సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, చెన్నై వంటి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. రాష్ట్రంలోనే పూర్తిస్థాయి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నలుమూలలా నాలుగు అధునాతన క్యాన్సర్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తోంది. వీటిలో ఏడాదిలో పూర్తిస్థాయిలో క్యాన్సర్ వైద్యం అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇప్పటికే ఆస్పత్రులు ఉన్నప్పటికీ అరకొర సేవలే అందుతున్నాయి. విజయవాడ సమీపంలోని చినకాకానిలో గల క్యాన్సర్ ఆస్పత్రి రెండు దశాబ్ధాలుగా నిరుపయోగంగా ఉంది. ఈ మూడింటి స్థానంలో అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర వైద్యం అందించేలా ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి. వీటితో పాటు కర్నూలులో మరో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటవుతోంది.
ప్రతి జిల్లాకు అందుబాటులో ఉండేలా..
ప్రతి జిల్లాకు అందుబాటులో ఉండేలా రాష్ట్రం నలుమూలలా అందుబాటులో ఉండేలా అత్యాధునిక సదుపాయాలతో సమగ్ర ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల వారికోసం విశాఖపట్నం కేజీహెచ్‌లో అత్యాధునిక పరికరాలు, సదుపాయాలతో పూర్తిస్థాయి క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటవుతోంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారి కోసం విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలకు అనుబంధంగా గుంటూరు జిల్లా చినకాకాని క్యాన్సర్ సెంటర్ పూర్తిస్థాయి ఆస్పత్రిగా మారబోతోంది. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల వారి కోసం తిరుపతి స్విమ్స్‌లో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కాబోతోంది. వీటితో పాటు కర్నూలు, అనంతపురం జిల్లాల వారికి కర్నూలులో కూడా మరో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. అంతర్జాతీయ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సలహాలు, సూచనలతో నిర్మిస్తున్న ఈ క్యాన్సర్ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తే పూర్తిస్థాయి వైద్యం అందనుంది.
ఒక్కో ఆస్పత్రిలో 600 పడకలు
మెడికల్ అంకాలజీ, రేడియేషన్ అంకాలజీ, సర్జికల్ అంకాలజీ విభాగాలతో ఒక్కో క్యాన్సర్ ఆస్పత్రిలో 600 పడకలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న ఈ క్యాన్సర్ ఆస్పత్రుల్లో ఒక్కో విభాగానికి 10 యూనిట్ల (యూనిట్‌కు 20 పడకలు) చొప్పున 200 పడకలు అందుబాటులోకి తెస్తారు. ఇలా మూడు విభాగాల్లో 200 చొప్పున మొత్తం 600 పడకలు సమకూరతాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందించేందుకు నిపుణులైన వైద్యులను అందుబాటులోకి రానున్నారు.
ఇప్పటికే రూ.300 కోట్ల కేటాయింపు
ఈ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత నిధులను కూడా కేటాయించింది. కర్నూలులో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రికి రూ.150 కోట్లు కేటాయించగా.. విశాఖపట్నం, చినకాకాని, తిరుపతిలలో ఏర్పాటయ్యే ఒక్కో ఆస్పత్రికి రూ.50 కోట్ల చొప్పున రూ.150 కోట్లు కేటాయించింది. నిపుణుల సూచన మేరకు మరిన్ని నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం ఒక ప్రణాళిక సైతం సిద్ధం చేశారు.
ఏడాదిలో అందుబాటులోకి..
కొత్తగా ఏర్పాటవుతున్న క్యాన్సర్ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్యసేవలు ఏడాదిలో అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇప్పటికే విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 80 నుంచి 100 పడకలు అందుబాటులో ఉన్నాయి. చినకాకానిలో 30 పడకలు ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో తొలుత కనీసం 300 పడకలకు పెంచి ఏడాదిలో పూర్తిస్థాయి సేవలు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. రెండేళ్లలో ప్రతి ఆస్పత్రిలో 600 చొప్పున పడకలను అందుబాటులోకి తెస్తాం. రాష్ట్ర ప్రజలు క్యాన్సర్ వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే సేవలందించేలా సౌకర్యాలు కల్పిస్తాం.
– డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, డీఎంఈ
Comments
Please login to add a commentAdd a comment