సాక్షి, అమరావతి: ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా షామియానాలతో పాటు ఇతర ఏర్పాట్లు చేసినందుకు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన వివాదరహిత మొత్తాన్ని వారం రోజుల్లో చెల్లించాలని హైకోర్టు సోమవారం విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ)ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మంజూరు చేసిన డిప్యూటీ ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇలాంటి అధికారుల విషయంలో మెమో జారీచేస్తే సరిపోదని, వారిని సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు. స్నాతకోత్సవం సందర్భంగా చేసిన ఏర్పాట్లుకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదంటూ లక్ష్మీనర్సింహ షామియానా సప్లయిర్స్ యజమాని వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఈ వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టుకు రావాలని విశ్వవిద్యాలయం వీసీ, రిజిస్ట్రార్‌లను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వీసీ శ్యాంప్రసాద్, రిజిస్ట్రార్ శంకర్ సోమవారం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు.
వారి న్యాయవాది జి.విజయ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు చెల్లించాల్సింది రూ.3.5 లక్షలు మాత్రమేనన్నారు. అయితే డిప్యూటీ ఇంజనీర్ రూ.18 లక్షలు చెల్లించాలంటూ బిల్లులు ధ్రువీకరించారని తెలిపారు. వాస్తవానికి డిప్యూటీ ఇంజనీర్ స్నాతకోత్సవం రోజున సెలవులో ఉన్నారని, దురుద్దేశంతో బిల్లులు ధ్రువీకరించినందుకు డిప్యూటీ ఇంజనీర్‌కు మెమో జారీచేశామని తెలిపారు. వాస్తవంగా చెల్లించాల్సిన రూ.3.5 లక్షలను చెల్లించేందుకు సిద్ధమని వీసీ చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆ రూ.3.5 లక్షల బిల్లును వారం రోజుల్లో పిటిషనర్‌కు చెల్లించాలని వీసీని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేశారు.
వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించండి
Published Tue, Apr 19 2022 4:03 AM | Last Updated on Tue, Apr 19 2022 3:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment