సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ (ఏపీజెన్‌కో) మరో మైలురాయిని అధిగమించింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్‌టీటీపీఎస్‌లోని 8వ యూనిట్ వాణిజ్య ఉత్పత్తికి విజయవంతంగా శ్రీకారం చుట్టింది. కొత్తగా నిర్మించిన 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ 72 గంటలపాటు నిర్విరామంగా వందశాతానికిపైగా సామర్థ్యంతో పనిచేయడంతో.. బుధవారం ఉదయం 10.45 గంటలకు విద్యుత్ వాణిజ్య ఉత్పత్తి (కమర్షియల్ ఆపరేషన్ డేట్– సీవోడీ) ప్రారంభమైంది. ఏపీజెన్‌కో ఎండీ , ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్‌బాబు సమక్షంలో సంస్థ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, సిబ్బంది హర్షధ్వానాల మధ్య ఏపీజెన్‌కో, ఏపీట్రాన్స్‌కో, ఏపీపీసీసీ, ఏపీ డిస్కంల ప్రతినిధులు బుధవారం ఉదయం సీవోడీ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,760 నుంచి 2,560 మెగావాట్లకు పెంచుకుని ఏపీజెన్‌కోలో డాక్టర్ ఎన్‌టీటీపీఎస్ అతి పెద్ద ఉత్పత్తి కేంద్రంగా ఆవిర్భవించింది. డాక్టర్ ఎన్‌టీటీపీఎస్‌లో స్టేజ్–5 కింద 800 మెగావాట్ల సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఎనిమిదో యూనిట్ కోవిడ్ లాంటి కష్టకాలాన్ని, అనేక సవాళ్లను అధిగమించి వాణిజ్య ఉత్పత్తి సాధించింది. ఈ సందర్భంగా సంస్థ ఎండీ కేక్ కట్‌చేసి, కొత్త యూనిట్ నిర్మాణంలో భాగస్వాములై సేవలందించిన పలువురిని జ్ఞాపికలతో సత్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడంవల్లే ఎనిమిదో యూనిట్ నిర్మాణపనులు పూర్తిచేసి సీవోడీ చేసుకోగలిగామని ఏపీజెన్‌కో ఎండీ చక్రధర్‌బాబు చెప్పారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సహించడంవల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అడుగడుగునా మార్గదర్శకం చేశారన్నారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏపీజెన్‌కో ఉద్యోగులు, భాగస్వామ్య సంస్థలైన బీహెచ్‌ఈఎల్, బీజేఆర్, ఆర్‌ఈసీ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు.
8,789 మెగావాట్లకు పెరిగిన జెన్‌కో సామర్థ్యం
డాక్టర్ ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల ఎనిమిదో యూనిట్ సీవోడీతో జెన్‌కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 6,610 మెగావాట్లకు పెరిగింది. జెన్‌కో మొత్తం ఉత్పాదన సామర్థ్యం 8,789 మెగావాట్లకు పెరిగింది. ప్రస్తుతం జెన్‌కోకి 6,610 మెగావాట్ల థర్మల్, 1,773.600 మెగావాట్ల హైడల్, 405.426 మెగావాట్ల సోలార్ (మొత్తం 8,789.026 మెగావాట్లు) విద్యుదుత్పాదన సామర్థ్యం ఉంది. మొత్తం రాష్ట్ర గ్రిడ్ డిమాండ్‌లో 55 నుంచి 60 శాతం విద్యుత్ అందించే సామర్థ్యం ఏపీ జెన్‌కోకు వచ్చింది.
రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో మైలురాయి
Published Thu, Dec 21 2023 4:26 AM | Last Updated on Thu, Dec 21 2023 7:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment