సాక్షి, మడకశిర: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మడకశిరకు మరో వరం ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే నియోజకవర్గంలోని అన్ని చెరువులనూ కృష్ణా జలాలతో నింపే బైపాస్ కెనాల్ ఏర్పాటుకు రూ.214.85 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మడకశిర కేంద్రంగా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఐదు నెలల్లోపే మడకశిరకు రెండు భారీ ప్రాజెక్టులు ప్రకటించడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1,600 ఎకరాల భూ సేకరణ..
మడకశిరలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,600 ఎకరాల భూమిని సేకరించింది. ఆర్.అనంతపురం, ఛత్రం, గౌడనహళ్లి గ్రామ పంచాయతీల పరిధిలోని రైతుల నుంచి సేకరించిన ఈ భూములను ఏపీఐఐసీకి అప్పగించారు. ఇందుకు సంబంధించి 800 మంది రైతులకు పరిహారాన్ని సైతం ప్రభుత్వం అందజేసింది. వైఎస్సార్ హయాంలోనే ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అయింది.
చదవండి: (తప్పు చేశా.. అందుకు తలవంచుకుంటున్నా!)
నీరుగార్చిన టీడీపీ ప్రభుత్వం..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే భూ సేకరణ జరగగా... తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పారిశ్రామిక వాడ ఏర్పాటుపై శీతకన్ను వేశాయి. గత టీడీపీ ప్రభుత్వం మరో అడుకు ముందుకేసి అదిగో.. ఇదిగో అంటూ కాలం నెట్టుకొచ్చింది. వైఎస్సార్ హయాంలో 50 శాతం పరిహారాన్ని రైతులకు అందజేయగా.. మిగిలిన 50 శాతం పరిహారం చెల్లింపు విషయంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి ఉదాసీనత కనబరిచింది. దీంతో పారిశ్రామిక వాడ ఏర్పాటు అంశం నీరుగారిపోయింది. ఈ దశలో దాదాపు రూ.25 కోట్ల మిగులు పరిహారాన్ని రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చెల్లించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మార్గం సుగమమం చేసింది.
సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం
మడకశిర కేంద్రంగా పారిశ్రామిక వాడ ఏర్పాటుకు మంత్రి వర్గం ఆమోదం తెలపడంపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. మడకశిర అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక నిరుద్యోగ యువతకు విస్తృత ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment