సాక్షి, అమరావతి: సినిమా థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. లైసెన్స్ జారీచేసే అధికారులైన జాయింట్ కలెక్టర్లకు ముందుగా తెలియజేసి, వారిని సంప్రదించాకే టికెట్ ధరలను ఖరారు చేసుకోవాలని ఆదేశించింది. ఈ ధరల ఖరారు విషయంలో సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తులతో పాటు ప్రభుత్వాధికారులతో ఓ కమిటీని ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్నీ ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులిచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధుల్లో సినిమా టికెట్ ధరలను ఖరారుచేస్తూ ప్రభుత్వం జారీచేసిన జీఓ–35తో సంబంధంలేకుండా, ఈ జీఓ జారీకి ముందున్న విధంగానే టికెట్ ధరలను ఖరారు చేసుకోవచ్చునంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
చట్టప్రకారమే ధరలను నిర్ణయించాం
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఏపీ సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనల ప్రకారమే టికెట్ ధరలను భౌగోళిక ప్రాంతాల వారీగా నిర్ణయించామన్నారు. థియేటర్ల యాజమాన్యాలు సౌకర్యాలతో నిమిత్తం లేకుండా నిర్ణయిస్తున్న ధరలకు కళ్లెంవేసి ప్రేక్షకులకు లబ్ధిచేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సినిమా పరిశ్రమ, ప్రభుత్వం మధ్య కోర్టును లాగుతున్నారంటూ నవ్వుతూ వ్యాఖ్యానించింది. టికెట్ ధరలను పెంచి థియేటర్లు, పన్నులు వసూలుచేసుకుంటూ ప్రభుత్వం రెండూ సంతోషంగా ఉంటాయని.. కానీ, అంతిమంగా నష్టపోయేది మాత్రం ప్రేక్షకులేనని తెలిపింది.
టికెట్ ధరలను పెంచడంవల్ల నష్టపోతామన్న విషయాన్ని యాజమాన్యాలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పింది. తాము చేస్తున్నది కూడా ప్రేక్షకుల కోసమేనని.. వారు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థను కూడా తీసుకొచ్చామని ఏజీ వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. టికెట్ ధరలను అందరితో మాట్లాడి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో సినిమా పరిశ్రమకు చెందిన వారిని కూడా భాగస్వాములను చేయాలని చెప్పింది. తాము ఏకపక్షంగా చేయబోమని.. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతుల ఆధారంగానే టికెట్ ధరల విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని, అందుకే చట్ట ప్రకారం ధరలను నియంత్రిస్తున్నామని ఏజీ శ్రీరామ్ వివరించారు.
అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ధరలు
థియేటర్ల యాజమాన్యాల తరఫు సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరలను తాము నిర్ణయించుకునే వెసులుబాటు ఉందన్నారు. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో పాటు ప్రేక్షకుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే వాటిని నిర్ణయిస్తున్నామన్నారు. పంచాయతీల్లో టికెట్ ధరను రూ.5గా నిర్ణయించారని, ఈ రేటుకి కప్పు కాఫీ కూడా రావడంలేదన్నారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. టిక్కెట్ ధరల విషయంలో కొత్త కమిటీని ఏర్పాటుచేయాలని, అందులో సినిమా పరిశ్రమకు చెందిన వారు, ప్రభుత్వాధికారులు ఉండాలని సూచించింది. కొత్త కమిటీ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ప్రతిపాదన ఏమిటో చెప్పాలని ఏజీని కోరింది. విచారణను శుక్రవారానికే వాయిదా వేస్తామంది. అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల జోలికి వెళ్లబోమంది.
భారీ రేట్లకు టికెట్ల విక్రయం
ఏజీ స్పందిస్తూ.. కొత్త కమిటీ ఏర్పాటునకు అభ్యంతరంలేదని.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం టికెట్ ధరల ఖరారు విషయంలో థియేటర్ల యాజమాన్యాలు జాయింట్ కలెక్టర్లను సంప్రదించాలని, కానీ ఇప్పటివరకు ఏ థియేటర్ కూడా జాయింట్ కలెక్టర్‌లకు ధరలను తెలియజేయలేదన్నారు. ఈ వారంలో విడుదలవుతున్న ఓ పెద్ద సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.80 టికెట్‌ను రూ.140 నుంచి రూ.400 వరకు అమ్ముతున్నారని ఏజీ ధర్మాసనానికి వివరించారు. అలాగే, నాలుగు షోలకు బదులు 6 షోలు వేస్తున్నారని తెలిపారు. దీనిని ఖండిస్తూ.. నాలుగు షోలు మాత్రమే వేస్తున్నామని ఆదినారాయణరావు చెప్పారు.
ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ఏజీ పట్టుబట్టారు. కమిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని, అప్పటివరకు సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం నడుచుకునేలా థియేటర్ల యాజమాన్యాలను ఆదేశించాలని ధర్మాసనాన్ని ఏజీ అభ్యర్థించారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ, జాయింట్ కలెక్టర్లకు తెలియజేసి, వారిని సంప్రదించాకే ధరలను ఖరారుచేసుకోవాలని యాజమాన్యాలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment