CM Jagan Says Andhra Pradesh State First In Ease Of Doing Business (EoDB) For The Last Three Years - Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా ఏపీ నంబర్‌ వన్‌.. ఇదీ మన ఘనత

Published Sat, Nov 12 2022 2:51 AM | Last Updated on Sat, Nov 12 2022 11:57 AM

Andhra Pradesh No1 For Three Years Says CM YS Jagan - Sakshi

సాక్షి, నరసరావుపేట: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఉందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పరిశ్రమలకు సింగిల్‌ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఈ కారణంగా గత మూడేళ్లుగా మన రాష్ట్రం వరుసగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.

పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద ఐటీసీ సంస్థ సుమారు రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ (సుగంధ ద్రవ్యాలు) ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. వేలాది మంది రైతులకు మేలు చేసేలా ఈ పరిశ్రమను ఏర్పాటు చేసిన ఐటీసీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పరిశ్రమలు పెట్టే వాళ్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు సంబంధించి మార్కులు ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ స్థానం దక్కించుకోవడం గొప్ప మార్పునకు నిదర్శనం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

రెండేళ్లలోనే పూర్తి
దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడితో ఐటీసీ గ్లోబల్‌ స్పైసెస్‌ ప్లాంట్‌ ప్రారంభమవ్వడం ఒక అద్భుత ఘట్టం. ఏటా 20 వేల మెట్రిక్‌ టన్నుల దాకా ప్రాసెస్‌ చేసి, ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తారు. మిర్చితోపాటు అల్లం, పసుపు, ధనియాలు, యాలకులు వంటి 15 రకాల సేంద్రియ సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేస్తారు. 
ఈ ప్లాంట్‌ తొలి దశ పూర్తయింది. రెండో దశ కూడా మరో 15 నెలల్లో పూర్తవుతుందని చెబుతున్నారు. అది కూడా పూర్తయితే.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మన రాష్ట్రంలోనే ఉంటుందని ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌ పూరి చెప్పారు. 
ఈ యూనిట్‌ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న 14 వేల మంది రైతులకు ఇది ఒక గొప్ప వరం. వీరి ఉత్పత్తులకు గిరాకీ లభిస్తుంది. 2020 నవంబర్‌లో ఈ ప్లాంట్‌ నిర్మాణం ప్రారంభించారు. 2022 నవంబర్‌.. అంటే కేవలం 24 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేశారు. ఇంత వేగంగా అడుగులు పడ్డాయంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఏ మేరకు ఉందో అందరికీ తెలుస్తోంది. 

ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో..
ఐటీసీ సంస్థ ఈ రాష్ట్రంలో ఇంకా మెరుగైన స్థితికి ఎదగాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అన్ని రకాల మద్దతు ఇచ్చే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు ఉండదని యాజమాన్యానికి చెబుతున్నా. 
ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉంటుందనే విషయాన్ని సంజీవ్‌ పూరి మనసులో పెట్టుకోవాలి. మీ కష్టాన్ని మా కష్టంగా భావించి.. సాధ్యమైనంత వేగంగా పరిష్కరిస్తాం. ఇది మా మాట. ఇంత మంచి ప్రాజెక్టు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు.

రూ.3,450 కోట్లతో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు 
రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఇంకా ఎక్కువ రావాలని ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం. 26 జిల్లాల్లో రైతులు స్థానికంగా పండించే పంటలన్నింటికీ ఇంకా మెరుగైన ధర రావాలి. వ్యాల్యూ ఎడిషన్‌ ద్వారా అది సాధ్యమవుతుందని 26 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను రూ.3,450 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 
తద్వారా ప్రతి జిల్లాలోని రైతులందరికీ మేలు చేయడమే కాకుండా, దాదాపు 33 వేల ఉద్యోగాలు కల్పించగలుగుతాం. ఇందులో ఫేజ్‌–1కు సంబంధించి రూ.1,250 కోట్ల పెట్టుబడితో 10 యూనిట్ల కోసం డిసెంబర్, జనవరిలో శంకుస్థాపన చేయనున్నాం. మరో రెండు మూడేళ్లలో మొత్తం 26 యూనిట్లు అందుబాటులోకి వస్తాయి. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఇవి ఒక పెద్ద వరంగా మారనున్నాయి. 
ఈ కార్యక్రమంలో ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌పూరి, స్పైసెస్‌ బోర్డు సెక్రటరీ సతియాన్, రాష్ట్ర మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, విడదల రజని, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, పోతుల సునీత, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసుమహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్‌రావు, కిలారి రోశయ్య, జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీక్రిస్టినా, జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రైతుల ఉత్పత్తులకు వ్యాల్యూ ఎడిషన్‌ 
ఐటీసీ స్పైసెస్‌ ప్లాంట్‌కు సంబంధించిన వీళ్ల ప్రొసీజర్‌ పక్కాగా ఉంటుంది. సరుకు వచ్చిన వెంటనే క్లీనింగ్, గ్రేడింగ్, డీ స్టీమింగ్, గ్రైండింగ్, బ్లెండింగ్, స్టీమ్‌ స్టెరిలైజేషన్‌ చేశాక, ప్యాకింగ్‌ చేస్తారు. ఇలా ప్రాసెసింగ్‌ పూర్తి చేసుకోవడం వల్ల రైతులు పండించిన పంటకు వ్యాల్యూ ఎడిషన్‌ తోడవుతుంది. 
ఎక్స్‌పోర్ట్‌ మార్కెట్‌లో వీటి అమ్మకం కూడా సులభమవుతుందనే ఉద్దేశంతో ఈ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు సహకరిస్తున్నాం. ఇటువంటి ప్రాసెసింగ్‌ యూనిట్లు మన రాష్ట్రంలో రావడం వల్ల మన రైతులకు కచ్చితంగా మేలు జరుగుతుంది. మన రైతుల ఉత్పత్తులకు మెరుగైన రేటు ఇచ్చి, మన రైతులను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమంలో ఐటీసీ ముందడుగు వేస్తోంది. 
ఇటువంటి గొప్ప మార్పులు వ్యవసాయ రంగంలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల స్థాపనతో ఇందుకు తొలి అడుగు పడింది. రాష్ట్రంలో దాదాపు 10,668 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్‌ గ్యాడ్యుయేషన్‌ చదివిన ఒక అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను నియమించాం. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టుకుని నడిపించేలా గొప్ప విప్లవం సృష్టించాం.

ప్రతి దశలో అండగా నిలిచిన ప్రభుత్వం
ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే నంబర్‌ వన్‌. ఈ ప్లాంట్‌ తొలి దశ పూర్తయింది. రెండో దశ మరో 15 నెలల్లో పూర్తవుతుంది. అది కూడా పూర్తయితే, ఆసియా ఖండంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ మన రాష్ట్రంలోనే ఉంటుంది. ఈ ప్లాంట్‌ ద్వారా 14 వేల మంది రైతులకు మేలు జరుగుతుంది. కేవలం రెండేళ్లలోనే ఈ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాం. ఇంత వేగంగా అడుగులు పడటానికి కారణం ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అండగా నిలవడమే.  
– సంజీవ్‌పూరి, ఐటీసీ చైర్మన్‌ 

రాష్ట్రంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి ఐటీసీ చైర్మన్‌ సంజీవ్‌ పూరి గొప్పగా చెప్పారు. ఆయన నోటి వెంటæ ఈ మాటలు రావడం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి అధికారికి గొప్ప క్రెడిట్‌. ఈ మూడేళ్లలో మనందరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూస్తున్నారు. ఇక్కడ పరిశ్రమలు స్థాపించడానికి అనువైన వాతావరణం ఉందని అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇలా వచ్చే వారందరికీ అన్ని విధాలా సహకరిస్తున్నాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా వరుసగా మొదటి స్థానంలో నిలిచామంటేనే మన చిత్తశుద్ధి ఏమిటో చేతల్లోనే తెలుస్తోంది. 
– సీఎం వైఎస్‌ జగన్‌
 
ఏపీలో ఆదర్శవంతమైన పాలన
మా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ యూనిట్‌ను ప్రారంభించడం శుభ పరిణామం. ఇందులో స్థానికులకు.. ప్రత్యేకించి 70 శాతం మహిళలకు అవకాశం ఇవ్వడం విశేషం. ఈ ప్రాంతానికి స్పైసెస్‌ పార్క్‌ రావడానికి కేంద్రాన్ని ఒప్పించి, సాధించిన ఘనత దివంగత నేత వైఎస్సార్‌దే. ఆయన అడుగుజాడల్లోనే జగనన్న రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకు వస్తుండడం శుభ పరిణామం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సింది 40 ఏళ్ల అనుభవం కాదు. మంచి మనసు, పట్టుదల. ఇవి మా ముఖ్యమంత్రికి పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారు.
– విడదల రజిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
చదవండి: సీఎం జగన్‌ హామీ.. ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement