బడ్జెట్‌లో వలంటీర్ల గౌరవ వేతనాలకు కేటాయింపులు నిల్
నిధులు కేటాయించకపోవడమంటే వలంటీర్ల వ్యవస్థకు ముగింపు పలికినట్టేనంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఐదేళ్లపాటు ఎలాంటి అవినీతి, పక్షపాతం, పైరవీలకు తావులేకుండా సామాజిక పింఛను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నగదు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసినట్టే. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనాల చెల్లింపుల కోసం నిధులే కేటాయించలేదు.
గ్రామ వలంటీర్ల వేతనాలకే 2022–23 ఆరి్థక ఏడాదిలో రూ.1,183.80 కోట్లు, 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,201.79 కోట్లను అప్పటి వైఎస్ జగన్ సర్కారు బడ్జెట్‌లో కేటాయించి వారికి చెల్లించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గ్రామ వలంటీర్లకు రూ.194.69 కోట్లు, వార్డు వలంటీర్లకు రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ మొత్తం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్‌లో పొందుపర్చి ఏప్రిల్, మే నెలల్లో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనాల నిమిత్తమే ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపుల కింద చూపించారు.
ఆ రెండు నెలల కోసం వ్యయం చేసిన మొత్తం తప్ప.. తదనంతర 10 నెలల నిమిత్తం బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. వలంటీర్లకు ఇప్పటికే ప్రభుత్వం 5 నెలల వేతనాలు బకాయి పడింది. ఆ మొత్తంతోపాటు వచ్చే 5 నెలల వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.
పట్టణాల్లో వార్డు వలంటీర్ల పరిస్థితీ అంతే..
పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వార్డు వలంటీర్ల వేతనాలకు సైతం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2022–23 ఆర్థిక ఏడాదిలో వార్డు వలంటీర్ల కోసం రూ.409.12 కోట్లు, 2023–24 ఆరి్థక ఏడాదిలో రూ.412.37 కోట్లను ప్రతిపాదించిన వైఎస్ జగన్ సర్కారు వారికి చెల్లింపులు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో వార్డు వలంటీర్ల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇప్పటికే వార్డు వలంటీర్లకు చెల్లించిన ఏప్రిల్, మే నెలల వేతనాలకు ఖర్చు చేసిన మొత్తం తప్ప.. 5 నెలల పెండింగ్ వేతనాలు, వచ్చే 5 నెలల్లో చెల్లించాల్సిన వేతనాలకు పైసా కూడా కేటాయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment