CM YS Jagan: పోర్టులతో విస్తృత ఉపాధి | AP CM YS Jagan Lays Foundation of Ramayapatnam Port | Sakshi
Sakshi News home page

CM YS Jagan: పోర్టులతో విస్తృత ఉపాధి

Published Thu, Jul 21 2022 3:46 AM | Last Updated on Thu, Jul 21 2022 9:29 AM

AP CM YS Jagan Lays Foundation of Ramayapatnam Port - Sakshi

రామాయపట్నం పోర్టుకు భూమి పూజ సందర్భంగా సముద్రుడికి పూలు సమర్పిస్తున్న సీఎం జగన్‌ 

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం వల్ల ఆయా ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని, లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తొలి దశ నిర్మాణ పనులకు బుధవారం ఆయన భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాసితులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. అటు వైపు చెన్నై, ఇటు వైపు విశాఖపట్నం, మరో వైపు ముంబై, కోల్‌కతా.. ఇలా ఏ నగరమైనా పెద్ద నగరంగా, మహా నగరంగా ఎదిగిందంటే.. అక్కడ పోర్టు ఉండడమే కారణం అని అన్నారు. దీన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించాలని, పోర్టు రావడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని.. తద్వారా ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్నారు. జల రవాణా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎగుమతి, దిగుమతులు వేగవంతం అవుతాయని చెప్పారు. తద్వారా రాష్ట్రానికి పలు విధాలా మేలు జరగడమే కాకుండా.. ఆయా ప్రాంతాల రూపురేఖలు మారతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ వచ్చినా, అందులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. దీని ఆధారంగా పోర్టులు కానీ, దీనికి అనుసంధానంగా వచ్చిన పరిశ్రమలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే అన్ని పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటుంది. తద్వారా ఈ ప్రాంతం వారికి మేలు జరగడంతో పాటు రాష్ట్రానికి కూడా ఊతం వస్తుంది. 

రాష్ట్రంలో కృష్ణపట్నం, కాకినాడలో 3, విశాఖపట్నం, గంగవరం ప్రాంతాల్లో పోర్టులు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం పోర్టు 70 మిలియన్‌ టన్నుల సామర్థ్యం కలిగి ఉంటే, మిగిలిన పోర్టుల కెపాసిటీ 158 మిలియన్‌ టన్నులు.


రామాయపట్నం పోర్టు నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి 

కొత్తగా 4 పోర్టులు.. 9 ఫిషింగ్‌ హార్బర్లు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు కేవలం 6 పోర్టులుంటే.. మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నాం. అంటే ఈ ఐదేళ్లలో మరో 4 పోర్టులు.. భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం రానున్నాయి. వీటి ద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల కెపాసిటీ వస్తుంది. 

ఈ నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు.. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్ప, మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నం, జువ్వలదిన్నె నిర్మాణం జరుగుతోంది.  పోర్టులకు సంబధించిన నిర్మాణ పనులు ఈ రోజు నుంచి వేగవంతం అవుతున్నాయి. మరో రెండు నెలల తిరక్కమునుపే మిగిలిన పోర్టులకు కూడా భూమి పూజ చేసి పనులు వేగవంతం చేస్తాం. 

లక్ష మంది గంగపుత్రులకు ఉపాధి
రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఫిషింగ్‌ హార్బర్‌ కానీ, పోర్టు కానీ కనిపించేలా రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. 9 ఫిషింగ్‌ హార్బర్లు పూర్తయితే.. వీటి ద్వారా లక్ష మంది మత్స్యకార కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గుజరాత్‌ వంటి ప్రాంతాలకో, మరెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. 

కాకినాడ, మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల్లో నేరుగా ఒక్కో దాంట్లో కనీసం 3 – 4 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. పరోక్షంగా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలతో పాటు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలకు నాంది పలుకుతున్నాం.

నాడు అంతా మోసం..
2019 ఏప్రిల్‌లో ఎన్నికలకు ముందు.. ఫిబ్రవరిలో అప్పటి పాలకుడు చంద్రబాబు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేశారు. డీపీఆర్, భూసేకరణ లేకుండా ప్రజలను మోసం చేయాడానికి ఆ రోజు టెంకాయ కొట్టిపోయారు. ఐదేళ్ల పాటు ఏమీ చేయకుండా, ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్థాపన అంటే ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమే. ఇంతకన్నా అన్యాయం, మోసం ఎక్కడైనా ఉంటుందా? 
రుణ మాఫీ అంటూ రైతులు,  అక్కచెల్లెమ్మలను.. ఉద్యోగాలంటూ చదువుకుంటున్న పిల్లలనూ మోసం చేశారు. ఏకంగా ప్రాంతాలను కూడా మోసం చేశారు. 

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌ 

రూ.3,743 కోట్లతో రామాయపట్నం 
రామాయపట్నం పోర్టు కోసం 850 ఎకరాల భూమి సేకరించి, రూ.3,743 కోట్లతో పనులకు ఇవాళ భూమి పూజ చేస్తున్నాం. ఈ పోర్టు ద్వారా 4 బెర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మరో 6 బెర్తుల నిర్మాణానికి ఇదే ఇన్‌ఫ్రాస్చ్రక్టర్‌ సరిపోతుంది. ఒక్కోదానికి రూ.200 కోట్ల పెట్టుబడి పెడితే మిగిలిన ఆరు బెర్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. 
ఇప్పుడు నిర్మిస్తున్న 4 బెర్తుల ద్వారా 25 మిలియ¯న్‌ టన్నుల కార్గో రవాణా చేసే సామర్థ్యం లభిస్తుంది. మరో రూ.1200 కోట్లు పెట్టుబడి పెడితే.. ఏకంగా 50 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేయవచ్చు.

మన పిల్లలకు మంచి రోజులు
ఈ ప్రాంతంలో పోర్టు రావడానికి సహకరించిన మొండివానిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం, రావూరు, చేవూరు, సాలిపేట గ్రామస్తులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. ఈ అడుగులు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. మన పిల్లలందరూ ఎక్కడికెక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెదుక్కునే అవకాశం లేకుండా.. మన గ్రామాల నుంచే హోం టు వర్క్‌ రీతిలో పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక కారిడార్‌ కూడా వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుందని కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చే అవకాశాలు పెరుగుతాయని అన్నారు. పక్కనే ఉన్న కావలి నియోజకవర్గంలో రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నెలకొల్పాలని అడిగారు. అది మంచి ఆలోచనే. రాబోయే రోజుల్లో ఇందుకు సంబంధించి అడుగులు ముందుకు వేస్తాం. 

రామాయపట్నం పోర్టు భూమిపూజ సందర్భంగా ముఖ్యమంత్రి బహిరంగసభకు హాజరైన నిర్వాసితులు, మత్స్యకారులు, ప్రజలు 

మంచి పోర్టు వచ్చి ఇక్కడ పరిస్థితులు మారుతున్నప్పుడు.. కందుకూరు పట్టణం పెద్ద హబ్‌గా తయారవుతుంది. అందువల్ల బైపాస్‌ రోడ్డు కోసం 6.2 కిలోమీటర్ల మేర భూసేకరణ చేయాలని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కోరారు. భూసేకరణ కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. కందుకూరు మున్సిపాల్టీ అభివృద్ధి కోసం కూడా సహకరిస్తాం. 

రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణకు సంబంధించి 8,500 ఎకరాలకు నీళ్లందించే పనుల కోసం మరో రూ.27 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఉలవపాడు మండలంలోని కారేడులో పీహెచ్‌సీకి శాశ్వత భవనం మంజూరు చేస్తున్నాం. 

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బీదా మస్తాన్‌రావు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మానుగుంట మహీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి, డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ యాదవ్, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి, మధుసూదన్‌ యాదవ్, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, బల్లి కళ్యాణ్‌ చక్రవర్తి, జెడ్పీ చైర్‌పర్సన్లు బూచేపల్లి వెంకాయమ్మ, ఆనం అరుణమ్మ, జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్, డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, రామాయపట్నం పోర్టు అథారిటీ ఎండీ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ రోజు చరిత్రాత్మకం
ఈ రోజు ఒక చరిత్రాత్మక రోజు. 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని వినియోగించుకుని రాష్ట్రానికి ఆర్థిక పురోగతి తీసుకురావాలని, మారిటైమ్‌ బోర్డు ద్వారా రూ.15 వేల కోట్లు ఖర్చు పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. ఇదివరకు ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్రంలో పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు నిర్మిస్తున్నారు. తద్వారా పారిశ్రామిక రంగం మరింత బలోపేతం అయ్యేలా అడుగులు పడుతున్నాయి. అదే చంద్రబాబు హయాంలో హడావుడి తప్ప ఏమీ ఉండదు. నాలుగు ఇటుకలు, ఒక తాపీ మేస్త్రిని తీసుకెళ్లి ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనలు చేశారు. తర్వాత వాటిని మరిచిపోయారు. ఏ ప్రాజెక్టు అయినా సీఎం జగన్‌ అన్ని అనుమతులతో ముందుకు వెళతారు.   
- గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి 

మా కల నెరవేరిందన్నా..
అన్నా.. పోర్టు అనేది మాకందరికీ ఒక కల. ఎప్పటి నుంచో పోర్టు వస్తుందన్నారు కానీ రాలేదు. ఈ రోజు అది సాకారం అవుతోంది. ఇక్కడ 75 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు ఇస్తామన్నందుకు చాలా సంతోషంగా ఉంది. పోర్టుకు మా భూమి ఒక ఎకరా ఇచ్చాం. దానికి రూ.15 లక్షలు ఇచ్చారు. మీకు ఎంతో రుణపడి ఉంటామన్నా. మేమంతా మత్స్యకార కుటుంబాలకు చెందిన వాళ్లం. మమ్మల్ని మీరు ఎన్నో పథకాల ద్వారా అన్ని విధాలా ఆదుకుంటున్నారు. మీరు పది కాలాల పాటు సీఎంగా ఉండాలి.
- సుజాత, మెండివారిపాలెం 

ఈ ప్రాంతంలో పెద్ద పండుగ  
ఈ రోజు ఈ ప్రాంతానికి పెద్ద పండుగ. పోర్టు నిర్మాణానికి భూమి పూజ చేసిన మీకు (సీఎం) మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు. మా కష్టం గుర్తించి, మాకు అన్నీ అందేలా చేస్తున్నారు. ఇప్పుడు స్పాట్‌లోనే డీజిల్‌  సబ్సిడీ ఇస్తున్నారు. వేట సమయంలో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేపట్టారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నారు. ఎన్నో పథకాల ద్వారా అందరినీ ఆదుకుంటున్నందుకు మీకు కృతజ్ఞతలు.
- ఆవల జయరామ్, ఉలవపాడు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement