సాక్షి, అమరావతి: తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీకి చెందిన 1200 మంది హోంగార్డులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం వారంతా తెలంగాణ పోలీస్ శాఖలోనే ఉండిపోవడంతో నిబంధనల ప్రకారం ఏపీకి బదిలీ అయ్యే అవకాశం లేకుండా పోయింది. కొలువు తెలంగాణలో అయినా.. వారందరికీ ఏపీలోని 13 జిల్లాల్లో చిరునామా (ఆధార్, ఇల్లు) ఉండడం గమనార్హం. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో అమలౌతున్న అనేక సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఆరోగ్య శ్రీ కార్డుపై కరోనాకు ఏపీలో చికిత్స అందిస్తున్న సంగతి తెల్సిందే.
ఇటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులకు కరోనా, మరేదైనా రోగం వస్తే తెలంగాణలో ఉంటున్న తమకు ఏపీలో వైద్య సేవలు అందడం లేదని వాపోతున్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా తదితర పథకాలను సైతం తమ కుటుంబ సభ్యులు అందుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణలో ఉంటున్నప్పటికీ వారి చిరునామా ఏపీలో ఉండడంతో నాన్ లోకల్ కావడంతో అక్కడి పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో అవకాశాలు కోల్పోతున్నారు.
కానిస్టేబుల్ పోస్టులకు 40 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి ఉన్నప్పటికీ.. ఆ హోంగార్డులకు తెలంగాణ కానిస్టేబుల్ పోస్టుల్లో 20శాతం, ఏపీఎస్‌పీలో 15శాతం, ఏఆర్‌లో 10శాతం చొప్పున హోంగార్డులకు ఇచ్చే రిజర్వేషన్ తమకు దక్కడం లేదని వాపోతున్నారు. ఇలా రెండు రాష్ట్రాల్లో అవకాశాలను కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల ఏపీ, తెలంగాణ డీజీపీలు డి.గౌతమ్ సవాంగ్, ఎం.మహేందర్‌రెడ్డిని కలిసి విన్నవించుకున్నారు.
ఆంధ్రాకు బదిలీ చేయండి..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 ఏళ్ల క్రితం హోంగార్డుగా ఎంపికైన చాలా మంది రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో ఉండిపోయారు. ఏపీకి చెందిన మేము తెలంగాణలో హోంగార్డు ఉద్యోగం చేస్తున్నప్పటికీ నాన్ లోకల్‌గానే పరిగణిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ అనేక అవకాశాలు కోల్పోతున్నాం. అవకాశం ఉంటే ఏపీకి బదిలీ చేయండి. లేదంటే తెలంగాణలో ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ప్రకటించి పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
–ఎస్.లక్ష్మీనారాయణరెడ్డి, తెలంగాణ హోంగార్డు, ప్రకాశం జిల్లా వాసి
Comments
Please login to add a commentAdd a comment