
సాక్షి, అమరావతి: కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన, శాశ్వత అంగవైకల్యం బారిన పడే కల్లు గీత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకాన్ని ప్రకటించింది. ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి పడి మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబానికి కూడా రూ.10లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. చెట్టుపై నుంచి పడి శాశ్వత అంగవైకల్యం బారినపడే కల్లుగీత కార్మికునికి కూడా రూ.10లక్షలు పరిహారం అందిస్తారు.
ఇందులో రూ.5 లక్షలు కార్మిక శాఖ, మరో రూ.5లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా రూపంలో అందిస్తాయి. కల్లు తీస్తూ ప్రమాదవశాత్తూ అంగవైకల్యం బారిన పడినవారు దరఖాస్తు చేసుకుంటే ఎక్సైజ్ శాఖ నిబంధనలకు అనుగుణంగా వైకల్యం సర్టిఫికెట్‌ను జారీచేస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన రాష్ట్ర కల్లుగీత విధానం 2022–2027 ప్రకారం ఈ పరిహారాన్ని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
కల్లు గీత కార్మికులకు నిజమైన భరోసా..
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘వైఎస్సార్ గీత కార్మిక భరోసా’ పథకం రాష్ట్రంలోని లక్షలాది మంది గీతకార్మిక కుటుంబాలకు అండగా నిలవనుంది. రాష్ట్రంలో 95,245 కల్లు గీత కుటుంబాలు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఏటా 1,200 మంది గీత కార్మికులు కల్లు తీస్తూ ప్రమాదానికి గురవుతున్నారు. వారిలో దాదాపు 40శాతం మంది దుర్మరణం చెందుతుండగా మిగిలిన వారు శాశ్వతంగా వైకల్యం బారినపడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రమాదవశాత్తూ మరణించిన కుటుంబాలకు రూ.2లక్షలే పరిహారంగా అందించేవారు.
దీనిని పెంచాలని గీత కార్మిక కుటుంబాలు డిమాండ్ చేయడంతో చంద్రన్న బీమా పథకం నుంచి రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ సక్రమంగా అమలుచేయలేదు. ఈ నేపథ్యంలో.. ఎవరూ డిమాండ్ చేయకుండానే ప్రమాదవశాత్తూ మరణించే, శాశ్వతంగా వైకల్యం బారినపడే కల్లు గీత కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10లక్షల పరిహారాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తద్వారా కల్లు గీత వృత్తిపై ఆధారపడిన 95,245 కుటుంబాలకు ముఖ్యమంత్రి భరోసానిచ్చారు.
చదవండి: ప్రకృతి ప్రియులకు స్వర్గధామం.. చుట్టూ నీరు, మధ్యలో ఊరు
Comments
Please login to add a commentAdd a comment