
సాక్షి, అమరావతి: తల్లి మరణించిన చిన్నారిని అమ్మమ్మ, తాతయ్య తమ సంరక్షణలోకి తీసుకోవడం అక్రమ నిర్బంధం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదంది. చిన్నారిని అమ్మమ్మ తాతయ్య తమ సంరక్షణలోకి తీసుకోవడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించలేమని పేర్కొంది. తన భార్య మరణించిన నేపథ్యంలో పదినెలల తన కుమార్తెను తన అత్తమామలు అక్రమంగా నిర్బంధించారంటూ బాపట్లకు చెందిన గోపి అనే వ్యక్తి దాఖలుచేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టేసింది.
సహజసిద్ధ సంరక్షకుల హక్కులను నిర్ధారించేముందు ఆ చిన్నారి సంరక్షణ అత్యంత ముఖ్యమని తెలిపింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని గుర్తుచేసింది. చిన్నారి కస్టడీ కోసం సంబంధిత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని గోపీకి సూచిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బి.వి.ఎల్.ఎన్.చక్రవర్తి ధర్మాసనం తీర్పు చెప్పింది.
ప్రతి ఆదివారం వెళ్లి అమ్మమ్మ, తాతయ్య వద్ద ఉన్న ఆ చిన్నారిని చూసుకునేందుకు గోపీకి ధర్మాసనం అనుమతి ఇచ్చింది. తన భార్య చనిపోయిన తరువాత తన కుమార్తెను తన అత్తమామలు అక్రమంగా నిర్బంధించారని, ఆ చిన్నారిని కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ గోపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం విచారించింది.
Comments
Please login to add a commentAdd a comment