వైవీకి మేకపిల్లను అందించి సమస్యలు వివరిస్తున్న గానుగపెంట వాసి
‘‘పశ్చిమ ప్రకాశంలోని ప్రతి గ్రామంలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది. నా వంతు బాధ్యతగా అధికారులతో మాట్లాడి ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయిస్తున్నా.ఎంపీ ల్యాండ్ నుంచి అధిక నిధులు తాగునీటి సమస్య పరిష్కారానికే కేటాయించా. టీడీపీ సర్కారు ప్రకాశం జిల్లాపై కక్ష కట్టింది. అయినా అధైర్య పడకండి.కొంతకాలం ఓపిక పట్టండి. మంచి రోజులొస్తాయ్. కష్టాలన్నీ తీరి, ప్రజలంతా సంతోషంగా ఉండే రోజులు ముందున్నాయి. త్వరలోనే మనందరి ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి రాగానే మీ నమ్మకాన్నినిలబెట్టుకుంటాం.’’ అని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్‌తో వైవీ నిర్వహిస్తున్న ప్రజా పాదయాత్ర తొమ్మిదో రోజు గురువారం మార్కాపురం నియోజకర్గంలో సాగింది.
ప్రకాశం, మార్కాపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పశ్చిమ ప్రకాశంపై నిర్లక్ష్యం వహించడం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేపట్టిన పాదయాత్రకు లభిస్తున్న మద్దతును, అభిమానాన్ని తాను ఎన్నటికి మరచిపోనన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అప్పుడే మీ కష్టాలన్ని పోయి వర్షాలు పడి ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పారు. పశ్చిమ ప్రకాశంలో కరువును శాశ్వతంగా నివారించేందుకు అధికారంలోకి రాగానే వెలిగొండప్రాజెక్టుపై దృష్టి పెడతామని, నీళ్లిచ్చి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా పాదయాత్రలో భాగంగా తొమ్మిదోరోజు గురువారం వైవీ మార్కాపురం, తర్లుపాడు మండలాల్లో పర్యటించారు.
పాదయాత్రకు సంఘీభావం..
ప్రజా పాదయాత్రకు సంఘీభావంగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షుడు మోపిదేవి వెంకట రమణ, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు సుబ్బారెడ్డి వెంట నడిచారు. మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, జెడ్పీటీసీ రంగారెడ్డి, ఎంపీపీ మాలకొండయ్య, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, పట్టణ అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి గాయం లక్ష్మిరెడ్డి, సహాయ కార్యదర్శి బట్టగిరి తిరుపతిరెడ్డి, తుమ్మా వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి(దేవుడు), కొనకనమిట్ల మాజీ సర్పంచ్ అంజిరెడ్డి తదితరులు వైవీ వెంట నడిచారు.
అంతకు ముందు కేపీ కొండారెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్ గజమాలతో సన్మానించారు. బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెంటచింతల మధు, డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ, ముర్తుజావలి, పలువురు పార్టీ నాయకులతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పాదయాత్ర సాగింది ఇలా...
ప్రజాపాదయాత్ర గురువారం ఉదయం 9గంటలకు మార్కాపురం శివారులోని డ్రైవర్స్ కాలనీ నుంచి ప్రారంభమైంది. ఎస్టేట్, సుందరయ్య కాలనీ, రాయవరం మీదుగా తర్లుపాడు మండలంలోని గానుగపెంటకు చేరింది. భోజన విరామం అనంతరం పోతలపాడు మీదుగా సాయంత్రం 6 గంలకు గజ్జలకొండలో ముగిసింది. తొమ్మిదో రోజు మొత్తం 14.8 కి.మీ మేర యాత్ర సాగింది.
Comments
Please login to add a commentAdd a comment