సాక్షి, మార్కాపురం టౌన్(ప్రకాశం జిల్లా): వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన వెలిగొండ ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేసి ప్రారంభిస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 3, 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసిన చంద్రబాబుతో మాట్లాడినప్పుడు నిధులు అడిగితే నీళ్లులేవు, నిధులు లేవు అని చెప్పిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి మూడు జిల్లాల ప్రజల సమక్షంలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. 13 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగి ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నేనే ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2004లో ఎలక్షన్ జరిగి 2005లో సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు యాత్రలో భాగంగా నేను మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెలిగొండను సందర్శించి వెంటనే రూ.3500 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత దివంగత నేత వైఎస్‌ఆర్‌కు దక్కిందన్నారు.
ఆ సమయంలో నేను వైఎస్‌ఆర్‌తో అన్నాను ‘‘ఆ నాడు మేము మొక్కలు వేశాము, ఇపుడు మీరు జీవం పోస్తారా’’ అని అంటే ‘‘మీరే చూస్తారుగా జీవం పోసేది’’ అని చెప్పి నిధులు మంజూరు చేసిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిధులు మంజూరుతో మొదటి టన్నెల్ పూర్తి చేసింది మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. రెండో టన్నెల్ కూడా త్వరలో పూర్తి చేసి వరదలు వచ్చే సమయానికి నీళ్లు వదులుతారని తెలిపారు. సమావేశంలో ఈయన వెంట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, నాయకులు ఉన్నారు.
(చదవండి: ఈ నెల 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment