AP CM YS Jagan Complete Kuppam Tour Highlights In Telugu - Sakshi
Sakshi News home page

కుప్పంలో సీఎం పర్యటనకు అపూర్వ స్పందన.. అంచనాలకు మించి వచ్చిన జనం

Published Sat, Sep 24 2022 5:03 AM | Last Updated on Sat, Sep 24 2022 10:30 AM

AP CM YS Jagan Mohan Reddy Kuppam Tour Highlights - Sakshi

చంద్రబాబును 33 ఏళ్లుగా గెలిపించినా కూడా ఇక్కడ సొంత ఇల్లు లేదు. ఓటు కూడా లేదు. కుప్పం తన సొంతం అని ఆయన ఏనాడూ భావించ లేదు. హైదరాబాద్‌లో ఇంద్ర భవనం కట్టుకున్న ఆయన అక్కడ లోకల్, కుప్పంకు నాన్‌ లోకల్‌.

నా దృష్టిలో పులివెందుల ఎంతో.. కుప్పం కూడా అంతే. ఈ ప్రాంత ప్రజల కోసం రూ.250 కోట్లతో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తాం. పాలారు ప్రాజెక్టుకు న్యాయ, పర్యావరణ సమస్యలు తొలగ్గానే రూ.120 కోట్లతో ఆ ప్రాజెక్టు నిర్మాణం దిశగా అడుగులు వేస్తాం. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటీ కోసం రూ.66 కోట్లు మంజూరు చేశాం. మిగిలిన నాలుగు మండలాల అభివృద్ధికి రూ.100 కోట్లు అవసరం అని భరత్‌ అడిగాడు. నువ్వు నియోజకవర్గంలో తిరుగు.. ఆ నిధులు ఇస్తానని చెబుతున్నా. – కుప్పం సభలో సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, చిత్తూరు, కుప్పం: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంలో పర్యటించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  అధికారులు, వైఎస్సార్‌సీపీ నేతల అంచనాలకు మించి జనం భారీగా తరలివచ్చారు. కుర్చీల్లో కూర్చున్న వారి కంటే నిలుచున్న వారి సంఖ్య అంతకు మించి ఉండటం విశేషం. ఇక సభా ప్రాంగణం బయట, పట్టణమంతా జనసంద్రమే. బహిరంగ సభలో సీఎం ప్రసంగం ప్రజలను కట్టిపడేసింది. చంద్రబాబు గురించి ప్రస్తావించిన ప్రతిసారీ జనం కేరింతలు కొడుతూ నిజమేనంటూ కోరస్‌ పలికారు.

బాబు మూడు దశాబ్దాల పాలనలో మగ్గిన కుప్పంలో మూడున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిని చూస్తున్నారు కదా.. అనగానే జనం ఒక్కసారిగా కేకలు వేశారు. నాటి ప్రభుత్వానికి.. నేటి మన ప్రభుత్వానికి తేడాను గమనించారా? అనగానే చేతులు ఊపుతూ మద్దతు పలికారు. ‘ఇక్కడి ఎమ్మెల్యే హైదరాబాద్‌కు లోకల్‌.. కుప్పానికి నాన్‌లోకల్‌’ అనగానే నవ్వులు, కేకలు మిన్నంటాయి.

33 ఏళ్లుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనిపించ లేదా అని ప్రశ్నిస్తూ.. అసలు కుప్పంలో ఆ పెద్దమనిషికి ఓటు కూడా లేదని చెప్పడంతో జనం పెద్దపెట్టున కేకలు వేశారు. ప్రధానంగా బీసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా వారికి అవకాశం ఇవ్వలేదన్నప్పుడు కేకలే కేకలు.

ఇలా చంద్రబాబును విమర్శించిన ప్రతిసారీ ప్రజలు కేరింతలు కొట్టారంటే.. బాబు తీరుపై ఎంతగా విసిగిపోయారో ఇట్టే స్పష్టమవుతోంది.  కాగా, అంతకు ముందు సీఎం వైఎస్‌ జగన్‌ కొంత మంది ‘చేయూత’ పథకం లబ్ధిదారులతో ముచ్చటించి, వారితో కలిసి ఫోటో దిగారు. ఆ తర్వాత కుప్పంలో రూ.66 కోట్లతో చేపట్టిన మున్సిపల్‌ ఆఫీసు, ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ భవన నిర్మాణ శిలా ఫలకాలను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, కేవీ ఉషశ్రీ చరణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  

వెన్నుపోటు, దొంగ ఓట్లకు బాబు కేరాఫ్‌..

కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు.. తాను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 33 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉండడానికి కారణమైన కుప్పం నియోజకవర్గంలో ప్రజలు పంపులు తిప్పితే తాగడానికి నీరు వచ్చే పరిస్థితిని మాత్రం తీసుకు రాలేకపోయారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతులను.. ప్రధాన మంత్రులను కూడా తానే నియమించానని చెప్పుకునే ఆయన సొంత నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.

చంద్రబాబు అనుభవం అంతా ప్రతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడానికి మాత్రం బాగా ఉపకరించిందని ఈ జిల్లాలో కథలు కథలుగా చెబుతారని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు, దొంగ ఓట్లకు 30 ఏళ్లుగా కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబే అని చెప్పారు. రాష్ట్రంలో 45–60 ఏళ్ల మధ్య ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించే వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధులను చిత్తూరు జిల్లా కుప్పంలో శుక్రవారం ఆయన విడుదల చేశారు.

కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి 26,39,703 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు నేరుగా జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో తమ బతుకులు బాగు పడ్డాయని లబ్ధిదారులు స్వయంగా చెప్పే ఈ చేయూత పండుగ కార్యక్రమం వారం రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. ఈ వేదికపై నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

కుప్పంపై కూడా బాబుకు వెన్నుపోటు ప్రేమే

  • సొంత మామ మీద చంద్రబాబు చూపించే వెన్నుపోటు ప్రేమే కుప్పం మీద కూడా చూపారు. ఇంతకాలం కుప్పం నుంచి తనకు కావాల్సింది పిండుకున్నాడు. ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం ఆలోచించ లేదు. 14 ఏళ్లు సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువుకు పరిష్కారం చూపలేకపోయారు. 
  • కుప్పంలో కరువు, నీటి సమస్య నివారణకు హంద్రీ–నీవా జలాలను తీసుకురావడం ఒక్కటే పరిష్కారం అని తెలిసినా.. అది చేస్తే ప్రజలు తన మాట వినరని భయపడిపోయారు. అందుకే ఆ హంద్రీ–నీవా పనులకు ఆయనే అవరోధంగా మారారు. ఎన్నికలు వచ్చేసరికి తన పార్టీకి చెందిన వారికి మాత్రం కాంట్రాక్టు ఇచ్చి వందల కొద్దీ ట్రాక్టర్లతో నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేశానని చెప్పుకొని, దొంగ అకౌంట్లతో దోచేశారు. 

కుప్పంతో మొదలు ప్రతి చోటా బీసీలకు అన్యాయమే..

  • కుప్పం నియోజకవర్గంలో అత్యధికులు బీసీలే ఉన్నారు. ఈ నియోజకవర్గం ఓసీలు పోటీ చేయాల్సిన సీటు కాకపోయినా.. బీసీలకు ఇవ్వకుండా అన్యాయం చేస్తూ తనే లాక్కొన్నారు. బీసీలకు న్యాయం చేశానని రెండు రోజుల క్రితం చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగ్‌లు చెప్పాడు.
  • 1983 నుంచి 2019 వరకూ ఈ 36 సంవత్సరాల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా కుప్పం అసెంబ్లీ టికెట్‌ను బీసీలకు ఇవ్వలేదు. ఇది బాబు మార్కు సామాజిక న్యాయం. కుప్పంతో మొదలు పెడితే బీసీలకు ప్రతిచోటా అన్యాయం చేశారు. బీసీలను వాడుకుని, విడిచి పెడుతున్నది ఎవరో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. 

బాబు చేయలేనిది మేం చేస్తున్నాం 

  • కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడో చెప్పడానికి ఏమీ లేదు. ఏం చేయలేదో చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆరు నెలల్లో హంద్రీ–నీవా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ను పూర్తి చేస్తున్నాం. కుప్పంను మున్సిపాలిటీ చేయడంతో పాటు.. దాని అభివృద్ధి కోసం రూ.66 కోట్లు ఇచ్చింది మీ బిడ్డ జగనే. 
  • 55 ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆర్డీఓ కార్యాలయాన్ని ఈ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రూ.6.5 కోట్లతో రెడ్డిపల్లి– రామకుప్పం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఇచ్చాం. కొత్తపేట నుంచి డీకే పల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి పూర్తి చేశాం.  రూ.10 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌ పూర్తి చేశాం. ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. రాళ్లమడుగూరు జూనియర్‌ కాలేజీ పనులు పూర్తి చేసిందీ.. కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయానికి రూ.20 కోట్లు కేటాయించింది కూడా ఈ ప్రభుత్వమే.
  • నవరత్నాల పథకాలన్నీ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా.. కుప్పంలో అంతా నావాళ్లే అని అమలు చేశాం. రాష్ట్రమంతటితో పాటు కుప్పం నియోజకవర్గానికి వివిధ డీబీటీ పథకాల ద్వారా రూ.866 కోట్లు.. నాన్‌ డీబీటీ పథకాల ద్వారా మరో రూ.283 కోట్లు.. మొత్తంగా ఈ నియోజకవర్గ ప్రజలకు  రూ.1,149 కోట్లు పంపిణీ చేసింది మీ బిడ్డ జగనే. 
  • ఎమ్మెల్సీగా ఉంటూనే తన ద్వారా కుప్పానికి నాతో అన్నీ చేయిస్తున్న భరత్‌ను ఈసారి ఎన్నికల్లో గెలిపించండి. మంత్రిగా మీ ముందుకు పంపిస్తాను.  

ఈ ప్రభుత్వానికీ, ఆ ప్రభుత్వానికి తేడా గమనించండి 

  • సమాజాన్ని చంద్రబాబు చూస్తున్న విధానానికీ, మీ ఈ ముఖ్యమంత్రి చూస్తున్న విధానానికీ మధ్య తేడాను ప్రజలు గమనించాలి. అభివృద్ధి అన్నది ప్రతి ఇంట్లో పిల్లల చదువులో, రైతుల్లో, ఆరోగ్య రంగంలో, అక్కచెల్లెమ్మల సాధికారతలో, అవ్వాతాతల సంక్షేమంలో కనిపించాలి. సామాజిక వర్గాల ఆర్తిని ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని అడుగులు వేస్తోంది. బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని గుర్తించిన ప్రభుత్వం ఇది. 
  • నవరత్నాలు అమలు, డీబీటీ, పదవులు, కాంట్రాక్టులు.. ఇలా ఏది తీసుకున్నా పారదర్శకత కనిపిస్తుంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఏకంగా చట్టాలు చేసి మేలు చేశాం. కానీ, చంద్రబాబు మాత్రం తనకు కావాల్సిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడిని చూసుకుంటే చాలనుకున్నారు. ఎవరూ చూపరు, రాయరు.. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరని భావించారు. 
  • చంద్రబాబు చేస్తున్న మోసానికి, అన్యాయానికి ఇక తల వంచేది లేదని కుప్పం ప్రజలు నిర్ణయించుకొని అభివృద్ధికి మద్దతిస్తే ఎలా ఉంటుందో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో చూపించారు. అన్నింటా కూడా వైఎస్సార్‌సీపీనే క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే, కుప్పం ప్రజలు దోచుకో.. పంచుకో.. తినుకో.. డీపీటీకి వ్యతిరేకంగా ఓటు వేశారు.  

చేతకానితనమా.. చేయకూడదనే దుర్బుద్ధా.. 

  • చంద్రబాబు మాత్రం కుప్పం మున్సిపాలిటీలో కనీసం డబుల్‌ రోడ్డు కూడా వేయలేకపోయారు. కృష్ణగిరి నుంచి పలమనేరు హైవేకు లింక్‌ ఇస్తానన్నాడు. అది చేయలేదు. ఎన్నిసార్లు సీఎం అయినా కుప్పంలో రోడ్డు వేసే మనసు లేదు. అయితే ఎన్నికలప్పుడు మాత్రం ఏకంగా కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతానని ప్రజల చెవిలో పువ్వు పెట్టాడు.
  • జాబు కావాలంటే.. బాబు రావాలని ఈయనే అంటాడు. ఈ నియోజకవర్గం నుంచి నిత్యం 5 వేల మంది ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లొస్తుంటారు. వీరికి సొంత నియోజకవర్గంలో ఉద్యోగాలు, ఉపాధి చూపించాలన్న ఆలోచన ఈయనకు రాదు. చంద్రబాబు ఏ రోజూ ఈ నియోజకవర్గంలో ఉండరు. ఇక్కడకు రారు. పట్టించుకోరు. 
  • 14 ఏళ్లు సీఎంగా ఉండేందుకు తనకు కుప్పం సహకరించినా, చివరకు రెవెన్యూ డివిజన్‌ కూడా ఏర్పాటు చేయలేకపోయారు. చివరకు రెవెన్యూ డివిజన్‌ కోసం జగన్‌కు లేఖ రాస్తాడు. మీ కోసం కుప్పంను రెవిన్యూ డివిజన్‌ చేశాం. చంద్రబాబు కంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? చేయకూడదనే నాయకుడు ఎక్కడైనా ఉంటాడా? దీన్ని చేతకానితనం అనాలా? లేక చేయకూడదనే దుర్బుద్ధి అనాలా? కుప్పంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ లేదు.. మెడికల్‌ కాలేజీ లేదు. 

పుట్టింటోళ్లు కూడా ఇలా ఆదుకోలేదు
మూడేళ్ల క్రితం వరకు మా కుటుంబంలో నేను కూలీ పనులే చేసుకునేదాన్ని. చేయూత పథకంలో నాకు మొదటి విడతలో రూ.18,750 ఇచ్చారు. దానికి బ్యాంకు లోన్‌ కలిపి ఒక ఆవును కొనుక్కున్నాను. రెండో విడత వచ్చిన డబ్బులతో గడ్డి కటింగ్‌ మెషిన్‌ తీసుకొన్నాను. మా మహిళా సంఘం గ్రూప్‌ సీ గ్రేడ్‌ నుంచి ఏ గ్రేడ్‌కు వచ్చింది. బ్యాంకు వారు మాకు రూ.20 లక్షలు ఇస్తే నాకు రూ.2 లక్షలు వచ్చాయి. దాంతో మరో నాలుగు ఆవులు కొనుక్కున్నా. స్త్రీనిధి డబ్బులు కూడా వచ్చాయి. మా పాపకు విద్యా దీవెన డబ్బులు వచ్చాయి. తను బీఎస్‌సీ (హార్టికల్చర్‌) చదువుతోంది. ఇవాళ నేను మొత్తం 10 ఆవులతో రోజుకు 110, 120 లీటర్ల పాలు పోస్తున్నాను. ఖర్చులు పోను నెలకు రూ.60 వేలు మిగులుతున్నాయి. ఈ ఘనత మా జగన్‌మోహన్‌రెడ్డిదే. నా పుట్టింటి వాళ్లు కూడా ఇలా సాయం చేయలేదు. మళ్లీ మళ్లీ జగన్‌నే సీఎంగా గెలిపించుకుందాం.
– సుబ్బమ్మ, గుడిపల్లె మండలం, మహాలక్ష్మి గ్రూపు సభ్యురాలు

ఈసారి కూడా జగనే సీఎం..
గతంలో మేం కూలికి వెళ్లే వాళ్లం. మాకు మొదటి విడత చేయూత పథకం కింద ఇచ్చిన డబ్బుతో ఆవును కొనుక్కున్నా. రెండో విడతలో వచ్చిన డబ్బుతో మరో ఆవును కొనుక్కుని నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి అన్న ఉన్నారన్న ధైర్యం మాకు ఉంది. నేను, మా ఆయన.. ఇద్దరం ప్రతి రోజూ మిమ్మల్ని తలుచుకుంటాం. వాళ్ల మేనమామ (సీఎం) వల్ల పిల్లలు కూడా పెద్ద చదువులు చదువుతున్నారు. ఇప్పుడు మూడో విడత వచ్చే డబ్బులతో మరో ఆవును కొనుక్కుంటాను. మీ వల్ల పాలకు కూడా మంచి ధర వస్తోంది. మా మహిళలతో పాటు ప్రతి ఒక్కరూ మీతోనే ఉంటారు. మళ్లీ కూడా మీరే సీఎం.  
– మరియమ్మ, బంగారుపాళ్యం, చిత్తూరు జిల్లా

ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పాలన 
జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఇప్పుడు నేను ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం కే.కోటపాడులో వైఎస్సార్‌ చేయూత పథకం ప్రకటించారు. ఆయన  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే సంతృప్త స్థాయిలో కులం, మతం, రాజకీయాలు చూడకుండా అందరికీ పథకాలు వర్తింప చేస్తూ అండగా నిలుస్తున్నారు. బటన్‌ నొక్కి లక్షలాది మంది మహిళలకు వారి అకౌంట్లలోకి నగదు జమ చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజల కష్టాలన్నీ తీరేలా మంచి పరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా.     
– బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం

టీడీపీ వాళ్లకూ లబ్ధి కలిగించాం
చంద్రబాబూ.. నువ్వు పులివెందులకు వెళ్లొచ్చు కానీ, సీఎం కుప్పం రాకూడదా? మీ మామ దయాదాక్షిణ్యాలతో ఇక్కడ రంగస్వామినాయుడనే పెద్ద మనిషి ఎమ్మెల్యేగా ఉంటే ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించి, సులువుగా గెలవచ్చని ఇక్కడ పాతుకుపోయావు. ఇక్కడి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు అన్యాయం చేశావు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కులం, మతం, పార్టీలు, రాజకీయాలు చూడకుండా టీడీపీ నాయకులకు సైతం సంక్షేమ పథకాలు వర్తింప చేసింది. అందుకే ఈ రోజు కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు మంగళ హారతులతో స్వాగతం పలికారు. తప్పనిసరిగా కుప్పంలో విజయం సాధిస్తాం. ఇన్నేళ్లలో చంద్రబాబు ఏం చేశాడని మీరంతా ఆలోచించాలి.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూగర్భ వనరుల శాఖా మంత్రి

బాబు ఎప్పుడూ అందుబాటులో లేరు
33 ఏళ్లుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉంటూ.. అందులోనూ 14 ఏళ్లు సీఎంగా పని చేసినప్పటికీ.. ఇక్కడి వారికి ఎప్పుడూ అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగా ఇక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు. పైగా సీఎం జగన్‌ కుప్పంకు ఏం చేశారని అడుగుతున్నారు. మీతోనే (చంద్రబాబు) ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని ప్రకటన చేయించారు. ఇది చాలదా.. ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం ఎంతగా కృషి చేస్తున్నారో చెప్పడానికి.  – భరత్, ఎమ్మెల్సీ 

* జనవరి నుంచి పింఛన్‌ రూ.2,750 

కుప్పం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ప్రస్తుతం రూ.2,500 చొప్పున ఇస్తున్న అవ్వాతాతల పింఛన్‌ను వచ్చే జనవరి నుంచి రూ.2,750కి పెంచబోతున్నామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఆ తర్వాత మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రూ.3 వేల వరకు తీసుకుపోతామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కుప్పంలో వైఎస్సార్‌ చేయూత పథకం మూడో విడత నిధుల జమ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ఏడాది అందిస్తున్న రూ.4,949.44 కోట్లతో కలిపి ఈ పథకం కింద ఇప్పటి దాకా  మొత్తం రూ.14,110.62 కోట్ల ఆర్థిక సహాయం అందజేశామని చెప్పారు. మూడు విడతలలో కలిపి ఒక్కొక్కరికీ  ఇప్పటికే రూ.56,250 అందజేశామన్నారు. అత్యంత బాధ్యతాయుతమైన 45–60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలు కుటుంబాన్ని ఒక బాధ్యతతో మోస్తున్నారని.. వాళ్ల చేతిలో డబ్బులు పెడితే ఆ కుటుంబం ఎదుగుతుందని విశ్వసించామన్నారు. 60 ఏళ్లు నిండిన వారు పెన్షన్‌ జాబితాలోకి వెళ్లిపోతారని, కొత్తగా 45 ఏళ్లు నిండిన వారు ఈ పథకంలోకి చేరుతారని చెప్పారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

అమ్మ కడుపులో బిడ్డ మొదలు అవ్వ వరకు..

  • అమ్మ కడుపులోని బిడ్డ మొదలు అవ్వ వరకు అందరికీ ఈ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అక్కచెల్లెమ్మల సాధికారతే లక్ష్యంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందు కేసింది. అమ్మ ఒడి, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, పొదుపు సంఘాల వైఎస్సార్‌ సున్నా వడ్డీ.. ఈ నాలుగు పథకాల ద్వారానే కేవలం 39 నెలల్లో ఈ ప్రభుత్వం రూ.51 వేల కోట్లు ఇచ్చింది.
  • అమ్మ ఒడి ద్వారా 44.5 లక్షల మందికి రూ.19,617 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ ఆసరా ద్వారా 78.74 లక్షల మందికి రెండు విడతల్లో రూ.12,757 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. మూడో దఫా జనవరి నెలలో ఇవ్వనున్నాం.  చేయూత ద్వారా 26.4 లక్షల మందికి రూ.14,111 కోట్లు, సున్నా వడ్డీ పథకం ద్వారా రూ.3,615 కోట్లు ఇచ్చాం. ఇందులో ఎక్కడా లంచాలు, వివక్షకు తావే లేదు. మొత్తంగా ఈ 39 నెలల్లో అన్ని రకాల పథకాల ద్వారా బటన్‌ నొక్కి మహిళలకు అందించిన సొమ్ము రూ.1,17,667 కోట్లు. అన్న దమ్ములకు కూడా ఇచ్చింది కలుపుకుంటే రూ.1.71 లక్షల కోట్లు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలన్నీ అమలు చేస్తున్నాం.
  • ఆరు నాన్‌ డీబీటీ పథకాలైన ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, సంపూర్ణ పోషణ, గోరుముద్ద, విద్యా కానుక, జగనన్న తోడు ద్వారా ఇచ్చిన రూ.1.41 లక్షల కోట్లు  కలుపుకుంటే.. మొత్తం రూ.3,12,764 కోట్లు. ఇందులో అక్కచెల్లెమ్మలకే రూ.2.39 లక్షల కోట్లు నేరుగా లబ్ధి చేకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇళ్లు పూర్తయితే ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తి ఇచ్చినట్టు అవుతుంది. ఇళ్ల ద్వారా అక్క చెల్లెమ్మలకు రూ.2.3 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్టు అవుతుంది. 

చేయూతతో 5.82 లక్షల మందికి ఆర్థిక సాధికారత 

  • వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రభుత్వం అందజేసే డబ్బుతో చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలా? జీవనోపాధికి వాడుకోవాలా? అన్నది పూర్తిగా మహిళల నిర్ణయానికే వదిలేశాం. అయితే, చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సాంకేతిక, బ్యాంకుల పరంగా మార్కెటింగ్‌ పరంగా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. 
  • కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి ఐటీసీ, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబెల్, రిలయన్స్‌ లాంటి కార్పొరేట్‌ కంపెనీలతో టై అప్‌ చేశాం. మార్కెటింగ్‌లో శిక్షణ ఇవ్వడంతోపాటు బ్యాంకులతో రుణాలు అందించేలా చేస్తున్నాం. ప్రతి అక్కా, చెల్లెమ్మ రూ.7 వేల నుంచి రూ.10 వేలు ప్రతినెలా ఆదాయం పొందడానికి మార్గాన్ని చూపిస్తున్నాం. 
  • ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల కొనుగోలుకు సహకరిస్తున్నాం. వీరిని ప్రోత్సహించేందుకు అమూల్‌ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాం. గతంలో కన్నా కనీసం లీటర్‌ పాలకు రూ.5–15 ఎక్కువ రేటుకు అమూల్‌ సంస్థ కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమూల్‌ రంగ ప్రవేశం చేశాక ఇప్పుడు హెరిటేజ్‌ సంస్థ కూడా రేట్లు పెంచక తప్పని పరిస్థితి కూడా వచ్చింది. 
  • వైఎస్సార్‌ ఆసరా, చేయూత ద్వారా అందిన డబ్బుతో 1.10 లక్షల మంది మహిళలు కిరాణా దుకాణాలు పెట్టారు. మరో 60,995 మంది వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. 2.96 లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంచుకుంటూ సంపాదిస్తున్నారు. 1.15 లక్షల మంది ఇతర జీవనోపాధి మార్గాల్లో ఉపాధి పొందుతున్నారు. మొత్తం 5,82,662 మంది ఆర్థిక సాధికారత సాధించడానికి వైఎస్సార్‌ చేయూత పథకం ఉపయోగపడింది. 

అప్పుడు, ఇప్పుడు అదే బడ్జెట్‌
ఇంతకు ముందు పరిపాలనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పుడూ, ఇప్పుడూ అదే బడ్జెట్‌. అప్పుడు చేసిన అప్పుల కన్నా, ఇప్పుడు చేసిన అప్పులు తక్కువే. కానీ అప్పటి ప్రభుత్వంలో ఇంతగా లబ్ధి ఎందుకు జరగలేదు.. ఇప్పుడు ఎలా జరుగుతోంది.. మీరే ఆలోచించండి. è ఆ రోజుల్లో దోచుకో.. పంచుకో.. తినుకో.. పద్ధతి ఉండేది. కేవలం నలుగురు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడు.. వారికి తోడు గ్రామాల్లో జన్మభూమి కమిటీలు ఉండేవి. అప్పుడు ప్రజలకు డబ్బు పోయేది కాదు. ఇవాళ బటన్‌ నొక్కుతున్నాం.. నేరుగా మీ (లబ్ధిదారుల) ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement