సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి: దేశ వ్యాప్తంగా 15–18 ఏళ్ల వారికి మొదటి డోసు వ్యాక్సిన్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం మూడు రోజుల్లోనే 52.82 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,89,501 మంది బాలబాలికలకు టీకా వేశారు. హిమాచల్‌ప్రదేశ్ 49.2 శాతం, గుజరాత్ 45.29 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌లో 33.44 శాతం, రాజస్తాన్‌లో 22 శాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 76.09 శాతానికి పైగా వ్యాక్సినేషన్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 24.41 లక్షల మంది టీనేజర్లను గుర్తించగా.. వీరికి మూడు రోజులుగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కోవాగ్జిన్ టీకాను అందిస్తున్నారు. గురువారం (నేటి) నుంచి సచివాలయాలతో పాటు విద్యా సంస్థల్లో కూడా ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. శనివారం నాటికి టీనేజర్లందరికీ వ్యాక్సిన్ వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా జనవరి 3వ తేదీన టీనేజ్ వారికి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్రం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 147.72 కోట్ల డోస్‌ల టీకాలను కేంద్రం పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment