
సాక్షి, అమరావతి: పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను బహిర్గతం చేయాలా? వద్దా? అన్న అంశంపై లోతుగా విచారించి తేలుస్తామని హైకోర్టు తెలిపింది. అలా కేసులు నమోదు చేయకుండా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల వివరాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకోవాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు హైకోర్టు స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు హోంశాఖ న్యాయవాది వి. మహేశ్వరరెడ్డి గడువు కోరడంతో హైకోర్టు తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో తనపై నమోదైన కేసుల వివరాలు, వాటికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీలతో పాటు కేసులు నమోదు చేయని ఫిర్యాదుల వివరాలను తనకు అందజేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై జస్టిస్ రాయ్ గురువారం మరోసారి విచారణ జరిపారు. రఘురామరాజు తరఫు న్యాయవాది పీవీజీ ఉమేశ్ వాదనలు వినిపిస్తూ, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి వాటిలో పిటిషనర్‌ను అరెస్టుచేసే అవకాశం ఉందన్నారు. పిటిషనర్ విషయంలో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, అందుకే ఆ ఫిర్యాదుల వివరాలను వెల్లడించలేదన్నారు. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇది ఊహాజనితమైనదన్నారు. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి గడువునిస్తూ విచారణను పది రోజులకు వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment