ఊపిరి ఉన్నంత వరకు పోరు ఆగదు | YV Subba Reddy Padayatra For Veligonda Project Compleat Prakasam | Sakshi
Sakshi News home page

ఊపిరి ఉన్నంత వరకు పోరు ఆగదు

Published Fri, Aug 17 2018 12:59 PM | Last Updated on Fri, Aug 17 2018 12:59 PM

YV Subba Reddy Padayatra For Veligonda Project Compleat Prakasam - Sakshi

కార్యదక్షుడికి హారతులిస్తున్న మహిళలు

ప్రకాశం, కనిగిరి: ఊపిరి ఉన్నంత వరకు వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాటం సాగిస్తానని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయక పోతే.. మనందరి ప్రభుత్వం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏడాది కాలంలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకుంటారని భరోసా ఇచ్చారు. వెలిగొండ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సుబ్బారెడ్డి చేపట్టిన ప్రజా పాదయాత్ర రెండో రోజు గురువారం కనిగిరి నియోజకవర్గంలోని హెచ్‌ఎంపాడు మండలం, మార్కాపురం నియోజవర్గంలోని కొనకనమిట్ల మండలాల్లో రెట్టించిన ఉత్సాహంతో సాగింది.  హెచ్‌ఎంపాడులో ఎంపీపీ గాయం బలరాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లోని ప్రజలకు సురక్షిత తాగు నీరు, సాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజక్టును ప్రారంభించి.. 70 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ మరణం తర్వాత ప్రాజెక్టు పనులు కుంటుపడ్డాయన్నారు. చంద్రబాబు శిలాఫలకాలు వేయడం తప్ప పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. 2014లో ఎన్నికల్లోఏడాదిలో వెలిగొండను పూర్తి చేస్తానని హామీలిచ్చిన చంద్రబాబు నాలుగున్నరేళ్లయినా పనులు అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. చంద్రబాబు హామీలన్నీ ఓట్ల కోసమేనని, ప్రజల కోసం.. ఆచరణ కోసం కాదని అందుకు ఆయన చరిత్రే నిదర్శనమని విమర్శించారు. జిల్లాలో ప్రధానంగా కనిగిరి నియోజకవర్గంలో కరువు విలయతాండవం చేస్తోందని.. వెయ్యి అడుగులు వేసి నీళ్లు పడే పరిస్థితి లేదన్నారు. కలుషిత నీళ్లుతాగి కనిగిరి, కొండపి నియోజకవర్గాల్లో సుమారు 600 మంది ఫ్లోరైడ్, కిడ్నీ వ్యాధులతో ప్రజల ప్రాణాలు పోగట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రాణాలు పోతున్నాసర్కారుకు చలనం లేదు..
ప్రజల ప్రాణాలు పోతున్నా.. ఈ ప్రభుత్వంలో చలనం లేదని వైవీ మండిపడ్డారు. ప్రాణాలు నిలవాలంటే వెలిగొండ నీరే శరణ్యమన్నారు. హాజీపురం, నందనవనం, రాళ్లపల్లి చెరువులకు నీరు రావాలన్నా... ప్రతి ఎకరాకు సాగు నీరు, సురక్షిత తాగు కావాలన్నా వెలిగొండ పూర్తి కావాలన్నారు. అందుకే ఈ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కళ్లు తెరపించేందుకే ప్రజా పాదయాత్ర చేపట్టినట్లు వైవీ చెప్పారు. 

జగన్‌ అధికారంలో రాగానేధరల స్థికరణ పథకం
కంది, శనగ, జామాయిల్, సుబాబుల్‌ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, చేతి కొచ్చిన అరకొర పంటకు గిట్టుబాటు ధరల్లేక  రైతులు అల్లాడుతున్నారని సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని  ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో రాగానే నవరత్నాల్లో భాగంగా రైతులకు ధరస్థిరీకరణ పథకాన్ని చేపడతామని భరోసా ఇచ్చారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకుంటారని వెల్లడించారు. వెనుకబడిన కనిగిరి ప్రాంత అభివృద్ధికి ఉపయోగ పడే నిమ్జ్, నడికుడి కాళహాస్తి రైలు మార్గం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కనీస ప్రారంభానికి నోచుకోలేదన్నారు. 2018 కల్లా రైలు మార్గం చేపట్టి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నా ఎన్‌డీఏ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. సుమారు 4 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే నిమ్జ్‌ను పథకానికి కనీసం ల్యాండ్‌ ఎక్వీజేషన్‌ కూడా చేయలేదని తీవ్రంగా దుయ్యబట్టారు. కనిగిరి ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడే.. నిమ్జ్, నడికుడి కళాహస్తీ.. రైలుమార్గంను వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ హామీ ఇచ్చారు.

ఆయా కార్యక్రమాల్లో వైవీ వెంట మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌ యాదవ్, జెడ్పీటీసీ పల్లాల నారపరెడ్డి, ఎంపీపీ గాయం బలరాంరెడ్డి, పారిశ్రామిక వేత్త చింతల చెర్వుసత్యన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

వర్షంలోనూ దారి వెంట పూల జల్లు
పాదయాత్ర ప్రారంభమైన కొద్ది నిమిషాలకే చిరుజల్లుల వర్షం ప్రారంభమైంది. హెచ్‌ఎంపాడులో జరిగిన సభలో వర్షంలో నిలబడే జనం వైవీ ప్రసంగాన్ని విన్నారు. హజీపురం అడ్డరోడ్డు వద్ద నుంచి లింగారెడ్డిపల్లి చివరి వరకు సాగిన పాద యాత్రలో ప్రజలు ప్రతి గ్రామంలో ఎదురొచ్చి హారతులిచ్చారు. పూల దండలు వేసి, పూర్ణ కుంభాలతో స్వాగతం పలికారు. సీతారాంపురానికి చెందిన వృద్ధులు, మహిళలు యాత్రకు మద్దతుగా అడుగు కలిపారు.

సమస్యలు వింటూ..ముందుకు సాగుతూ..
తమ ప్రాంతానికి కాలినడకన వస్తున్న సుబ్బారెడ్డికి ప్రతి గ్రామం వద్ద, కాలనీల వద్ద ప్రజలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నమించారు. పింఛన్లు, పక్కాగృహాలు, ఇంటి స్థలాలు, నీటి సమస్య తదితర అంశాలను ప్రజలు వైవీ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన వారందరికి న్యాయం చేస్తానని వైవీ వారికి భరోసా ఇచ్చారు.

20 కుటుంబాలు పార్టీలో చేరిక..
పాదయాత్రలో భాగంగా హనుమంతునిపాడు మండలం కోటతిప్పల గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో కొండంరాజు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సుబ్బారెడ్డి వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వెలుగొండ ప్రాజెక్టు సాధన పాదయాత్ర విజయవంతం కావాలని మహిళలు రామాలయంలో కొబ్బరి కాయలు కొట్టి పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి పాదయత్ర మండలంలోని లింగారెడ్డిపల్లి వరకు సాగింది.

రెండో రోజు యాత్ర సాగిందిలా..
కనిగిరి : గురువారం హెచ్‌ఎంపాడు మండలం హాజీపురం క్రాస్‌ రోడ్డు నుంచి ఉదయం 9.42 నిమిషాలకు ప్రారంభించారు. పాదయాత్ర హెచ్‌ఎంపాడుకు చేరుకున్న తర్వాత అక్కడ జరిగిన బహిరంగ సభలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతలు మాట్లాడారు. అనంతరం పాదయాత్ర కొండారెడ్డిపల్లి మీదుగా కోటతిప్పలకు మధ్యాహ్నం 1గంటకు చేరుకుంది. అక్కడ భోజన విరామం తర్వాత 3.10కు తిరిగి బయలుదేరి రషీద్‌పురం, దాసరపల్లి, లింగారెడ్డి మీదుగా సాగిన యాత్ర  మార్కాపురం నియోజకవర్గం కేకే మిట్ల మండలంలోని నాయుడు పాలెంలోకి సాయంత్రం 5.30గంటలకు యాత్ర ప్రవేశించింది. రెండోరోజు హెచ్‌ఎంపాడు మండలంలో సుమారు 13 కిమీటర్లు మేర పాదయాత్ర సాగింది.

నాయుడుపేటలో ఘన స్వాగతం
కొనకనమిట్ల: పాదయాత్రగా వస్తున్న వైవీ సుబ్బారెడ్డికి కొనకనమిట్ల మండలం నాయుడుపేటలోఘన స్వాగతం లభించింది. సాయంత్రం 4.30గంటలకు మార్కాపురం నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించగానే స్థానిక ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసులరెడ్డి, పార్టీ నాయకులు వెన్నా హనుమారెడ్డి గజమాలలతో సుబ్బారెడ్డికి ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు   హారతులిచ్చారు. నాయుడుపేట నుంచి మొదలైన పాదయాత్ర నాయుడుపేట ఎస్సీ కాలనీ మీదుగా గొట్లగట్టు చేరింది.  బస్టాండ్‌ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహించా రు. మార్కాపురం నియోజకవర్గంలో మూడు కిలోమీటర్ల మేర సాగిన  యాత్ర సాయంత్రం 6.30 గంటలకు ముగిసింది. వైవీకి స్వాగతం పలికిన వారిలో సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి, ఎంపీపీలు ఉడుముల రామనారాయణరెడ్డి, కే.నరసింహారావు, జడ్పీటీసీలు మెట్టు వెంకటరెడ్డి, సాయి రాజేశ్వరరావు, ఎం.రంగారెడ్డి, బాషాపతిరెడ్డి, పార్టీ కన్వీనర్లు రాచమల్లు వెంకటరామిరెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, వాకా వెంకటరెడ్డి ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement