కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు | AP Disha Bills Under Consideration Of Central Home Department | Sakshi
Sakshi News home page

కేంద్ర హోంశాఖ పరిశీలనలో దిశ బిల్లులు

Published Thu, Jul 29 2021 3:47 PM | Last Updated on Thu, Jul 29 2021 5:02 PM

AP Disha Bills Under Consideration Of Central Home Department - Sakshi

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను పరిశీలిన అనంతరం తమ అభిప్రాయాలను జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు - క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు ఆమె తెలిపారు.

దిశ (క్రిమినల్‌ లా సవరణ) బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి 2020 జనవరి 21న తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి చెప్పారు. ఈ బిల్లుపై మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించాం. అనంతరం మా అభిప్రాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును మా మంత్రిత్వ శాఖకు పంపించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి గత జూన్‌ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు.

మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచార నేరాలనుత్వరితగతిన విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉద్దేశించిన మరో బిల్లు 2020 జనవరి 29న హోం మంత్రిత్వ శాఖ నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి తెలిపారు. దీనిపై కూడా తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా బిల్లును ఈ ఏడాది జనవరి 11న హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది. దానిపై కూడా మా అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు తెలియచేయడం జరిగింది. ఈ రెండు దిశ బిల్లులు ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement