సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ నూతన విద్యావిధానం–2020లో భాగంగా అమలు చేస్తున్న ‘ఏపీ ఫౌండేషనల్ స్కూల్’ స్టాల్ జీ–20 సదస్సులో ఆకర్షణగా నిలిచింది. కేంద్రంతోపాటు, విదేశీ ప్రతినిధులను సైతం ఆకట్టుకుంది. జీ–20 సదస్సుల్లో భాగంగా పూణెలో ‘జన్ భాగీదారి’ కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఏపీ పాఠశాల విద్యాశాఖ ‘ఫౌండేషనల్ స్కూల్’ నమూనాను ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ‘ఫౌండేషనల్ లెర్నింగ్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఆఫ్ వర్క్’ పేరిట ఏపీ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించామని, వివిధ రాష్ట్రాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, సమగ్ర శిక్షా ఎస్పీడీలు ఏపీ స్టాళ్లను సందర్శించి ప్రశంసించారని తెలిపారు. ‘నిపుణ్ ఆంధ్ర గీతం’ వీడియో ప్రదర్శనకు అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులు కితాబిచ్చారన్నారు.
7వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు, తరగతి గదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీల ఏర్పాటు, బైజూస్, ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన ఈ–కంటెంట్ గురించి అడిగి తెలుసుకున్నారన్నారు. ‘పునాది విద్య సాధన కోసం డిజిటల్, తరగతి గది మాధ్యమం’ అంశంపై చర్చించామన్నారు. వివిధ రాష్ట్రాలతోపాటు 29 దేశాలకు చెందిన విద్యాశాఖ మంత్రులు, విద్యా నిపుణులు ఏపీలో అమలు చేస్తున్న విద్యావిధానాలపై హర్షం వ్యక్తం చేశారన్నారు. అంతేకాకుండా మన పాఠశాలలను సందర్శించేందుకు ఆసక్తి చూపినట్టు చెప్పారు. రాష్ట్రంలో విద్యా సంస్కరణలపై రూపొందించిన వీడియోను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఏపీని ప్రశంసిస్తూ పోస్ట్ చేసిందన్నారు. జీ–20లో రాష్ట్రం తరఫున పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్‌తో పాటు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు నేతృత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment