దొనకొండ మండలం రుద్రసముద్రం సమీపంలో బొగ్గుల బట్టీలను పరిశీలించి, కార్మికుల కష్టాలు తెలుసుకుంటున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఆరుగాలం శ్రమించి, ఎన్నో కష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు. పొలాలు కౌలుకు తీసుకుని పడరాని పాట్లు పడుతున్నాం. మార్కెట్‌లో వస్తువుల రేటు చూస్తే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నామయ్యా.. అంటూ పలువురు రైతులు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం ఆయన చేపట్టిన ప్రజా పాదయాత్ర 11వ రోజు శనివారం దొనకొండ మండలంలో సాగింది.రుద్రసముద్రం గ్రామానికి కాలినడకన వస్తున్న సుబ్బారెడ్డికి మార్గం మధ్యలో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలు, బొగ్గుబట్టీల్లో పని చేస్తున్నకార్మికులు తమ కష్టాలను విన్నవించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని, దుర్భిక్ష పరిస్థితులను దూరం చేసి, కరువు నేలల్లో సిరులు పండిద్దామంటూ వైవీ వారికి భరోసా ఇచ్చారు.
దొనకొండ (తాళ్లూరు): వర్షాభావ పరిస్థితులతో ప్రకాశం ప్రజలు అల్లాడి పోతున్నారని, వారి సంక్షేమం చూడాల్సిన చంద్రబాబు అబద్ధాలతో కాలయాపన చేస్తున్నారని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రజా పాదయాత్రలో భాగంగా శనివారం దొనకొండ మండల పర్యటనలో వైవీ మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజక్టు పూర్తి చేయించడం ద్వారా తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకే తాను ప్రజా పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేసుకుని వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకుందామన్నారు. అప్పడు ఇదే భూమిలో సిరులు పండించుకోవచ్చని భరోసా ఇచ్చారు. వెలుగొండ సాధించే వరకు తాను విశ్రమించబోనన్నారు. దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంను చేసుకుని నవరత్నాల అమలుతో రాజన్న రాజ్యాన్ని స్థాపించుకుందామన్నారు. యాత్రలో భాగంగా వైవీ రుద్రసముద్రం గ్రామం వద్ద బొగ్గు బట్టీల్లో పని చేస్తున్న కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు. మిర్చి నాటుతున్న కూలీలతో మమేకమయ్యారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధరలు లేవని ఎంపీ వద్ద వాపోయారు. ప్రస్తుతం మిరప నారు అధిక రేట్లు పలుకుతున్నామని భూమనపల్లికి చెందిన పాలపర్తి మల్లయ్య తెలిపారు. నాగలి దున్నుతున్న రైతుతో మాట్లాడారు. కొద్దిసేపు నాగలి పట్టి అరక దున్నారు. తమ గ్రామానికి వస్తున్న వైవీకి రుద్రసముద్రం గ్రామస్తులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
బొగ్గుల కార్మికులకు పరామర్శ ...
రుద్రసముద్రం మార్గంలో బొగ్గుల బట్టీలను వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. బొగ్గుల తయారు చేస్తున్న కార్మికులను పరామర్శించారు. బట్టీల వద్దే నివసిస్తున్న ఏడు కుటుంబాల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. పిల్లలను పనిలో పెట్టకుండా చక్కగా ఉన్నత చదువులు చదివించాలని వారికి సూచించారు. అవసరమైతే చదువులకు తాము చేయూత ఇస్తామని హామీ ఇచ్చారు.
పాదయాత్రలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయ కర్త బుర్రా మధుసూధన్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి పి.శ్యాం ప్రసాద్‌రెడ్డి, రిటైర్డు మధ్యప్రదేశ్ అడిషినల్ డీజీపీ, గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గానికి చెందిన కూచిపూడి బాబూరావు, చుండూరు మాజీ జెడ్పీటీసీ కొండా శివప్రసాద్‌రెడ్డి, దొనకొండ, దర్శి, కురిచేడు, తాళ్లూరు మండల కన్వీనర్‌లు కాకర్ల క్రిష్ణారెడ్డి, వెన్నపూస వెంకటరెడ్డి, బి.వెంకయ్య, వేణుగోపాలరెడ్డి, జెడ్పీటీసీ వెంకటరెడ్డి, తదితరులు వైవీని కలసి సంఘీభావం తెలిపారు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా ప్రభాకర్ వైవీ ప్రజా పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. విలువలతో కూడిన జగన్‌మోహన్‌రెడ్డి వెంటే కాపులు ఉంటారన్నారు. నాలుగేళ్ల తర్వాత చంద్రబాబుకు కాపులు గుర్తొచ్చారని, ఎన్నికల సమయంలో కాపులు, వడ్డెలు, రజకులు, ఎస్టీల్లో చేరుస్తామని చెప్పి బాబు మోసం చేశారని కోలా పేర్కొన్నారు.
వైవీకి వినతుల ల్లువ
♦ తన బిడ్డకు యాక్సిడెంలో కాలు పూర్తిగా దెబ్బతిన్నదని, తండ్రిలేని బిడ్డను ఆదుకోమంటూ గంగదేవిపల్లెకు చెందిన భూ లక్ష్మమ్మ ఎంపీ వైవీని వేడుకున్నారు.
♦ కరువు వల్ల జీవాలకు మేత, నీరు కరువయ్యాయని, గొర్రెలకు బీమా కల్పించాలనే విషయాన్ని కూడా తమకు ఎవరూ చెప్పడం లేదని బ్రహ్మారావుపేటకు చెందిన గొర్రెల కాపరి కన్నేబోయిన హనుమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో వైవీని కలిసి గొర్రె పిల్లను బహూకరించారు.
కందిలో తీవ్ర నష్టాలు
కంది సాగు చేసి నిరుడు తీవ్రంగా నష్టపోయామని, ఐదెకరాల్లో కంది పంట వేస్తే రూ.20 వేలకు పైగా అప్పే మిగిలిందని రుద్రసముద్రం రైతు యర్ర నాగయ్య వాపోయాడు. నష్ట పరిహారం కూడ అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నాగయ్య పొలంలో వైవీ కొద్దిసేపు నాగలి పట్టి సేద్యం చేశారు.
కష్టాలు తీరాలంటే ప్రాజెక్టు రావాలి..
మిరప సాగు చేస్తున్న తమకు బోర్లలో నీరు తగ్గుముఖం పట్టడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు కఠారి ఈశ్వరయ్య, సావిత్రి, వల్లెం రమణమ్మ, కొండ్రు అల్లూరమ్మ, వల్లె మల్లేశ్వరిలు చెప్పారు. నీటి కష్టాలు తీరాలంటే ప్రాజెక్టు రావాలయ్యా అని వైవీకి విన్నవించారు.
ధోబీ ఘాట్‌ఏర్పాటుకు వినతి..
రుద్ర సముద్రం రజక కాలనీలో రజకులు ఎంపీ వైవీని కలసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వాగులలో నీరు లేక పోవటంతో బట్టలు ఉతకటం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. దోభీ ఘాట్‌లను, బోర్లను ఏర్పాటు చేస్తే తమకు బతుకుదెరువు ఉంటుందన్నారు. రజకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ మ్యానిఫెస్టోలో ఆ అంశం ఉందని వైవీ చెప్పారు.
పాద యాత్ర సాగిందిలా...
ప్రజా పాదయాత్ర శనివారం దొనకొండలో ఉదయం 9.43 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటలకు రుద్ర సముద్రం సమీపానికి చేరుకొని భోజన విరామం తీసుకున్నారు. అనంతరం తిరిగి 3.10గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. పుల్లాయపల్లి మీదుగా కట్టకిందిపాలెం వరకు సాగి సాయంత్రం 5.43 గంటలకు ముగిసింది. 11వ రోజు 15 కి.మీలు యాత్ర సాగింది.
నేటి షెడ్యూల్..
ఆదివారం ఉదయం 9.00 గంటలకు ప్రజా పాదయాత్ర దొనకొండ మండలం కట్టకిందిపాలెం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి యర్రగొండపాలెం నియోజక వర్గంలోకి ప్రవేశిస్తుంది. పెద్దారవీడు మండలం కంభంపాడు క్రాస్‌రోడ్డు దాటుకొని తోకపల్లి ఎస్‌సీ కాలనీ, తోకపల్లి, రాజంపల్లి, చుట్టమిట్ల క్రాస్ వరకు సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment