విజయవాడలో ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతంలో దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పించేందుకే ఎగువన నీటిని మళ్లిస్తున్నామని, ఆ నీటిని లెక్కలోకి తీసుకోవద్దని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎగువనున్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయని, ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ దిగువన విజయవాడ, పరిసర ప్రాంతాలను వరద బారి నుంచి తప్పించడానికి, ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా నివారించడానికి నీటిని మళ్లిస్తున్నామని స్పష్టం చేసింది. మళ్లిస్తున్న నీటిని మిగులు జలాలుగా పరిగణించి.. విభజన చట్టంలో 11వ షెడ్యూల్‌లోని ఆరో పేరా నుంచి వాటిని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే..
► ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశంబ్యారేజీలు నిండిపోయాయి. స్పిల్ వే గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నాం.శనివారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీలోకి 1.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే స్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తున్నాం.
► ప్రకాశం బ్యారేజీలోకి ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నాం. అదే స్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తే.. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న విజయవాడ, పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
► సముద్రంలో కలుస్తున్న మిగులు జలాలనే మళ్లిస్తున్నాం. వాటిని మిగులు జలాలుగానే పరిగణించి లెక్కలోకి తీసుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.
► వరద సమయంలో ఏ రాష్ట్రం నీటిని మళ్లించినా.. వాటిని ఆ రాష్ట్రం కోటా కింద పరిగణించకూడదని కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment