సాక్షి, అమరావతి: వ్యవసాయ బిల్లులతో రైతులకు ఎలాంటి నష్టం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు కొమ్ము కాసే కాంగ్రెస్.. బిల్లును వ్యతిరేకిస్తోందని మండిపడ్డారు. దేశంలో దళారీ వ్యవస్థ వల్ల నష్టం జరుగుతోందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్లను ఆయన తప్పుపట్టారు. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు సనాతన ధర్మం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ధర్మరాజు లాంటి ఎన్టీ రామారావును ఎందుకు దించేశారో చెప్పాలన్నారు. 40 ఆలయాలు కూల్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. పుష్కరాల్లో చంద్రబాబు వల్ల 30 మంది చనిపోయారని, ప్రాణాలు తీసిన వాళ్లు ధర్మం గురించి మాట్లాడుతున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. (చదవండి: అమరావతిలో ఏం అభివృద్ధి చేశారు?)
ఆర్టికల్ 370, రామజన్మ భూమికి ఇచ్చిన ప్రాధాన్యతే రైతులకు ఇస్తామని తెలిపారు. అడ్డంకులు లేకుండా పండించిన పంటను గిట్టుబాటు ధరకు రైతే అమ్ముకోవాలని, అందుకే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని వివరించారు. వ్యాపార లావాదేవీల ద్వారా రైతులు సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. యూపీఏ ఇచ్చినా సబ్సిడీ కంటే రెండింతలు బీజేపీ ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. మార్కెట్ యార్డులు రద్దు చేస్తారన్న ప్రచారం నిజం కాదని, రైతు రాజ్యస్థాపనే ప్రధాని మోదీ లక్ష్యమని, దేశంలో దళారీ వ్యవస్థ వల్ల నష్టం జరుగుతోందని వీర్రాజు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment