సాక్షి, అమరావతి: నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్‌లో రూ.4,791.69 కోట్ల నిధులు కేటాయించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండరాదన్న లక్ష్యంతో సీఎం జగన్ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ప్రవేశపెట్టారు. పథకం కింద రెండు దశల్లో 28.30 లక్షల ఇళ్లను రూ.50,944 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం రూ.28,084 కోట్లతో జరుగుతోంది. వీటిలో 10.88 లక్షల ఇళ్లు ప్రస్తుతం పునాది దశలో ఉన్నాయి. 2.50 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
21.7 కోట్ల పనిదినాల సృష్టి
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నడూలేని విధంగా తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా 21.7 కోట్ల పనిదినాలు కల్పించారు. తద్వారా ఇప్పటివరకూ ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.1,146.7 కోట్లు చెల్లించింది. అదేవిధంగా ఒక్కో లబ్ధిదారురాలికి 3 శాతం వడ్డీతో రూ.35వేల రుణాన్ని ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది.
రుణ విముక్తి..
ఇక 2011కు ముందు గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణసాయంతో ఇళ్లు నిర్మించుకున్న వారికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రుణ విముక్తి కల్పిస్తున్నారు. అదే విధంగా లబ్ధిదారులకు స్పష్టమైన టైటిల్, స్వాధీన హక్కుతో ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. రుణాలు పొందకుండా ఇళ్లు నిర్మించుకున్న వారికీ హక్కులు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 8.56 లక్షల మంది పథకం ద్వారా లబ్ధిపొందారు.
సచివాలయాలకు పెరిగిన కేటాయింపులు
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కేటాయింపులను బాగా పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ శాఖకు ప్రభుత్వం ఖర్చు రూ.2,890.26 కోట్లు ఉండగా వచ్చే ఏడాదికి రూ.3,396.25 కోట్లకు పెంచింది. ఇందులో గ్రామ సచివాలయాలు, శాఖ ప్రధాన కార్యాలయాల నిర్వహణ ఖర్చులతోపాటు గ్రామ సచివాలయ ఉద్యోగుల జీతభత్యాలు, గ్రామ వలంటీర్ల గౌరవ వేతనం వంటి ఖర్చులు కలిసి ఉంటాయి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషనరీ ప్రకటన కసరత్తును జూన్ నెలాఖరుకల్లా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
ప్రొబేషనరీ ప్రకటనతో అర్హులైన గ్రామ సచివాలయాల ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ శాఖకు బడ్జెట్ కేటాయింపులను కూడా పెంచినట్టు అధికారులు వెల్లడించారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు వార్డు వలంటీర్లకు వేరుగా మునిసిపల్ శాఖ నుంచి ప్రభుత్వం వేరుగా మరికొన్ని నిధులను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment