
సాక్షి, అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి పొంగూరు నారాయణను ఆయన ఇంటి వద్దే న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి హైకోర్టు స్పష్టం చేసింది. ఎప్పుడు విచారించాలనుకుంటున్నారో నిర్ణయించాక 24 గంటల ముందు ఆ విషయాన్ని నారాయణకు తెలియచేయాలంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నారాయణ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో న్యాయమూర్తి ఈ ఆదేశాలిచ్చారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ డిజైన్ల మార్పు ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ ఇటీవల కేసు నమోదు చేసింది. సీఐడీ ఆయనకు సీఆర్‌పీసీ సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన ఆ నోటీసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ శస్త్ర చికిత్స చేయించుకున్నారని, వైద్యుల సూచన మేర మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి న అవసరం ఉందన్నారు. నిబంధనల ప్రకారం 60 ఏళ్లు నిండిన వారిని వారి ఇంటి వద్దే విచారించాల్సి ఉంటుందని తెలిపారు.