AP Cabinet Meeting Chaired By CM Jagan - Sakshi
Sakshi News home page

AP: ఇకపై పింఛన్‌ రూ.2,750 

Published Tue, Dec 13 2022 9:35 AM | Last Updated on Wed, Dec 14 2022 7:20 AM

AP Cabinet Meeting Chaired By CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవ్వాతాతలకు ఇచ్చే పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.2,750కు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచే ఈ మేరకు అవ్వాతాతలకు అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు నెలకు అదనంగా రూ.130.44 కోట్ల వ్యయం అవుతుంది. రాష్ట్రంలో అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతామంటూ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆ హామీని అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెన్షన్‌ను రెండు విడతలుగా రూ.2,250కి.. రూ.2,500కు పెంచారు.

ఇకపై రూ.2,750 చొప్పున ఇవ్వాలన్న కీలక నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం 62 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు నెలకు సుమారు రూ.1,720 కోట్లను పెన్షన్‌గా పంపిణీ చేస్తోంది. కొత్తగా డిసెంబర్‌లో 2.43 లక్షల మందికి పెన్షన్‌ను  మంజూరు చేసింది. వారితో కలుపుకుంటే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 64.74 లక్షలకు చేరుకుంది. దాంతో పెన్షన్ల కోసం ప్రభుత్వం నెలకు చేస్తున్న వ్యయం మొత్తం రూ.1,786 కోట్లకు పెరగనుంది. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారు.

ప్రస్తుతం దానికి నాలుగున్నర రెట్లు అదనంగా పెన్షన్‌ రూపంలో అవ్వాతాతలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందజేస్తుండటం గమనార్హం. పెంచిన పెన్షన్‌ పంపిణీకి సంబంధించి జనవరి 1 నుంచి 7 వరకు వారోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెంచిన పెన్షన్‌ మంజూరు పత్రాలను ప్రభుత్వం అందజేయనుంది.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. సంక్షేమం, అభివృద్ధి పథకాలు, పరిశ్రమల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిని సమాచార, బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. 
 
కొత్తగా అర్హత సాధించిన వారికి 27న పంపిణీ 
► అర్హులైన పేదలందరికీ నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలులో భాగంగా వివిధ కారణాల వల్ల మిగిలి పోయిన, కొత్తగా అర్హత సాధించిన లబ్ధిదారులకు ఏడాదికి రెండు దఫాలు (జూన్, డిసెంబర్‌)గా లబ్ధి చేకూర్చాలని గతంలో మంత్రివర్గం నిర్ణయించింది. ఆ నిర్ణయం అమల్లో భాగంగా కొత్తగా అర్హత సాధించిన వారికి ఈనెల 27న సంక్షేమ పథకాల ఫలాలను అందజేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

► ఇందులో భాంగా డిసెంబర్‌ 27న వివిధ పథకాల కింద 2.51 లక్షల మందికి రూ.403 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. దాంతోపాటు అదనంగా 2.43 లక్షల మందికి పెన్షన్లు, 44,543 బియ్యం కార్డులు, 14,441 ఆరోగ్యశ్రీ కార్డులు, 14,531 ఇళ్ల పట్టాలు, రూ.65 కోట్ల విలువైన సస్పీసియస్‌ అకౌంట్‌లో ఉన్న బీమా క్లెయింలు మంజూరు చేసింది.   

► వ్యవసాయ, సహకార, మత్స్య శాఖలలో 2022 మే, జూన్‌ నెలలో అమలు చేసిన సంక్షేమ క్యాలెండర్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

► ఖరీప్‌–2022కు సంబంధించి రాష్ట్రంలో గతంలో అమలు చేసిన సాగునీటి విడుదల షెడ్యూల్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సకాలంలో ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం ద్వారా సరైన కాలానికే పంటలు చేతికందాయని, తుపాను బారి నుంచి పంటలను కాపాడుకునేందుకు ఈ షెడ్యూల్‌ ఉపకరించిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. మాండూస్‌ తుపాను ప్రభావం చూపకముందే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో 80 శాతానికి పైగా ధాన్యం సేకరణ పూర్తి చేయగలిగామని మంత్రివర్గానికి సంబంధిత శాఖల అధికారులు వివరించారు.  
 
పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రమోషన్‌ పాలసీకి గ్రీన్‌ సిగ్నల్‌  
► సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో భాగంగా రాష్ట్రంలో పంప్డ్‌ స్టోరేజ్, హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ప్రమోషన్‌ పాలసీ–2022కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక్కో మెగావాట్‌కు రూ.2 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి కంపెనీలు చెల్లించాల్సి ఉంటుంది. రైతుల నుంచి భూములు తీసుకుంటే.. ఏడాదికి లీజు రూపేణా ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించాలి. ప్రతి రెండేళ్లకు లీజు రుసుము 5 శాతం పెంచి ఇవ్వడం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూరనుంది.  

► అల్లూరి సీతారామరాజు జిల్లా పెదకోట, విజయనగరం జిల్లాలో రైవాడ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 1,600 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

► వైఎస్సార్‌ జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌కు అనుమతులు మంజూరు చేసే నిర్ణయానికి మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  

► అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు వద్ద 1,350 మెగావాట్ల సామర్థ్యంతో అప్పర్‌ సీలేరు పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతుల మంజూరుకు ఆమోదం లభించింది. 
 
వైఎస్సార్‌ జిల్లాలో రూ.8,880 కోట్లతో స్టీల్‌ పరిశ్రమ  
► వైఎస్సార్‌ జిల్లా సున్నపురాళ్లపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ (సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోదించింది) ఏర్పాటుకు మంత్రిమండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏటా రెండు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ స్టీల్‌ పరిశ్రమను ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో మరో 2.5 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఆమోదం తెలిపింది. రూ.8,880 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 6,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి.  
 
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్‌ స్థాయి డిజిటల్‌ తరగతులు  
► పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు మొదటి దశలో పనులు పూర్తయిన  స్కూళ్లలో అత్యాధునిక బోధన ఉపకరణాల ఏర్పాటుకు ఆమోదం. హైస్కూల్స్‌ పరిధిలో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌(ఐఎఫ్‌పీ), పౌండేషన్, పౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్స్‌ ఏర్పాటు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతి గతిలో దాదాపు 15,694 స్కూళ్లలో 30,230 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు ఏర్పాటు చేయనుంది. దీని కోసం రూ.300 కోట్లు ఖర్చు చేయనుంది.  

► ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ప్రతి స్కూళ్లో ఒక టీవీ ఏర్పాటు చేయనుంది. పది వేల స్మార్ట్‌ టీవీలను పాఠశాలల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు దాదాపు రూ.50 కోట్లు ఖర్చు అవుతుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింధియా, సెయింట్‌ జేవియర్స్, బాంబే స్కాటిస్, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వంటి అత్యున్నత ప్రమాణాలు గల విద్యా సంస్థల్లోనే ఇలాంటి సౌలభ్యం ఉంది.  
 
21న అందుబాటులోకి ట్యాబ్‌లు, ఈ–కంటెంట్‌ 
► ప్రభుత్వ స్కూళ్లలో 8వ తరగతి విద్యార్థులకు 24 గంటలపాటు ఉపయోగపడే విధంగా ట్యాబులు, ఈ–కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్‌ 21న లాంఛనంగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 4.6 లక్షల మంది విద్యార్థులతోపాటు.. వారికి బోధించే 60 వేల మంది ఉపాధ్యాయులకు ఉచితంగా శామ్‌సంగ్‌ ట్యాబులు పంపిణీ చేయనుంది.  

► ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా, ట్యాబ్‌ను ఇంటిలో కూడా వినియోగించుకునేలా, ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ అందుబాటులో ఉండేలా సెక్యూర్‌ డిజిటల్‌ కార్డుతో బైజూస్‌ సంస్థ కంటెంట్‌తో ట్యాబ్‌లు అందజేయనుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.668 కోట్లు వ్యయం చేస్తోంది. దాంతో పాటు రూ.778 కోట్ల విలువైన బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా ఇస్తోంది. మూడేళ్ల వారెంటీతో ఈ ట్యాబులు పంపిణీ చేస్తోంది.  
 
చంద్రబాబు ముసేయించిన చిత్తూరు డెయిరీకి మోక్షం  
► గతంలో మూసి వేతకు గురైన చిత్తూరు డెయిరీని పునరుద్ధరించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  అమూల్‌ సంస్థ ద్వారా మళ్లీ చిత్తూరు డైయిరీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. చిత్తూరు డెయిరీ భూములను 99 ఏళ్లపాటు అమూల్‌కు లీజు ఇస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రభుత్వానికి లీజు రూపంలో ఏటా రూ.కోటి చొప్పున ఆదాయం వస్తుంది. దశల వారీగా పాల సేకరణ చేస్తూ.. మొత్తంగా 4 లక్షల లీటర్ల పాలను అమూల్‌ సేకరించనుంది.  

► అమూల్‌ ప్రవేశం ద్వారా ఇప్పటికే రైతులకు మెరుగైన ధరలు దక్కుతున్నాయి. లీటరుకు అదనంగా రూ.5 నుంచి రూ.20 వరకు రైతులకు ఆదాయం వస్తోంది. చిత్తూరు డెయిరీ అంశంపై మంత్రివర్గంలో సమగ్ర చర్చ జరిగింది. తన సొంత ప్రయోజనాల కోసం చిత్తూరు డెయిరీని చంద్రబాబు మూసి వేశారని, ఆ తర్వాత పాడి రైతులను దోచుకున్నారని వ్యాఖ్యానించింది. ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోకి అమూల్‌ సంస్థను తీసుకురావడం ద్వారా పోటీ పెరిగి.. తప్పక రేట్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని, తద్వారా రైతులకు మంచి రేట్లు వస్తున్నాయని కేబినెట్‌ హర్షం వ్యక్తం చేసింది.  
 
ఉపాధ్యాయులు బోధనకు మాత్రమే 
పాఠశాల విద్యా శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ రైట్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ టు ఫ్రీ అండ్‌ కంపల్సరీ ఎడ్యుకేషన్‌ రూల్స్‌–2010కు రూల్‌ నంబర్‌ 30ని జతచేసే సవరణలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా అకడమిక్‌ వ్యవహారాలకు తప్ప బోధనేతర పనులకు ఉపాధ్యాయులను ఉపయోగించడం నిషేధం. అందువల్ల పిల్లలకు మెరుగైన బోధనను అందించగలుగుతారన్న విద్యావేత్తల అభిప్రాయల మేరకు కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉపాధ్యాయులు నిర్వర్తించిన బోధనేతర పనుల కోసం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 1.3 లక్షల మంది సచివాలయ సిబ్బందిని వినియోగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.   
 
మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. 
► పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో కొత్తగా ఏర్పాటు చేయనున్న పశు సంవర్థక పాలిటెక్నిక్‌ కళాశాలకు మంత్రివర్గం ఆమోదం. 3 బోధన, 10 బోధనేతర సిబ్బందితో కలిపి 13 పోస్టుల భర్తీతో పాటు సుమారు రూ.10 కోట్లతో కళాశాల ఏర్పాటు. 2023–24 విద్యా సంవత్సరం నుంచి తరగతుల ప్రారంభం. 

► పశు సంవర్థక శాఖ పరిధిలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ హజ్బెండరీ (తణుకు), ఏరియా వెటర్నరీ ఆసుపత్రి (గోపాలపట్నం), విశాఖపట్నంలో రెండు రేడియోగ్రాఫర్స్‌ పోస్టుల భర్తీకి ఆమోదం. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఆప్కాస్‌ ద్వారా నియమించాలని నిర్ణయం. 

► డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకంలో సవరణలకు మంత్రిమండలి ఆమోదం.  

► నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి వ్యవసాయ కళాశాలలో 52 బోధనా సిబ్బంది, 56 బోధనేతర సిబ్బందితో సహా 108 పోస్టుల ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. గతంలో మేకపాటి రాజమోహనరెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (మెరిట్స్‌)లో ఇప్పటికే అక్కడ పని చేస్తున్న సిబ్బందిని తాజాగా ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదినక నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి జ్ఞాపకార్థం మెరిట్స్‌ కాలేజీని ప్రభుత్వానికి ఉచితంగా అందజేసిన మేకపాటి కుటుంబం.  

► నేషనల్‌ లైవ్‌ స్టాక్‌ మిషన్‌లో భాగంగా వైఎస్సార్‌ పశు బీమా పథకం (లైవ్‌ స్టాక్‌ ఇన్సూరెన్స్‌ స్కీంను) పేరు మార్పునకు కేబినెట్‌ ఆమోదం. గతంలో వైఎస్సార్‌ పశునష్ట పరిహార పథకం పేరుతో ఉన్న ఈ స్కీంను ఇకపై వైఎస్సార్‌ పశు బీమా పథకంగా మార్పు.  

► చిత్తూరు జిల్లా సదుంలో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీడబ్ల్యూసీ) 30 పడకల నుంచి 50 పడకలకు అప్‌గ్రేడ్‌. ఇందులో 18 అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 

► ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌ గైడ్‌లైన్స్‌ మేరకు.. అత్యుత్తమ భోధన అందించే కార్యక్రమంలో భాగంగా పోస్టు గ్రాడ్యుయేట్‌ విభాగంలో ముగ్గురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విభాగంలో 4 ప్రొఫెసర్, 3 అసోసియేట్‌ ప్రొఫెసర్, 2 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం. 

► వైద్య ఆరోగ్య శాఖలో నాడు–నేడులో భాగంగా ఏపీఎంఎస్‌ఐడీసీ కింద చేపట్టిన పనులకు కేబినెట్‌ ఆమోదం. ఇందులో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న, ఇప్పటికే వినియోగంలో ఉన్న వైద్య కళాశాలలు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు, సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులు, కేన్సర్‌ కేర్‌ సెంటర్‌ నిర్మాణాల్లో నాడు–నేడు పనులకు ఆమోదం. 

► రాష్ట్రంలో అత్యాధునిక వైద్య చికిత్సలు (టెర్షియరీ కేర్‌) కోసం.. 16 మున్సిపల్‌ కార్పొరేషన్లలో ప్రైవేట్‌ రంగంలో మల్టీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌. ప్రతి ఆస్పత్రిలో కనీసం వంద పడకల ఏర్పాటుతో పాటు రూ.100 కోట్లు పెట్టుబడి ఉండాలి. వీటిలో 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీ కేటాయించాలి. 

► కర్నూలు జిల్లా ఆదోని, అన్నమయ్య జిల్లా రాయచోటిలో మైనార్టీ గవర్నమెంట్‌ ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో కొత్త విభాగాలు ఏర్పాటు. ఒక్కో ఐటీఐకి 20 బోధన, బోధనేతర పోస్టుల చొప్పున 40 పోస్టుల మంజూరుకు కేబినెట్‌ ఆమోదం. వీటిలో తొలిసారిగా కొత్తగా అందుబాటులోకి రానున్న సోలార్‌ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, డ్రోన్‌ టెక్నీషియన్‌ కోర్సులు. 

► సమగ్ర భూ సర్వే కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో సర్వే కోసం.. సర్వే సెటిల్మెంట్, రెవెన్యూ శాఖ సేవలను రీసర్వే పనుల కోసం వినియోగించుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్‌ మున్సిపాల్టీస్‌ యాక్టు –1965, మున్సిపల్‌ కార్పొరేషన్స్‌ యాక్టు –1955 సవరణలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 

► బాపట్ల కేంద్రంగా బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (బుడా) ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 1,301.68 చదరవు కిలోమీటర్ల పరిధిలో 2 అర్బన్‌ లోకల్‌ బాడీస్, 101 గ్రామాలు, 9 మండలాలతో బుడా  ఏర్పాటు. 

► తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా)లో ఎస్‌ఈ పోస్టు ఏర్పాటుకు, విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ)లో ఎస్‌ఈ పోస్టు ఏర్పాటుకు ఆమోదం. 

► నరసరావుపేట కేంద్రంగా పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(పుడా) ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం. 8 పట్టణ స్థానిక సంస్ధలతో పాటు 28 మండలాల పరిధిలో 349 గ్రామాలతో 7,281.31 చదరపు కిలోమీటర్ల పరిధితో ఏర్పాటు. 

► నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియల్‌ అకాడమీలో వివిధ కేటగిరీల కింద 55 అదనపు పోస్టుల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్‌ యాక్టు–1971 సవరణలకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌. 

► పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, విశాఖపట్నం, ఎన్టీఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం.   

► గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడిమిపాలెంలో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ (మదర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌) ఆస్పత్రి నిర్మాణానికి విశ్వమానవ సమైక్యతా సంస్థకు 7.45 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం. 

► అనంతపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ వైద్యశాల ఉన్నతీకరణ కోసం 8.32 ఎకరాల భూమి ఉచితంగా కేటాయింపునకు గ్రీన్‌ సిగ్నల్‌. 

► వైఎస్సార్‌ జిల్లా జమ్ములమడుగు మండలం గండికోటలో విండ్‌ టర్బైన్స్‌ ఏర్పాటుకు ఐఓసీఎల్‌కు 15 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న ప్రతిపాదనకు, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (సీపీఆర్‌ఓ) నియామకానికి కేబినెట్‌ ఆమోదం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement