సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ఒంగోలు, కొమరోలు: వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రంలో సువర్ణ పాలన అందుతుందని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ఆంజనేయస్వామి ఆలయ సెంటర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. నవరత్నాలు పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు అవసరమైన సంక్షేమ పథకాలను అందించి వారి అభివృద్ధికి తోడ్పాటు నందించేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిది పథకాలను రూపొందించారన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఏటా రూ.12,500 పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. దీని ద్వారా రైతులు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండానే వ్యవసాయం చేయవచ్చన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ఇద్దరు పిల్లలను పాఠశాలకు పంపిస్తే ఏడాదికి ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తామని, ఇలా నవరత్నాలు పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక నిధి సమకూరుస్తామన్నారు. 600 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కొత్త పథకాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోపిడీయే లక్ష్యంగా పాలన సాగించిందన్నారు.
బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందాల్సి సంక్షేమ పథకాలు అందడం లేదని, కేవలం పచ్చ చొక్కా వేసుకున్న వారికే పథకాలు అందుతున్నాయన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పసుపు–కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నారన్నారు. అవ్వతాతలకిచ్చే పింఛన్ రూ.2వేలు ఇస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన తర్వాతే చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని పెంచారన్నారు. నాలుగున్నర సంవత్సరాల పాటు రైతులను పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు రెండు, మూడు నెలలు ఉన్నాయన్న ఉద్దేశంతో రైతు సుఖీభవ అంటూ రూ.వెయ్యి ఇచ్చారన్నారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ రాబందుల్లా దోచుకుంటున్న ప్రభుత్వం నుంచి ప్రజలను కాపాడేందుకు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేశారన్నారు.
వెలిగొండపై అంతులేని నిర్లక్ష్యం..
పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగు నీరందించేందుకు ఏర్పాటు చేసిన వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించి 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికే ప్రాజెక్టును పూర్తి చేసి నీరిస్తామని చెప్పి ఐదేళ్లు గడుస్తున్నా నేటికి పూర్తి చేయలేదన్నారు. ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగి ప్రాణాలు కోల్పోతున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసి ప్రజలకు తాగు, సాగు నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్ బాగుండాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగ్నునరేళ్లుగా పోరాటం చేసింది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమేన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు సైతం పదవులకు రాజీనామా చేశారన్నారు. తీరా ఎన్నికలు దగ్గరకొచ్చాక ప్రత్యేక హోదా ఇవ్వలేదని ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారని టీడీపీపై మండిపడ్డారు.
ఇలాంటి మాయలమారి చంద్రబాబు పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నారు. కొమరోలులో వైఎస్సార్‌సీపీ నాయకులు కామూరి రమణారెడ్డి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన రాజన్న భోజనశాలను, గుండ్రెడ్డిపల్లె, బ్రాహ్మణపల్లె, రెడ్డిచర్ల, బొడ్డువానిపల్లె, బాదినేనిపల్లె, తాటిచర్ల మోటు తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్న కామూరి రమణారెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా రాజన్న భోజనశాల, పలు గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు కామూరి రమణారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీలు కామూరి అమూల్య, కడప వంశీధరరెడ్డి, నన్నెబోయిన రవికుమార్‌యాదవ్, కొత్తపల్లి జ్యోతి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు బోయిళ్ల జనార్దన్‌రెడ్డి, లాయర్ శ్రీనివాసరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, నాయకులు తాటిశెట్టి రామ్మోహన్, ఆర్‌డీ రామక్రిష్ణ, అక్కి పుల్లారెడ్డి, బొర్రా క్రిష్ణారెడ్డి, చెదుళ్ల రమణారెడ్డి, కొత్తపల్లి శ్రీను, వెదురు శ్రీనివాసరెడ్డి, బాదం గోపాల్, సీఆర్‌ఐ మురళి, ముద్దర్ల శ్రీను, పగడాల వెంకటేశ్వర్లు, సంగు రంగస్వామిరెడ్డి, మేకల బయన్నయాదవ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment