌ సిటిజన్‌ సేవల లావాదేవీలు 23 వేలు నిర్వహించినట్లు నివేదిక పేర్కొంది. 

ఎలక్ట్రానిక్‌ విధానంలోనే ఏపీలో పాలన
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కార్యకలాపాలన్నింటినీ కంప్యూటర్ల ద్వారానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా డిజిటల్‌ కార్యదర్శులను నియమించారు. గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల వరకు పరిపాలన ఎలక్ట్రానిక్‌ లావాదేవీల ద్వారానే కొనసాగుతోంది. ప్రజలకు అన్ని సేవలను ఎలక్ట్రానిక్‌ లావాదేవీల ద్వారానే ప్రభుత్వం నిర్వహిస్తోంది. నవరత్నాల్లోని పథకాల లబ్ధిదారులందరికీ ఎలక్ట్రానిక్‌ పద్ధతిలోనే కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా నగదు బదిలీ జరుగుతోంది. ఈ లావాదేవీలను సామాజిక ప్రయోజనాలుగా నివేదిక వర్గీకరించింది. దీంతో ఈ–గవర్నెన్స్‌లో ఏపీ నాలుగో స్థానం సాధించినట్లు నివేదిక వెల్లడించింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement