సమష్టి కృషితో ప్రగతిపథంలో.. | Andhra Pradesh New Chief Secretary Aditya Nath Das Take Charge | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితో ప్రగతిపథంలో..

Published Fri, Jan 1 2021 5:00 AM | Last Updated on Fri, Jan 1 2021 5:00 AM

Andhra Pradesh New Chief Secretary Aditya Nath Das Take Charge - Sakshi

సీఎం జగన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న సీఎస్‌ ఆదిత్యనాథ్‌.చిత్రంలో నీలం సాహ్ని

సాక్షి, అమరావతి: దేశంలోనే ఉత్తమ అధికారులుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న గుర్తింపును నిలబెట్టుకునేలా అధికార యంత్రాంగం తోడ్పాటు అందించాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత పురోగమించేలా కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఆదిత్యనాథ్‌ దాస్‌ కోరారు. గురువారం సచివాలయం మొదటి బ్లాకులోని కార్యాలయంలో నీలం సాహ్ని నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతర్‌ రాష్ట్ర బదిలీలకు సంబంధించిన దస్త్రంపై ఆదిత్యనాథ్‌దాస్‌ తొలి సంతకం చేశారు. గవర్నర్‌తో పాటు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు  ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లడంతోపాటు పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా కృషి చేస్తానని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని మెరుగైన సేవలు అందించారని ఆదిత్యనాథ్‌దాస్‌ పేర్కొన్నారు. సాహ్ని పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సభలో ఆయన మాట్లాడారు. ఆమె ఏ పదవిలో ఉన్నా ఎంతో నిబద్ధతతో పని చేశారన్నారు.  అనంతరం సాహ్నిని ఆదిత్యనాథ్‌దాస్‌ సత్కరించారు.
గవర్నర్‌తో సమావేశమైన నూతన సీఎస్‌ ఆదిత్యనాథ్‌..  

ఆంధ్రప్రదేశ్‌ అద్భుతమైన రాష్ట్రం..
టెక్కలిలో 36 ఏళ్ల క్రితం సబ్‌ కలెక్టర్‌గా సర్వీసులో చేరిన తాను వివిధ హోదాల్లో పనిచేసి సీఎస్‌గా పదవీ విరమణ చేయడం సంతృప్తి కలిగిస్తోందని నీలం సాహ్ని చెప్పారు. ముఖ్యంగా అద్భుతమైన ఏపీలో పని చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్‌ అందించిన సహాయ సహకారాలకు సర్వదా కృతజ్ఞురాలినని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో సీఎం ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడంలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదిత్యనాథ్‌కు అధికారులు ప్రవీణ్‌ ప్రకాశ్, శశిభూషణ్, కృష్ణబాబు, రావత్, ఉదయలక్ష్మి, టి.విజయకుమార్‌రెడ్డి, ముఖేష్‌కుమార్‌ మీనా, ప్రవీణ్‌కుమార్, విజయకృష్ణన్‌ శుభాకాంక్షలు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement