సాక్షి, అమరావతి: ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ఇచ్చిన మాట మేరకు ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక డీఏను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2022 జనవరి నుంచి ఇవ్వాల్సిన డీఏను 2.73 శాతం మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు డీఏను మంజూరు చేస్తూ జీవో 66ను, పెన్షనర్లకు డీఏను మంజూరు చేస్తూ జీవో–67ను రావత్ జారీ చేశారు.
పెంచిన డీఏ 2.73 శాతాన్ని ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తూ.. ఆగస్టు 1వ తేదీ వేతనాలతో కలిపి నగదు రూపంలో చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనవరి 2022 నుంచి ఈ ఏడాది జూన్ వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను ఈ ఏడాది సెప్టెంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది మార్చిలో మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌లో జమ చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
22.75 శాతానికి చేరిన డీఏ
ఇప్పుడు మంజూరు చేసిన డీఏతో కలిపి ఉద్యోగుల, పెన్షనర్ల మొత్తం డీఏ 22.75 శాతానికి చేరింది. ఈ సమయంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెంచిన డీఏ బకాయిలను పదవీ విరమణ బెనిఫిట్స్‌లో కలిపి చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. డీఏ పెంపు జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మునిసిపల్ కార్పొరేషన్, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సమితి, 2022లో సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న వర్క్ చార్జ్‌డ్ ఉద్యోగులకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
2022లో సవరించిన రెగ్యులర్ స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, ఎయిడెడ్ పాలిటెక్నిక్, యూన్నివర్సిటీ సిబ్బంది, ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ, వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
చెప్పిన మాట మేరకు ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకటరామిరెడ్డి సోమవారం కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: సీఎం జగన్‌తో యూఏఈ రాయబారి సమావేశం.. ఏపీలో పెట్టుబడులపై చర్చ
Comments
Please login to add a commentAdd a comment