AP: పరిశుభ్రతకు పెద్దపీట | AP CM YS Jagan Review Meeting On Clean Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: పరిశుభ్రతకు పెద్దపీట

Published Fri, Oct 22 2021 2:39 PM | Last Updated on Sat, Oct 23 2021 12:46 PM

AP CM YS Jagan Review Meeting On Clean Andhra Pradesh - Sakshi

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాలపై క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడమే కాకుండా వాటిని పరిశుభ్రంగా ఉంచేలా నిర్వహించడంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా నీరు, గాలిలో కాలుష్యంపై పరీక్షలు చేయించాలి. గ్రామంలో పారిశుధ్యంపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని చర్యలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా తాగునీటి ట్యాంకులను  శుభ్రం చేయించాలి. వ్యాధులు ప్రబలకుండా  తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టి పెట్టాలి.  – సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని చెప్పారు. ఇందుకు కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) కార్యక్రమాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ్రేడ్‌ 2, గ్రేడ్‌ 3 నగర పంచాయతీలకు క్లాప్‌ కింద నిర్దేశించిన వాహనాలన్నింటినీ ఆయా ఊళ్లకు త్వరగా చేరవేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో సాలిడ్‌ వేస్ట్‌ ప్రాసెసింగ్‌ సెంటర్లు (ఎస్‌డబ్ల్యూపీసీ), అర్బన్‌లో 72 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌ (ఐఎస్‌డబ్ల్యూఎం) ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని,  జూన్‌ 2022 నాటికి ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు వివరించారు.

ఇప్పటి వరకు చెత్త సేకరణకు 30 లక్షల డస్ట్‌బిన్స్‌ సరఫరా చేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి డస్ట్‌బిన్స్‌ అందించాలని సీఎం ఆదేశించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసుకోవాలని, సంబంధిత కంపెనీలతో  మాట్లాడుకుని ఆయా వాహనాలను సత్వరమే తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

దుర్వాసన రాకుండా చర్యలు
నగరాలు, పట్టణాల్లో గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల నుంచి సమీపంలోని ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడమే కాకుండా ఆ ప్రాంతంలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలి. 
 గుంటూరులో వ్యర్థాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి కర్మాగారం (వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌– డబ్ల్యూటీఈ) సిద్ధమైన నేపథ్యంలో.. మరో రెండు ప్రతిపాదిత ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి పెట్టాలి. 
ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మురుగు నీటి నిర్వహణపై దృష్టి
మురుగు నీటి కాల్వల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలి. ఎక్కడా కూడా మురుగు నీరు నిల్వ లేకుండా చేయాలి. దీన్నొక సవాల్‌గా తీసుకోవాలి. అవసరమైన ప్రాంతాల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలి.
మురుగు నీటి శుద్ధి ప్లాంట్లలో అత్యాధునిక విధానాలను పాటించాలి. క్లాప్‌ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సమర్థులైన అధికారులను పెట్టాలి. వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement