సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్న నేపథ్యంలో.. ఇరుపక్షాలు సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఈ తీర్పు కాపీ అందుకున్న నాటినుంచి మూడురోజుల్లో సంప్రదింపులు మొదలు పెట్టాలని ఇరుపక్షాలను ఆదేశించింది. సంప్రదింపుల తేదీ, వేదికలను ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ముఖ్యకార్యదర్శుల స్థాయికి తగ్గని అధికారులు ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాలని స్పష్టం చేసింది. కోవిడ్–19కు సంబంధించి వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు, సూచనలు తదితరాలన్నింటినీ కూడా కమిషన్ ముందు ఉంచవచ్చునంది. ప్రభుత్వం తన వాదనలను లిఖితపూర్వకంగా కమిషన్ ముందు ఉంచవచ్చునని, అందుకు మద్దతుగా ఉన్న రికార్డులను కూడా సమర్పించవచ్చని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి మంగళవారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీచేశారు. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల కమిషన్ గతనెల 17న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యంపై గతవారం విచారణ జరిపిన జస్టిస్ శేషసాయి.. ఇరుపక్షాలు సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ దిశగా ఉత్తర్వులు జారీచేస్తానని చెప్పిన ఆయన మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తన ఉత్తర్వులను కోర్టు హాలులో చదివి వినిపించారు. కరోనా కారణంగా మొత్తం మానవాళి ఎంతో బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, ఎన్నికల కమిషనర్ తరఫున ఎన్.అశ్వనీకుమార్ చెప్పిన వాదనలను రికార్డ్ చేసినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను, విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇరుపక్షాలు సంప్రదింపుల ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం ఇంకేమైనా ఈ ఉత్తర్వులకు జతచేయాల్సి ఉందా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ.. ఎన్నికల నిర్వహణ నెల గురించి కూడా కమిషన్ వద్ద లేవనెత్తే వెసులుబాటు ఇవ్వాలని తమ వాదనల సందర్భంగా కోరామని గుర్తుచేశారు. రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ డ్రై రన్‌ను ప్రారంభించనుందన్నారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఈ డ్రై రన్ జరగనుందని, అందులో మన రాష్ట్రం కూడా ఉందని చెప్పారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వివరాలన్నింటినీ సంప్రదింపుల సమయంలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు. ఈ ఆదేశాల ద్వారా ప్రభుత్వ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment