విద్యుత్ రంగంలో గత ప్రభుత్వ పథకాలు తమవిగా గొప్పలు
ఎన్నికల ముందు హామీ ఇచ్చిన పంపుసెట్ల ప్రస్తావనే లేదు
ట్రూ అప్ చార్జీలుగా వసూలు చేసేదే రూ.17 వేల కోట్లు
సబ్సిడీలకు విదిల్చింది మాత్రం రూ.8,207 కోట్లు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం సోమవారం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో విద్యుత్ శాఖకు అరకొర కేటాయింపులతో సరిపెట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులు, వివిధ వర్గాలకు అందించిన ఉచిత, రాయితీ విద్యుత్ పథకాలను కూటమి సర్కారు తమవిగా చెప్పుకుంది. ఈ ఏడాది నుంచే రాష్ట్ర ప్రజలపై దాదాపు రూ.17 వేల కోట్ల ఇంధన సర్దుబాటు చార్జీలను వసూలు చేస్తున్న ప్రభుత్వం విద్యుత్ రంగానికి, ప్రజలకు ఇచ్చే రాయితీలు, సబ్సిడీల కోసం కేవలం రూ.8,207.64 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇచ్చే దానికంటే రెట్టింపు వసూలు చేయనుంది.
జగన్ పథకాలే తమవిగా..
ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇప్పుడు వినియోగదారులపై ట్రూ అప్ చార్జీల భారం మోపాల్సి వచ్చిందంటూ నిందలు మోపారు. నిజానికి గతంలో టీడీపీ హయాంలో జరిగిన అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల కారణంగానే రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి. ఆ వాస్తవాన్ని ఆర్థిక మంత్రి దాచిపెట్టారు. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడం కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ప్రత్యేక పాలసీని తీసుకువచ్చింది. దానినే కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది.
తమ ప్రభుత్వం ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేస్తూ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి కాలనీల్లో ప్రతి ఇంటికీ నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని ఆర్థిక మంత్రి తెలిపారు. ధోబీ ఘాట్లకు, దారిద్య రేఖకు దిగువనున్న రజకులు నిర్వహిస్తున్న లాండ్రీలకు, నాయీబ్రాహ్మణుల క్షౌ రశాలలకు, స్వర్ణకారుల దుకాణాలకు, అత్యంత వెనుకబడిన కులాలకు, చేనేత కార్మికులకు ఉచితంగా, రాయితీపై విద్యుత్ అందిస్తున్నామన్నారు.
అయితే.. ఈ పథకాలన్నీ గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేసినవే. ఎన్నికల ముందు రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదు. భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. డిస్కంలకు కూడా ఒక్క పైసా సాయం ప్రకటించలేదు.
సభను హుందాగా
నడిపేలా సహకరించండి
సాక్షి, అమరావతి: సభను హుందాగా నడిపేలా సహకరించాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు సభ్యులకు హితవు పలికారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం ప్రారంభమైన సభలో తొలుత కొద్దిసేపు మాట్లాడిన మోషేన్‌రాజు సభ్యులకు పలు సూచనలు చేశారు. పెద్దల సభ గౌరవాన్ని, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునేలా సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర సాధారణ బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి పి.నారాయణ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. మండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నాయకుడు బొత్సా సత్యనారాయణ వైఎస్సార్‌సీపీ, టీడీపీ, పీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం చెప్పిన బడ్జెట్ లెక్కలు
⇒ ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి రూ.4.25 కోట్లు
⇒ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కి రూ.0
⇒ ఏపీ ట్రాన్స్‌కోకి రూ.742.56 కోట్లు
⇒ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు రూ.0
⇒ ఆక్వా రాయితీ విద్యుత్‌కు రూ.738 కోట్లు
⇒ విద్యుత్ రంగ సంస్కరణలు, నష్టాలకు రూ.0
⇒ వ్యవసాయ ఉచిత, అనుబంధ రంగాల రాయితీ విద్యుత్‌కు రూ.5,760.74
⇒ ప్రపంచ బ్యాంక్, ఏషియన్ బ్యాంకుల రుణాలకు రూ.611.76 కోట్లు
⇒ డైరెక్టరేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ కోసం రూ.10.16 కోట్లు
⇒ ఏపీ జెన్‌కో హెడ్‌వర్క్స్, హైడ్రో ఎలక్ట్రిక్ కోసం రూ.37.69 కోట్లు
⇒ ఇంధన శాఖ ఆర్థిక కార్యకలాపాలకు రూ.302.46 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment