AP CM YS Jagan Review Meeting On Cyclone Mandous - Sakshi
Sakshi News home page

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీఎం జగన్‌ 

Published Mon, Dec 12 2022 9:22 AM | Last Updated on Tue, Dec 13 2022 8:08 AM

AP CM YS Jagan Review Meeting On cyclone Heavy Rains Updates - Sakshi

సాక్షి, అమరావతి: తుపాను, భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పట్ల అత్యంత ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పంట నష్టాల ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా ఉండాలని సూచించారు. తుపాను, భారీ వర్షాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.

ఎక్కడా రైతులు నిరాశకు గురి కాకూడదు 
పంట నష్టాల ఎన్యుమరేషన్‌లో రైతులు ఎక్కడా నిరాశకు గురి కాకూడదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. రంగు మారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా సరే కొనుగోలు చేయట్లేదన్న మాట ఎక్కడా రాకూడదన్నారు. తక్కువ రేటుకు కొంటున్నారన్న మాటే ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ రైతులు బయట విక్రయించదలచినా సరే వారికి రావాల్సిన రేటు (మద్దతు ధర) కంటే ఎక్కువ ధర లభించాల్సిందేనని సూచించారు. ఆ రేటు దక్కేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనన్నారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు అంతా ఈమేరకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

80 శాతం సబ్సిడీతో విత్తనాలు
పంటలు దెబ్బ తిన్నచోట మళ్లీ పంటలు సాగు చేసేందుకు వీలుగా 80 శాతం సబ్సిడీతో విత్తనాలను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు సబ్సిడీ విత్తనాలు అందాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే బాధిత కుటుంబానికి రూ.2 వేలతో పాటు రేషన్‌ సరుకులు అందించాలని సూచించారు. ప్రభుత్వం పట్టించుకోలేదనే మాటే రాకూడదని, ఇళ్లలోకి నీరు చేరితే కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్లు అంతా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 

బాధితులందరికీ సాయం అందాలి..
పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా బాధితులందరికీ సహాయాన్ని అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గోడకూలి ఒకరు మరణించారనే సమాచారం వచ్చిందని, బాధిత కుటుంబానికి వెంటనే పరిహారాన్ని అందించాలని సూచించారు. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగితే ఆ పరిహారం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నష్ట పరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించి వచ్చే వారం రోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని నిర్దేశించారు. 
పూరిళ్లు/కచ్చా ఇళ్లు కూలిపోయిన బాధితులకు రూ.4,100 చొప్పున, పశువులు చనిపోతే రూ.30 వేలు చొప్పున, చెట్లు కూలిపోతే నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్యుమరేషన్‌ చేపట్టి వారం రోజుల్లోగా పూర్తి చేసి వెంటనే సాయం అందించాలని నిర్దేశించారు. సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ(ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి.హరికిరణ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement