veligonda praject
-
దశాబ్దాల కల సాకారం.. గర్వంగా ఉంది: సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ, అద్భుతమైనప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. మహానేత వైఎస్సార్ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఆయన కొడుకుగా ఈ ప్రాజెక్ట్ నేను పూర్తి చేయడం గర్వంగా ఉంది. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్. 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది’’ అని సీఎం జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది’’ అని సీఎం తెలిపారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ►ఎన్నో దశాబ్దాలుగా కలలుగన్న మన స్వప్నాన్ని మన కళ్ల ఎదుటే ఈరోజు పూర్తయిన పరిస్థితుల మధ్య.. ఆ టన్నెల్లో కాస్తంత ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఇంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవుడికి సదా రుణపడి ఉంటాను. ►ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత, కరువు పీడిత మెట్ట ప్రాంత ప్రజలను, వారి దాహార్తిని తీరుస్తూ సాగు నీరు కూడా అందించే గొప్ప కార్యక్రమం ఈ ప్రాజెక్టు. ►ఈ పూల వెంకటసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును అప్పట్లో నాన్నగారు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖరరెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను కూడా ఒక్కో టన్నెల్ దాదాపు 18 కి.మీ. పైచిలుకు ఉన్న ఈ 2 టన్నెళ్లను ఆయన కొడుకే పూర్తి చేయడం.. ఆయన కొడుకే జాతికి అంకితం చేయడం నిజంగా ఇది దేవుడు రాసిన స్క్రిప్టే అన్నది ఇంతకన్నా నిదర్శనం ఏముంది. ►ప్రాజెక్టు మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేస్తే, రెండో సొరంగం పనులు కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు కలిపి మొత్తంగా 30 మండలాల్లోని 15.25 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ రెండు సొరంగాలు పూర్తయ్యాయి ►వచ్చే ఖరీఫ్‌లో, జూలై-ఆగస్టులో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి, నల్లమల సాగర్‌లో మళ్లీ నీళ్లు నిండుతున్న సన్నివేశం, ఈ జూలై-ఆగస్టులోనే జరగబోతోంది. ►దాదాపు 3 వేల క్యూసెక్కులతో మొదటి టన్నెల్ పూర్తి చేశాం. 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయింది. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీరు తీసుకురాగలిగే గొప్ప పరిస్థితి ఈరోజుతో పూర్తయిపోయింది. ►ఈ జూలై-ఆగస్టులో నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్లు ఖర్చు చేసి ఎల్ఏ ఆర్అండ్ఆర్ పూర్తి చేస్తాం ►ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఘట్టం.. ఈ రెండు టన్నెళ్లు పూర్తి కావడం. ►మిగిలినవన్నీ పెద్ద ఏమీ లేవు. రిజర్వాయర్ పూర్తయిపోయింది. నీళ్లు నింపడం కోసం 1200 కోట్లు ఇస్తే పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది ►నీళ్లు నింపే కార్యక్రమం మళ్లీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఎల్ఏ ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నీళ్లు నింపుతాం ►ఈ ప్రాజెక్టు వల్ల ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకన్నింటికీ మంచి జరుగుతుందని తెలిసినా, ఎర్రగొండపాలెం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు.. ఇన్ని నియోజకవర్గాలకు మంచి జరుగుతుందని తెలిసి కూడా.. ఈ టన్నెళ్లు పూర్తి చేయడంలో చంద్రబాబు హయాంలో నత్తనడకన పనులు జరిగాయి. రెండు టన్నెళ్లు ఉన్నాయి. ఒక్కోటీ 18.8 కి.మీ. పొడవు ఉంటే, దాదాపు 37.6 కిలోమీటర్ల టన్నెళ్ల లెంత్ అయితే, ఇందులో 2004 నుంచి 2014 వరకు దాదాపు 20 కి.మీ. రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉరుకులు పరుగులు చేస్తూ టన్నెళ్లు పూర్తి చేసే కార్యక్రమంలో యుద్ధ ప్రాతిపదికన అడుగులు పడ్డాయి. ►2014 నుంచి 2019 వరకు చూస్తే కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల వర్కులు జరిగాయి. ఆ తర్వాత మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ ఈరోజు దాదాపు మిగిలిపోయిన 11 కి.మీ. టన్నెళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నాం ►ప్రాజెక్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా దేవుడి దయతో ఇంత మంచి చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి ఈ సందర్భంగా మనసు నిండా ప్రేమతో దేవునికి కూడా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఇదీ చదవండి: YSR Cheyutha: రేపు సీఎం జగన్ అనకాపల్లి పర్యటన -
వెలిగొండ పూర్తిచేసేది సీఎం జగనే..
సాక్షి, మార్కాపురం టౌన్(ప్రకాశం జిల్లా): వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు పెట్టిన వెలిగొండ ప్రాజెక్టును ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి పూర్తిచేసి ప్రారంభిస్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్చి 3, 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసిన చంద్రబాబుతో మాట్లాడినప్పుడు నిధులు అడిగితే నీళ్లులేవు, నిధులు లేవు అని చెప్పిన ఆయన.. మళ్లీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తానని చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు శిలాఫలకం వేసి మూడు జిల్లాల ప్రజల సమక్షంలో ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోయిన ఘనత మాజీ సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. 13 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగి ఉన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే నేనే ప్రాజెక్టును ప్రారంభిస్తానని చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2004లో ఎలక్షన్ జరిగి 2005లో సీఎంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టు యాత్రలో భాగంగా నేను మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెలిగొండను సందర్శించి వెంటనే రూ.3500 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత దివంగత నేత వైఎస్ఆర్కు దక్కిందన్నారు. ఆ సమయంలో నేను వైఎస్ఆర్తో అన్నాను ‘‘ఆ నాడు మేము మొక్కలు వేశాము, ఇపుడు మీరు జీవం పోస్తారా’’ అని అంటే ‘‘మీరే చూస్తారుగా జీవం పోసేది’’ అని చెప్పి నిధులు మంజూరు చేసిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏం చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్రెడ్డి నిధులు మంజూరుతో మొదటి టన్నెల్ పూర్తి చేసింది మీకు కనిపించలేదా అని ప్రశ్నించారు. రెండో టన్నెల్ కూడా త్వరలో పూర్తి చేసి వరదలు వచ్చే సమయానికి నీళ్లు వదులుతారని తెలిపారు. సమావేశంలో ఈయన వెంట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, నాయకులు ఉన్నారు. (చదవండి: ఈ నెల 11వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు) -
అధైర్య పడొద్దు అండగా ఉంటాం
‘‘పశ్చిమ ప్రకాశంలోని ప్రతి గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. నా వంతు బాధ్యతగా అధికారులతో మాట్లాడి ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయిస్తున్నా.ఎంపీ ల్యాండ్ నుంచి అధిక నిధులు తాగునీటి సమస్య పరిష్కారానికే కేటాయించా. టీడీపీ సర్కారు ప్రకాశం జిల్లాపై కక్ష కట్టింది. అయినా అధైర్య పడకండి.కొంతకాలం ఓపిక పట్టండి. మంచి రోజులొస్తాయ్. కష్టాలన్నీ తీరి, ప్రజలంతా సంతోషంగా ఉండే రోజులు ముందున్నాయి. త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి రాగానే మీ నమ్మకాన్నినిలబెట్టుకుంటాం.’’ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైవీ నిర్వహిస్తున్న ప్రజా పాదయాత్ర తొమ్మిదో రోజు గురువారం మార్కాపురం నియోజకర్గంలో సాగింది. ప్రకాశం, మార్కాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశంపై నిర్లక్ష్యం వహించడం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన పాదయాత్రకు లభిస్తున్న మద్దతును, అభిమానాన్ని తాను ఎన్నటికి మరచిపోనన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అప్పుడే మీ కష్టాలన్ని పోయి వర్షాలు పడి ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో కరువును శాశ్వతంగా నివారించేందుకు అధికారంలోకి రాగానే వెలిగొండప్రాజెక్టుపై దృష్టి పెడతామని, నీళ్లిచ్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా పాదయాత్రలో భాగంగా తొమ్మిదోరోజు గురువారం వైవీ మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో పర్యటించారు. పాదయాత్రకు సంఘీభావం.. ప్రజా పాదయాత్రకు సంఘీభావంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు సుబ్బారెడ్డి వెంట నడిచారు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, జెడ్పీటీసీ రంగారెడ్డి, ఎంపీపీ మాలకొండయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, పట్టణ అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి గాయం లక్ష్మిరెడ్డి, సహాయ కార్యదర్శి బట్టగిరి తిరుపతిరెడ్డి, తుమ్మా వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి(దేవుడు), కొనకనమిట్ల మాజీ సర్పంచ్ అంజిరెడ్డి తదితరులు వైవీ వెంట నడిచారు. అంతకు ముందు కేపీ కొండారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్ గజమాలతో సన్మానించారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెంటచింతల మధు, డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, ముర్తుజావలి, పలువురు పార్టీ నాయకులతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్ర సాగింది ఇలా... ప్రజాపాదయాత్ర గురువారం ఉదయం 9గంటలకు మార్కాపురం శివారులోని డ్రైవర్స్ కాలనీ నుంచి ప్రారంభమైంది. ఎస్టేట్, సుందరయ్య కాలనీ, రాయవరం మీదుగా తర్లుపాడు మండలంలోని గానుగపెంటకు చేరింది. భోజన విరామం అనంతరం పోతలపాడు మీదుగా సాయంత్రం 6 గంలకు గజ్జలకొండలో ముగిసింది. తొమ్మిదో రోజు మొత్తం 14.8 కి.మీ మేర యాత్ర సాగింది. -
'స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణం'
హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల పేరుతో కూలీలను చంపడం దారుణమని వైఎస్ఆర్ సీపీ ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ స్మగ్లర్లకు శిక్ష వేస్తే తప్పు లేదు, కానీ పేద కూలీలను చంపడం మానవహక్కుల ఉల్లంఘనే అన్నారు. శేషాచలం ఎన్కౌంటర్ పై సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈనెల 16 వ తేదీన వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తున్నట్టు ఆయన తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద రైతులతో మాట్లాడి, ప్రాజెక్టు పూర్తైయితే వచ్చే ప్రయోజనాలపై రైతులకు వివరణ ఇస్తామన్నారు. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభమై పెండింగ్ ఉన్న ప్రాజెక్టులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బాబు సొంత మనుషుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు అని ఎద్దేవా చేశారు. పట్టిసీమకయ్యే ఖర్చుతో వెలిగొండ, గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చన్నారు.