సాక్షి, అమరావతి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు, ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వకుండా చేసేందుకు టీడీపీ పెద్దల ప్రోద్బలంతో వరుసపెట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, వీటిని అడ్డుకోవాలంటూ ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజుల ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. అయితే తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో ఏ కారణాలతో ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని కొట్టేసిందో తెలియరాలేదు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన సీజే ధర్మాసనం.. రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న అతని అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసిన సంగతి తెలిసిందే. రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం దాఖలు చేయడం వెనకున్న అసలు ఉద్దేశాలను సైతం విచారణ సందర్భంగా ధర్మాసనం బహిర్గతం చేసింది.
ప్రభుత్వ విధానాన్ని మీరు నిర్దేశిస్తారా?
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యం వేసినట్లుందన్న ధర్మాసనం.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారని రఘురామకృష్ణరాజు తీరును నేరుగా ఎండగట్టింది. ప్రభుత్వం రుణాలు ఎలా తీసుకోవాలో మీరెలా నిర్ధేశిస్తారని, అప్పు ఇచ్చే వాళ్లకు లేని ఇబ్బంది మీకెందుకని, అభ్యంతరం చెప్పేందుకు అసలు మీరెవరంటూ ఆయన్ను కడిగిపారేసింది. ఈ వ్యాజ్యాన్ని నిరర్థక వ్యాజ్యంగా అభివర్ణిస్తూ.. ఇలాగే వదిలేస్తే రేపు కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లను కూడా సవాలు చేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తామని, కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చని రఘురామకృష్ణరాజుకు తేల్చి చెప్పింది. ఆ విధంగానే ధర్మాసనం రఘురామకృష్ణరాజు వ్యాజ్యాన్ని శుక్రవారం కొట్టేసింది. కాగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసేందుకు రఘురామకృష్ణరాజు ఏకంగా ఓ న్యాయ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో సీనియర్ న్యాయవాదులు మొదలు.. నిన్న మొన్న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయిన జూనియర్ న్యాయవాదులు కూడా ఉన్నారు. ఆ బృందంలోని న్యాయవాదుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కేసు అప్పచెబుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలుజేసేందుకు రఘురామకృష్ణరాజు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ఆ న్యాయవాదులకు రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment