సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలు హాజరయ్యారు. బుధవారం ఉదయం జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇక సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగియడంతో.. ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఏపీకి తిరుగుపయనం అయ్యారు సీఎం జగన్.
గడ్కరీతో చర్చించిన అంశాలు..
► విశాఖ- భోగాపురం బీచ్ కారిడర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరిన్ని మేలైన ఆలోచనలు చేయాలంటూ గత రాష్ట్ర పర్యటనలో గడ్కరీ ఇచ్చిన సలహామేరకు.. అధికారులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారని సీఎం జగన్ వివరించారు.
► విశాఖ నుంచి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతోపాటు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి తగిన సహాయ సహకారాలు అందించాలని మంత్రిని కోరారు.
► విజయవాడ వెస్ట్రన్ బైసాస్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, దీనికి సీఆర్డీయే గ్రిడ్ రోడ్డును అనుసంధానం చేసి పనులు ముందుకుసాగేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు.
► విజయవాడ వెస్ట్రన్ బైపాస్కు సంబంధించి మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌కు భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని, ఈ భూములను కూడా గుర్తించిందని వెంటనే డీపీఆర్ సిద్ధంచేసి పనులు ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు.
► విజయవాడ ఈస్ట్రన్ బైపాస్కు సంబంధించి కూడా డీపీఆర్ సిద్ధంచేసి పనులు వేగవంతంగా చేపట్టేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరారు.
► రాష్ట్రంలో 20 ఆర్వోబీలకు కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఇప్పటికే మంజూరుచేసిందని, మిగిలిన 17 ఆర్వోబీలనూ మంజూరుచేయాలని విజ్ఞప్తిచేశారు.
► రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను, పారిశ్రామిక నోడళ్లను, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1,723 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడ్డ జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
► రాష్ట్రంలో దాదాపు 14 ప్రాంతాల్లో రోప్ వే ల నిర్మాణానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు పంపించింది. ఇప్పటికే 2 చోట్ల నిర్మాణానికి అంగీకరించింది. మిగిలిన ప్రతిపాదనలకూ అనుమతి మంజూరుచేయాలని కేంద్రమంత్రి గడ్కరీని కోరారు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment