సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనం ప్రచురించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) కె.శ్రీనివాసరెడ్డి శనివారం ఆమోద బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రై వేట్ లిమిటెడ్ ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, పబ్లిషర్ కోగంటి వెంకట శేషగిరిరావులకు లీగల్ నోటీసు పంపారు.
నేరపూరిత కుట్ర..
‘ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకే దురుద్దేశపూర్వకంగా ‘న్యాయ దేవతపై నిఘా’ పేరుతో కథనం ప్రచురించారు. ఈ కథనం వెనుక నేరపూరిత కుట్ర ఉంది. ఈ దురుద్దేశపూర్వక కథనం పరువు నష్టం కిందకు వస్తుంది. ఈ కథనంలో రాసిన వాటిలో ఏ మాత్రం వాస్తవం లేదు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు ఏవీ కూడా ఆంధ్రజ్యోతి ఆరోపించిన చర్యలకు పాల్పడలేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయాలన్న ముందస్తు కుట్రతోనే ఈ కథనాన్ని రచించారు. ప్రభుత్వం ఏకంగా న్యాయవ్యవస్థపై నిఘా వేసినట్లు తెలిస్తోంది.. అన్న వ్యాఖ్యం మీ దుష్ట ఆలోచనలకు నిదర్శనం. దీనిని బట్టి చూస్తే ఈ కథనం వెనుక ఎంతో లోతైన కుట్ర ఉందని అర్థమవుతోంది.
రాష్ట్రప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే...
మీరు మీ కథనంలో రాసిన ప్రతీ అంశాన్ని కూడా ప్రభుత్వం నిస్సందేహంగా తోసిపుచ్చుతోంది. మీ ఎజెండా ప్రకారం క్రియాశీలకంగా నడుచుకునే వ్యక్తులతో కలిసి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్రలో భాగంగా ఈ కథనాన్ని ప్రచురించారు. ఈ కథనాన్ని ప్రచురిస్తే ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని తెలిసే మీరు ఈ పనిచేశారు. వాస్తవాల ఆధారంగా కథనాలు ప్రచురించాల్సింది పోయి, సంబంధం లేని వ్యవహారాల్లో ప్రభుత్వాన్ని లాగి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై నేరారోపణలు చేశారు.
బేషరతుగా క్షమాపణ చెప్పాలి...
రాజకీయ ఎజెండా ఉన్న వ్యక్తులు, శక్తులతో కలిసి ప్రభుత్వాన్ని ప్రజల దృష్టిలో పలుచన చేయాలన్న ఉద్దేశంతో ఈ అసత్య కథనాన్ని వండివార్చారు. రాజ్యాంగం ప్రకారం అన్ని వ్యవస్థల, సంస్థల స్వతంత్రతను, స్వయం ప్రతిపత్తిని కాపాడే బాధ్యతను ఈ ప్రభుత్వం సక్రమంగా నెరవేరుస్తోంది. ప్రభుత్వ కొన్ని నిర్ణయాలపై న్యాయస్థానం ఇచ్చిన కొన్ని తీర్పులను కావాల్సిన విధంగా ఎంపిక చేసుకుని, వాటి ఆధారంగా ప్రభుత్వంపై నిందారోపణలు చేశారు. కొందరు న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం నిఘా పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ఎజెండాలో భాగంగానే ఈ కథనాన్ని ప్రచురించారు. ఈ కథనంపై వెంటనే బేషరతు క్షమాపణలు చెప్పాలి. లేనిపక్షంలో ప్రభుత్వం తీసుకునే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలి.’ అని శ్రీనివాసరెడ్డి తన లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆ కథనం.. ఓ నేరపూరిత కుట్ర
Published Sun, Aug 16 2020 3:40 AM | Last Updated on Sun, Aug 16 2020 8:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment