సాక్షి, తిరుపతి: రానున్న ఎన్నికల్లో అందరూ అనుకున్నట్లు టీడీపీతో పొత్తు పెట్టుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని పారిచెర్లవారిపాళెం గ్రామంలో సోమవారం కేంద్ర ఐటీ సహాయ మంత్రి దేవూసిన్హ్ చౌహాన్‌తో కలసి ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో సోము వీర్రాజు మాట్లాడారు.
బీజేపీ .. పొత్తులతో అధికారంలోకి రాదని, అందుకే రాష్ట్రంలో టీడీపీతో ఎలాంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని అనుకుంటున్నట్లు తెలిపారు. అయితే జనసేనతో మాత్రం కలసి నడుస్తామన్నారు. గతంలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఇబ్బంది పెట్టిన విషయం మరచిపోలేదని.. దీంతోనే కేంద్రంలోని పెద్దలు కూడా చంద్రబాబుతో పొత్తు అంటే అంగీకరించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో చంద్రబాబు పాలన సమయంలో రాష్ట్రానికి రూ.35వేల కోట్ల నిధులు ఇచ్చారని.. అయితే ఆయన వాటిని చంద్రన్న బాట పేరుతో ఖర్చుచేసి బీజేపీ ఏమి ఇవ్వలేదని చెప్పారని దుయ్యబట్టారు.
ఇవాళ.. జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పలు పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేస్తున్నారని దీంతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తిరుపతి జిల్లాలో 85 చెరువులను అమృత్ సరోవర్ పేరుతో ఆధునికీకరణ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో తాము అందిస్తున్న సంక్షేమ పథకాలతోనే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు.
ప్యాకేజీ చాలన్నది బాబే..
రాష్ట్రానికి ప్రత్యేకహోదా వద్దు ప్యాకేజీ చాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారు. బీజేపీ పాలన చేపట్టి 9 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చిత్తూరులోని గంగినేనిచెరువు పార్కు వద్ద నిర్వహించిన జిల్లా మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. మోదీ పాలన దేశానికి ఆదర్శమన్నారు. చంద్రబాబు అమరావతిలో తాత్కాలిక రాజధాని నిర్మించారని ఆరోపించారు. బాబు పాలనలో సోమవారం పోలవరం అని కాలక్షేపం చేశారన్నారు. జనసేన, టీడీపీ పొత్తు విషయమై బాబునే ప్రశ్నించాలని చెప్పారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment