సాక్షి, అమరావతి: ఎస్‌ఈసీ సొంతగా తయారు చేసుకున్న ఈ–వాచ్ యాప్‌లో సాంకేతిక, భద్రతాపరమైన లోపాలను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) గుర్తించిందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల కమిషన్ ఈ–వాచ్ యాప్ అభివృద్ధి కోసం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన సోర్స్ కోడ్‌ను ఉపయోగిస్తున్నట్టు ఏపీటీఎస్ పరీక్షల్లో తేలిందని, ఇది అతి పెద్ద భద్రతా లోపమని తెలిపారు. తమ సోర్స్ కోడ్ వాడుకునేందుకు సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి ఇచ్చినట్టు ఎన్నికల కమిషన్ ఎలాంటి ధ్రువీకరణ పత్రం చూపలేదని కోర్టుకు నివేదించారు.
ఆ సోర్స్ కోడ్‌ను ఉపయోగించడం వల్ల సాంఘిక సంక్షేమ శాఖ సమాచారానికి భద్రతాపరంగా ముప్పు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం రూపొందించిన ఈ–నిఘా యాప్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుంటే ప్రభుత్వానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని హైకోర్టు ప్రశ్నించగా.. ఎలాంటి అభ్యంతరం లేదని సుమన్ కోర్టుకు నివేదించారు. ఏపీటీఎస్ కోరిన వివరాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌కు సూచిస్తూ.. అప్పటివరకు ఈ–వాచ్ యాప్ వాడొద్దంటూ హైకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
ఈ–వాచ్ యాప్‌ను ఉపయోగించకుండా నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం యాప్‌లైన ‘సీ విజిల్’, ‘నిఘా’ యాప్‌లను ఉపయోగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఇంకొల్లు గ్రామానికి చెందిన న్యాయవాది కట్టా సుధాకర్, గుంటూరు తెనాలికి చెందిన అంగ్రేకుల నాగేశ్వరరావు, తెనాలి మండలం బుర్రిపాలెంకు చెందిన అడుసుమల్లి అజయ్‌కుమార్ వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వ న్యాయవాది పలు అంశాలను కోర్టుకు నివేదించిన దరిమిలా ఈసీ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనికుమార్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన సీ–విజిల్ యాప్‌ను పంచాయతీ ఎన్నికల కోసం వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అందుకు అనుమతివ్వాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ–నిఘా యాప్ పని చేయడం లేదని కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. ఆ యాప్‌ను ఎన్నికల కమిషన్ ఉపయోగించుకునేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని సుమన్ తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఏపీటీఎస్ కోరిన వివరాలను అందచేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఏపీటీఎస్ సర్టిఫికెట్ ఇస్తే తప్ప ఈ–వాచ్ యాప్ వినియోగంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి అప్పటివరకు ఏ రకంగానూ వినియోగంలోకి తేవద్దంటూ గతవారం తామిచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.
'ఈ–వాచ్'లో లోపాలెన్నో
Published Wed, Feb 10 2021 4:08 AM | Last Updated on Wed, Feb 10 2021 10:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment